అట్లయితే ఇండియా నుంచి వెళ్లిపోతం : వాట్సప్

అట్లయితే ఇండియా నుంచి వెళ్లిపోతం : వాట్సప్

  • వాట్సప్ మెసేజ్​లకు ఎన్​క్రిప్షన్ వద్దంటే.. సేవలు ఆపేస్తం 
  • ఢిల్లీ హైకోర్టుకు వాట్సప్, మెటా వెల్లడి 
  • ఐటీ రూల్స్ లోని రూల్ 4(2)లాంటిది ఎక్కడా లేదు
  • ఎన్​క్రిప్షన్ బ్రేక్ చేస్తే యూజర్ల గోప్యతకు భంగమని వాదనలు  
  • తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా

న్యూఢిల్లీ: మెసేజ్ లకు ఎన్ క్రిప్షన్ విధానాన్ని తొలగిస్తే వాట్సాప్ కనుమరుగు అవుతుందని, ఎన్ క్రిప్షన్ ను బ్రేక్ చేయాల్సిందేనంటే తాము ఇండియా నుంచి వెళ్లిపోతామని ఆ సంస్థ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ విధానం వల్ల పూర్తి గోప్యత ఉంటుందని, అందుకే ప్రజలు తమ యాప్ ను విస్తృతంగా వాడుతున్నారని చెప్పింది. వాట్సాప్ లో మెసేజ్ లను మొదట ఎవరు సృష్టించారన్నది తెలిసేలా ఎన్ క్రిప్షన్ విధానాన్ని బ్రేక్ చేయాలని చెప్పడం సరికాదని పేర్కొంది. 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021లోని రూల్ నంబర్ 4(2)ను సవాల్ చేస్తూ వాట్సాప్, దాని మాతృ సంస్థ ఫేస్ బుక్(మెటా) వేసిన కేసును గురువారం ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరాతో కూడిన బెంచ్ విచారించింది. వాట్సాప్ లో మొట్టమొదటి ఒరిజినేటర్ (మొదట మెసేజ్ చేసినవారు) గుర్తింపును వెల్లడించాలని ఈ నిబంధన చెప్తోందని.. ఇలా చేస్తే యూజర్ల ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం ఉందని వాట్సాప్  ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సంస్థ తరపున అడ్వకేట్ తేజస్  కరియా వాదనలు వినిపించారు. ‘‘ప్రైవసీ ఫీచర్ వల్లే ప్రజలు మా ప్లాట్ ఫాంను వాడుతున్నారు. ఈ ఫీచర్ వల్ల మెసేజీలు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్ట్  (మెసేజ్ లో ఏముందో పంపే వ్యక్తికి, స్వీకరించే వ్యక్తికి తప్ప మూడో వ్యక్తికి తెలియకుండా ఒక కోడ్ భాషలోకి మారడం) అవుతాయి. ఇప్పుడు ఆ ఎన్ క్రిప్షన్ విధానాన్ని తొలగిస్తే యూజర్ల ప్రైవసీ దెబ్బతింటుంది. అలా చేయాల్సి వస్తే దేశంలో వాట్సాప్ సేవలు అందించబోం” అని స్పష్టం చేశారు. 

ఇలాంటి రూల్ ఎక్కడా లేదు.. 

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఐటీ రూల్స్ లోని రూల్ 4(2)ను పాటించాలంటే.. కోట్లాది మెసేజ్ లను కొన్ని ఏండ్లపాటు స్టోర్ చేయాల్సి వస్తుందని తేజస్ కరియా చెప్పారు. నిజానికి ఎన్ క్రిప్షన్ ను బ్రేక్ చేయాలన్న అంశం ఐటీ రూల్స్ కు మాతృకగా ఉన్న ఐటీ చట్టంలో కూడా లేదన్నారు. ‘‘ఇలాంటి చట్టం ప్రపంచంలో మరెక్కడన్నా ఉందా? ఎక్కడైనా కేసులు నడిచాయా? ఇన్ఫర్మేషన్ ను షేర్ చేసుకోవాలని మిమ్మల్ని సౌత్ అమెరికాలో అయినా అడిగారా?” అని బెంచ్ ప్రశ్నించింది. 

బ్రెజిల్ లో సైతం ఇలాంటి రూల్ లేదని కరియా జవాబు చెప్పారు. కాగా, వాట్సాప్ దానిని టేకోవర్ చేసిన ఫేస్ బుక్ (మెటా) సంస్థ యూజర్ల సమాచారాన్ని వాణిజ్య కార్యకలాపాలకు వాడుకొని డబ్బు సంపాదిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు కోర్టుకు తెలిపింది. ఈ అంశంపై ఫేస్ బుక్ యాజమాన్యం జవాబుదారీగా ఉండాలని పలు దేశాల్లోని రెగ్యులేటరీ సంస్థలు కూడా స్పష్టం చేశాయని పేర్కొంది. తాజాగా కేంద్రం తరఫున అడ్వకేట్ కీర్తిమన్ సింగ్ వాదిస్తూ.. మెసేజీలను ట్రేస్ చేసే మెకానిజం ఒకటి ఉండాలన్నదే ఐటీ రూల్ 4(2) ఉద్దేశమని తెలిపారు. ఈ విషయంలో వాట్సాప్ ను అమెరికన్ కాంగ్రెస్ కూడా పలు కీలక ప్రశ్నలు వేసిందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను కోర్టు ఆగస్టు14కు వాయిదా వేసింది.  

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-27T01:09:29Z dg43tfdfdgfd