అల్‌‌ జజీరా వార్తా సంస్థపై ఇజ్రాయెల్ నిషేధం

ఇజ్రాయెల్‌లో అల్ జజీరా వార్తా సంస్థను నిషేధిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.

ఖతర్‌కు చెందిన ఈ న్యూస్ నెట్‌వర్క్‌ను ‘‘రెచ్చగొట్టే సంస్థ’’ అని ఆరోపిస్తూ, ఏకగ్రీవంగా క్యాబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకుందని చెప్పారు.

అయితే, అల్‌ జజీరా దీన్ని ఖండించింది. ఈ చర్యను నేరపూరితమని అభివర్ణించింది.

గాజాలోకి వెళ్లకుండా విదేశీ జర్నలిస్టులను నిషేధించారు. గాజాలో ఉన్న కొద్ది మంది రిపోర్టర్లలో అల్ జజీరా సిబ్బంది కూడా ఉన్నారు.

అల్ జజీరా నెట్‌వర్క్ ఇజ్రాయెల్ వ్యతిరేకి అంటూ కొన్నేళ్లుగా ఇజ్రాయెల్ అధికారులు ఆరోపిస్తున్నారు.

గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసినప్పటి నుంచి ఈ వార్తా సంస్థపై ఇజ్రాయెల్ విమర్శలు తీవ్రమయ్యాయి. నాటి హమాస్ దాడిలో 1200 మంది చనిపోగా, 250 మందికి పైగా బందీలయ్యారు. వీరిలో 128 మంది ఆచూకీ తెలియకపోగా, 34 మందికి పైగా చనిపోయినట్ల భావిస్తున్నారు.

హమాస్ అధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, అక్టోబర్ 7నుంచి గాజాలో 34,683 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. 78, 018 మంది గాయపడ్డారు.

అల్‌జజీరాకు హమాస్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ అధికారులు అంటున్నారు. ఈ వ్యాఖ్యలను అల్ జజీరా నెట్‌వర్క్ కొట్టిపారేసింది.

గత నెలలో ఇజ్రాయెల్ పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం, హమాస్‌తో యుద్ధం సందర్భంగా జాతీయ భద్రతకు ముప్పుగా భావించే విదేశీ వార్తా ప్రసార సంస్థలను తాత్కాలికంగా నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందంటూ కమ్యూనికేషన్ మినిస్టర్ శ్లోమో కర్హి చెప్పారు.

ప్రతీ 45 రోజులకు ఒకసారి దీన్ని సమీక్షిస్తారు.

తాత్కాలిక ఆదేశాల ప్రకారం, ఇది ఆఫీసులను మూసేయడం, వెబ్‌సైట్లను తొలగించడం, సామగ్రిని జప్తు చేసుకోవడం వంటి వాటికి దారితీయొచ్చు.

అల్ జజీరా సంస్థ ప్రధాన కార్యాలయం ఖతర్‌లో ఉంటుంది. ఏడు నెలల సుదీర్ఘ సంఘర్షణపై ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య చర్చలకు ఇప్పుడు ఖతర్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. గతంలో ఖతర్ మధ్యవర్తిత్వం వహించిన చర్చలు తాత్కాలిక కాల్పుల విరమణ, 105 మంది ఇజ్రాయెలీ బందీల విడుదలకు కారణమయ్యాయి.

ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా తమ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుందంటూ అల్ జజీరా ఆరోపించింది.

అల్ జజీరా గాజా బ్యూరో చీఫ్ వేల్ అల్ దహ్‌దౌ కుమారుడు హంజా అల్ దహ్‌దౌతో పాటు జర్నలిస్టులు ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు. జర్నలిస్టులను తాము టార్గెట్ చేయట్లేదంటూ ఇజ్రాయెల్ చెబుతోంది.

‘‘తాము చేస్తోన్న నేరాలను కప్పిపుచ్చడానికి జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ, చంపుతూ ఇజ్రాయెల్ పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోంది. కానీ, ఇవేవీ మేము మా విధులను నిర్వర్తించకుండా అడ్డుకోలేవు’’ అని నిషేధం తర్వాత అల్ జజీరా స్పందించింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-05-05T15:51:15Z dg43tfdfdgfd