అరకు: నోటా ఓట్లలో దేశంలోనే రెండోస్థానంలో నిలిచిన నియోజకవర్గం, ఇక్కడి ప్రజలు నోటాను ఎందుకు ఎంచుకుంటున్నారు?

ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్ సభ స్థానాల్లో అరకు ఒకటి. దాదాపు 15.39 లక్షల మంది ఓటర్లున్న ఈ ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం 2019 సార్వత్రిక ఎన్నికల్లో నోటా ఓట్లు ఎక్కువగా పోలైన నియోజకవర్గాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.

2019 ఎన్నికల్లో బీహార్‌లోని గోపాల్‌గంజ్ నియోజకవర్గంలో అత్యధికంగా ‘నోటా’కు ఓట్లు పోలైతే, ఆ తర్వాతి స్థానంలో అరకు నిలిచింది. గోపాల్‌గంజ్‌లో 51,660 ఓట్లు ‘నోటా’కి రాగా, అరకులో 47,977 ఓట్లు నోటాకు పోలయ్యాయి.

అరకు పార్లమెంట్ నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ నియోజకవర్గం ఒక చివరి నుంచి మరో చివరకు ప్రయాణించాలంటే దాదాపు 400 కిలోమీటర్లు ఉంటుంది.

ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న అరకు పేరుతోనే ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైంది.

గిరిజన ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్న అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 50 వేల ఓట్లు ‘నోటా’కు పోలవడం దేనికి సంకేతం? అసలు ఇన్ని వేల ‘నోటా’ ఓట్లు రావడానికి కారణాలేంటి? దీనిపై అక్కడ గిరిజనం ఏమంటున్నారు? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్.

పాలకొండ నుంచి రంపచోడవరం వరకూ..

నోటా ఓట్లు ఎక్కువగా పోలైన అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని పరిస్థితులు తెలుసుకునేందుకు బీబీసీ అక్కడ పర్యటించింది.

ఈ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోకవర్గాలున్నాయి. వీటిలో అరకు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లోని ఓటర్లతో బీబీసీ మాట్లాడింది.

2009 ఎన్నికలకు ముందు పార్వతీపురం లోక్ సభ స్థానం ఉండేది. 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం అరకు పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైంది. గతంలో ఈ నియోజకవర్గం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉండేది.

తాజాగా ఏపీలో జిల్లాల పునర్వవ్యస్థీకరణ అనంతరం, కొత్తగా ఏర్పాటైన పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలు అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చాయి.

అరకు ఎస్టీ రిజర్వుడ్ సీటు. భౌగోళికంగా పెద్ద నియోజకవర్గంగా చెప్పొచ్చు. పాలకొండ నుంచి రంపచోడవరం వరకూ అరకు నియోజకవర్గం విస్తరించి ఉంది. ఈ నియోజకవర్గ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో 6 ఎస్టీ రిజర్వుడ్ కాగా, ఒకటి (పార్వతీపురం) ఎస్సీ రిజర్వుడ్ స్థానం.

గత పార్లమెంట్ ఎన్నికల్లో పోలైన 'నోటా' ఓట్ల సంఖ్యలో అరకు పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందనే లెక్కలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన 'జనరల్ ఎలక్షన్స్ 2019: యాన్ అట్లాస్'లో పేర్కొంది.

“2014లో అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ‘నోటా’కి 16,562 ఓట్లు రాగా, అది 2019 ఎన్నికల్లో సుమారు 48 వేలకు పెరిగింది. ఇది పాలకులపై ఓటర్లకున్న అసంతృప్తిని తెలియజేస్తోంది” అని ఏపీ గిరిజన సంఘం నాయకులు కె. గోవిందరావు బీబీసీతో చెప్పారు.

‘నోటా’ అంటే మాకు తెలుసు: అరకు ఓటర్లు

నోటా అంటే None of the Above అని అర్థం. అంటే ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులెవరికీ తన ఓటు వేయకూడదని ఓటరు అనుకుంటే.. ఆ నిర్ణయాన్ని తెలియజేసేలా ‘నోటా’కు ఓటు వేయవచ్చు. ‘నోటా’కు ఓటు వేసే అవకాశాన్ని ఓటరుకు కల్పించాలని 2013 సెప్టెంబర్ 27న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

“నాకు ‘నోటా’ అంటే తెలుసు. నేను ఇంటర్ వరకు చదువుకుని ఆపేశాను. కానీ, రోజు పేపర్లు చదువుతాను. టీవీల్లో రాజకీయ వార్తలు చూస్తాను. ‘నోటా’పై నాకు అవగాహన ఉంది. నాలాగే మా ఊరిలో చాలా మందికి ‘నోటా’ ఓటుపై అవగాహన ఉంది. గత ఎన్నికల్లో అరకు దేశంలోనే ఎక్కువ ‘నోటా’ ఓట్లు పొందిన నియోజకవర్గాలలో రెండో స్థానంలో నిలిచిందనే వార్తలు చూశాం'' అని శివలింగాపురానికి చెందిన సతీశ్ బీబీసీతో చెప్పారు.

''ఈ ప్రాంతంలో ‘నోటా’కు వేశారంటే.. పాలకులు, వారు చేసిన అభివృద్ధి నచ్చలేదనే అర్థం చేసుకోవాలి” అన్నారాయన.

''నేను 35 ఏళ్లుగా ఓటు వేస్తున్నాను. మొదట్లో తెలియక అన్నింటిపైనా ఇంక్ మార్క్ వేశాను. ఆ తర్వాత ఓటు ఎలా వేయాలో మాకు కొందరు గ్రామంలోని పెద్దలు చెప్పారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఓటు తప్పుగా వేయలేదు. ఇప్పడు ఈవీఎంలలో కూడా నేను ఎవరికి ఓటు వేయాలని అనుకుంటున్నానో చూసి మరీ ఓటు వేయగలను” అని తీగలమడ గ్రామానికి చెందిన సన్యాసమ్మ బీబీసీతో చెప్పారు.

గత 30 ఏళ్లుగా చింతపండు అమ్ముతూ సన్యాసమ్మ జీవనం సాగిస్తున్నారు.

రోడ్డు వేయకుండానే నిధులు మింగేశారు: గిరిజనులు

గిరిజన ప్రాంతాల్లో ప్రధానంగా రోడ్లు, మంచినీరు, వైద్యం, భూమి, విద్యుత్ సమస్యలనే గిరిజనులు ప్రస్తావిస్తున్నారు.

“మాకు రోడ్డు లేదు. కొండలు, వాగులు దాటి గ్రామానికి చేరుకుంటున్నాం. మా గ్రామానికి రోడ్డు వేశామని చెప్పి అధికారులు డబ్బులు కూడా తినేశారు. కానీ, రోడ్డు పని జరగలేదు. బీబీసీలో కథనం రావడంతో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. అసలు రోడ్డు ఎలా ఉంటుందో చూడని గ్రామాలు ఏజెన్సీలో అనేకం ఉన్నాయి. గెలిచిన తర్వాత ఎంపీలు, ఎమ్మేల్యేలు మాకు కనిపించరు. అభివృద్ధి జరగలేదనే కోపం కూడా ‘నోటా’ ఓట్లకి కారణం కావొచ్చు” అని కడరేవు గ్రామానికి చెందిన రాజు బీబీసీతో చెప్పారు.

“మా గిరిజన గ్రామాల్లో ప్రధాన కేంద్రాలకు దగ్గరగా ఉంటున్న వాళ్ల కుటుంబాల్లో చదువుకున్న వారు ఉంటున్నారు. అదే కొండల్లో నివసించే పీటీజీ (ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్) లలో చదువుకునే వారు తక్కువే. వారు రోడ్లు, ఆసుపత్రి సౌకర్యం, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కోరుతున్నారు. అవి కూడా కల్పించకపోవడంతోనే కొందరు అసంతృప్తితో నోటాకి ఓటు వేయవచ్చు. ఇంతక ముందులా కాదు, ఇప్పుడు అభివృద్ధి పనులు, ఓటింగు, ‘నోటా’ ఓటు ఇలా అన్ని అంశాలపై చాలా వరకు గిరిజన గ్రామాల్లో కూడా చర్చ జరుగుతోంది” అని కురుపాంకి చెందిన రాము బీబీసీతో చెప్పారు.

ప్రధాన కేంద్రాలు మినహా అన్నీ కొండలే..

అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలైన పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ప్రధాన కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలు మినహా మిగిలిన నియోజకవర్గమంతా కొండ ప్రాంతంలోనే విస్తరించి ఉంటుంది.

కొండ ప్రాంతాల్లో ఉంటున్న వారు ఎంతో అత్యవసరమైతే మినహా మైదాన ప్రాంతాలకు రారు. తీగలమడ, చిట్టాలగరువు, దాయర్తి, కడరేవు, కివర్ల, పేదకోట, తోటగొడిపుట్ వంటి అనేక గిరిజన గ్రామాలున్నాయి. ఇక్కడ రోడ్డు సౌకర్యం ఉండదు. బాహ్య ప్రపంచంతో దాదాపుగా సంబంధాలు ఉండవు. దాయర్తి, కడరేవు, కివర్ల, పేదకోట, తోటగొడిపుట్ వంటి గ్రామాల్లోని గిరిజనుల సమస్యలపై బీబీసీ కథనాలు ప్రచురించింది.

ఇటువంటి గ్రామాల్లోని ప్రజలకు ఓటింగ్‌పై అవగాహన ఉండదు. పైగా వీరిలో ఎక్కువ శాతం నిరక్ష్యరాస్యులే. బీబీసీ క్షేత్ర స్థాయిలో పరిశీలించిన గ్రామం చిట్టాలగరువులో చదువుకున్న వారు పెద్దగా కనిపించలేదు. అంతా జీడితోటలు, ఉపాధి హామీ పనులు చేసుకునే వారే ఉన్నారు. వీరు తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు.

“ఎన్నికల సమయంలో నాయకులు రావడం ఓట్లు అడగడమే కానీ, మా కష్టాలు తీర్చిన వారే లేరు. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో మేం బయట ప్రపంచంతో సంబంధాలు నెరపలేకపోతున్నాం. నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం శూన్యం. మాకు ఏ నాయకుడున్నా ఒకటే. మా ప్రాంతాన్ని, మమ్మల్ని పట్టించకోని ఏ నాయకుడు వస్తే మాకేంటి, లేకపోతే మాకేంటి” అని అనంతగిరి మండలం చిట్టాలగరువుకి చెందిన రాధ బీబీసీతో అన్నారు.

అవగాహన కల్పించాలి: వాబీ

‘నోటా’కి ఓట్లు ఎక్కువగా పడుతుండడానికి ఇటీవల కాలంలో గిరిజనులకు పాలకులపై పెరుగుతున్న అసంతృప్తి ఒక కారణం కావొచ్చని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబీ యోగేశ్వరరావు బీబీసీతో అన్నారు.

''ఉదాహరణకు, అరకు అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుంటే అరకు టౌన్ ఒకటి మాత్రమే రోడ్డుకు సమీపంలో ఉంటుంది. మిగిలిన గ్రామాలన్నీ దాదాపుగా కొండల్లోనే ఉంటాయి. ఇక్కడ అధికారులు ఓటర్లకి అవగాహన కల్పించడంలో లోపం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఓటు ఎలా వేయాలి? ఎక్కడ వేయాలి? ఏ గుర్తు ఎక్కడ ఉంటుంది? అనేది అవగాహన కల్పించాలి. రాజకీయ పార్టీలు కూడా ఓటింగ్ సిస్టంపై అవగాహన కల్పిండంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. వీటి వలనే ‘నోటా’ ఓట్లు ఎక్కువ పడుతున్నాయి” అని వాబీ యోగేశ్వరరావు బీబీసీతో అన్నారు.

“అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో అరకు టౌన్ మినహా, మిగతా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. అందువల్ల కొంతమంది విద్యావంతులు ఈ నాయకులకి వేసే కన్నా నోటాకి వేయడం వల్ల కనీసం తమ వ్యతిరేకత తెలుస్తుందని ఆలోచిస్తున్నారు. గత ఎన్నికల్లో అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో 2,32,337 ఓట్లు ఉంటే.. 10 వేలు ‘నోటా’కే పోలయ్యాయి” అని అరకు టౌన్ కు చెందిన ప్రశాంత్ అన్నారు.

ఈ సారి ‘నోటా’ ఓడిపోతుంది: అభ్యర్థులు

గత ఎన్నికల్లో అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో నోటాకి పోలైన ఓట్లు దేశంలోనే రెండో స్థానాన్ని పొందాయనే విషయాన్ని ఈ ఎన్నికల్లో అరకు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, వైసీపీ అభ్యర్థి చెట్టి తనుజారాణిల వద్ద బీబీసీ ప్రస్తావించింది.

“మైదాన ప్రాంతాల్లో ఉండే వారి కంటే గిరిజన ప్రాంతాల్లో ఉండే వారు అన్నీ పరిశీలిస్తుంటారు. కాకపోతే వారి వాదన బయట ప్రపంచానికి తెలిసే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే వారు అవకాశం వచ్చినప్పుడు వారి బలం చూపిస్తారు. గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను ఎంతో అభివృద్ధి చేసింది. అరకు అభివృద్ధి కోసం రూ. 5 వేల కోట్లు ఇస్తే.. దానితో కొంత అభివృద్ధి పనులు జరిగినా, చాలా వరకు నిధులు దారిమళ్లాయి. అందుకే ఈసారి ఇక్కడి ఓటర్లు ఈ విషయాలన్నీ తెలుసుకుని అభివృద్ధి చేసే పార్టీకి ఓటు వేసి, ‘నోటా’కి దూరం అవుతారని భావిస్తున్నా” అని కొత్తపల్లి గీత అన్నారు.

''2019 ఎన్నికల్లో నోటాకి ఎక్కువ ఓట్లు పడడానికి గిరిజనులకు ఓటింగ్‌పై అవగాహన కల్పించకపోవడం ఒక కారణం కావొచ్చు. అలాగే ఎక్కువ నిరక్ష్యరాస్యులే ఉండటంతో ఈవీఎం మిషన్ల వినియోగంపై అంత అవగాహన లేకపోవచ్చు. దీంతో వారు వేయాలనుకునే పార్టీకే వేశామనుకుని ‘నోటా’ బటన్ నొక్కి ఉండవచ్చు. ఈసారి నోటా ఓట్లు బాగా తగ్గిపోతాయని అనుకుంటున్నా. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్ని ఎప్పుడూ లేనంతగా అభివృద్ధి చేసింది” అని చెట్టి తనుజారాణి బీబీసీతో చెప్పారు.

విద్య, ఆరోగ్యం, రోడ్లు, అటవీ భూమి హక్కులు, గృహాలు, విద్యుత్, జీవనోపాధి అవకాశాల కోసం వారు చేస్తున్న పోరాటాలు తెలియజేయడం కోసం గిరిజనులు నోటాకి ఓటు వేసి ఉండవచ్చని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిల్లో సురేంద్ర అన్నారు.

గిరిజనుల్లో అక్షరాస్యత తక్కువగా ఉండడంతో పాటు ఈవీఎం వినియోగంపై అవగాహన లేకపోవడం కూడా మరో కారణమన్నారు. పోలింగ్ కేంద్రాలలో సరైన వెలుతురు లేకపోవడం కూడా ‘నోటా’ ఓట్ల సంఖ్య పెరగడానికి కారణమై ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1.55 లక్షల నోటా ఓట్లు రాగా, 2019లో అది మూడు రెట్లు పెరిగి 4.1 లక్షలకు చేరుకుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-05-05T05:26:15Z dg43tfdfdgfd