అమెరికా యూనివర్సిటీల్లో వందల మంది విద్యార్థుల అరెస్టులు...అసలు అక్కడేం జరుగుతోంది?

గాజాలో యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని యూనివర్సిటీల్లో జరుగుతున్న నిరసనలకు సంబంధించి వందల మంది విద్యార్థులను ఇప్పటికే అరెస్టు చేశారు.

తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో గ్రీన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జిల్ స్టెయిన్ కూడా ఉన్నారు.

ఇజ్రాయెల్‌తో సంబంధమున్న వ్యక్తులు, వ్యాపారం చేస్తున్న కంపెనీలపై నిషేధం విధించాలని ఈ నిరసనల్లో పాల్గొంటున్న వారు డిమాండ్ చేస్తున్నారు.

అయితే, కొంతమంది నిరసనకారులు తమపై వివక్ష చూపించేలా వ్యవహరిస్తున్నారని కొందరు యూదు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

మిసౌరీలోని సెయింట్ లూయిస్‌లో అరెస్టైన దాదాపు 80 మందిలో స్టెయిన్ కూడా ఉన్నారని ఆమె అధికార ప్రతినిధి చెప్పారు. తనకు తెలిసినంతవరకూ ఇప్పటివరకు స్టెయిన్‌పై ఎలాంటి అభియోగాలు మోపలేదని అన్నారు.

రిమోట్ టీచింగ్..

నిరసనల నడుమ రిమోట్ టీచింగ్‌కు మారిన విద్యా సంస్థల్లో కాలిఫోర్నియా స్టేట్ పాలిటెక్నిక్ కూడా చేరింది. నేరుగా యూనివర్సిటీకి వచ్చి విద్యా బోధన చేపట్టకుండా నిరసనకారులు అడ్డుకుంటున్నారు. కొన్నిచోట్ల డిగ్రీ పట్టాల ప్రదానోత్సవాలు కూడా వాయిదా పడ్డాయి.

కొలంబియాలోని కాలేజ్ గ్రీన్‌లో ఏప్రిల్ 17వ తేదీనే నిరసనకారుల గుడారాలు కనిపించాయి. అక్కడి నుంచి నిరసనలు ఇతర ప్రాంతాలకూ వ్యాపించాయి. కాలేజ్ గ్రీన్‌లో విద్యార్థులను చెరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను కూడా ప్రయోగించారు. అక్కడ వంద మందికిపైగా విద్యార్థులను అరెస్టు చేశారు.

అనంతరం కనెక్టికట్‌లోని యేల్ యూనివర్సిటీలోనూ విద్యార్థులు శిబిరాలు ఏర్పాటుచేశారు.

బోస్టన్‌లోని నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీలో టెంట్లను తొలగించాల్సిందిగా మసాచుసెట్స్ స్టేట్ పోలీసులు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోవడంతో 100 మందికిపైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత అక్కడి టెంట్లను తొలగించారు.

యూనివర్సిటీతో సంబంధంలేని కొందరు ప్రొఫెషనల్ ఆర్గనైజర్లు ఆ నిరసనలను నడిపిస్తున్నారని నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ ఎక్స్ (ట్విటర్‌)లో రాసుకొచ్చింది. ‘‘యూదు విద్యార్థులే లక్ష్యంగా వేధింపులకు కూడా పాల్పడుతున్నారు. ఇలాంటివి క్యాంపస్‌లో అసలు సహించేదిలేదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఆ ఆరోపణలను నిరసనకారులు ఖండించారు.

దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీలోని పూర్వవిద్యార్థుల పార్క్‌లో ఆందోళనలను వెంటనే విరమించుకోవాలని పోలీసులు ఆదేశించిన తర్వాత కూడా క్యాంపస్‌లో పాలస్తీనా అనుకూల నిరసనలు కనిపించాయి. ఇక్కడ నిరసనలు శాంతియుతంగా జరిగినట్లు ఆందోళనకారులు చెబుతున్నారు, అయితే, శనివారం నాటి నిరసనల్లో ఇక్కడ కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారని యూనివర్సిటీ యాజమాన్యం చెబుతోంది.

‘‘కొన్ని గ్రూపులకు చెందిన వ్యక్తులు అక్రమంగా మా క్యాంపస్‌లో తిష్టవేశారు. ఒక విగ్రహంతోపాటు ఫౌంటెయిన్‌ను కూడా ధ్వంసం చేశారు’’ అని యూనివర్సిటీ యాజమాన్యం చెప్పింది. విద్యార్థేతరులు క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా ప్రస్తుతం ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.

ఇండియానా యూనివర్సిటీలోనూ శనివారం 23 మంది అరెస్టు చేశారు.

ఇతర ప్రాంతాల్లో

జార్జియాలోని కొలంబియా, ఎమోరీ యూనివర్సిటీలు శనివారం ప్రశాంతంగా కనిపించాయి.

గాజాలో ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీల్లో నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఇజ్రాయెల్ దాడుల్లో 34,000 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆరోగ్య శాఖ చెబుతోంది.

నిరుడు అక్టోబరులో హమాస్ సాయుధులు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు, విదేశీయులను హత్యచేయడంతోపాటు 253 మంది బందీలుగా తీసుకెళ్లడంతో గాజాపై ఇజ్రాయెల్ దాడులను మొదలుపెట్టింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-04-28T15:23:46Z dg43tfdfdgfd