అస్సాంలో మాఫియా రాజ్యం : ప్రియాంక గాంధీ

అస్సాంలో మాఫియా రాజ్యం : ప్రియాంక గాంధీ

  • సీఎం హిమంత ప్రజలను దోచుకుంటున్నరు : ప్రియాంక గాంధీ 

ధుబరి : అస్సాంలో మాఫియా రాజ్యం నడుస్తున్నదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అన్నారు. ల్యాండ్, సాండ్, బొగ్గు ఇలా ప్రతిదాంట్లో మాఫియా ఉన్నదని.. ఆ మాఫియా ప్రజలను దోచుకుంటున్నదని మండిపడ్డారు. ఈ మాఫియా వెనుక సీఎం హిమంత బిశ్వ శర్మ ఉన్నారని, అనేక కుంభకోణాల్లో ఆయన హస్తం ఉన్నదని ఆరోపించారు. బుధవారం అస్సాంలోని ధుబరి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక మాట్లాడారు.

అస్సాంలో అభివృద్ధి తప్ప, అన్నీ జరుగుతున్నాయని ఆమె అన్నారు. రైతుల భూములు దోచుకుంటున్నారని, అభివృద్ధి పనుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘‘తెలంగాణలో అసదుద్దీన్ ఒవైసీతో ఒప్పందం కుదుర్చుకున్న బీజేపీ.. అస్సాంలో బద్రుద్దీన్ అజ్మల్ తో ఒప్పందం చేసుకుంది. బీజేపీ, ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) మధ్య చీకటి ఒప్పందం ఉంది.

కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ, ఏఐయూడీఎఫ్ కలిసి కుట్ర పన్నాయి. కాంగ్రెస్ కు బలమున్న చోట ఏఐయూడీఎఫ్ తమ అభ్యర్థులను నిలబెట్టింది. బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే ఇలా చేసింది” అని మండిపడ్డారు. ‘‘బద్రుద్దీన్ అజ్మల్ ఒక వ్యాపారవేత్త. ఆయన రాజకీయాలు, సేవ చేయడం లేదు.

కేవలం బిజినెస్ చేస్తున్నారు. ధుబరి ప్రజలు ఆయనను మూడుసార్లు గెలిపించినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు” అని ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ, సీఎం హిమంత, ఏఐయూడీఎఫ్ లీడర్ బద్రుద్దీన్ అజ్మల్.. ఈ ముగ్గురూ ఒక్కటేనని విమర్శించారు. 

దేశంలో మహిళలకు రక్షణేది? 

దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రియాంక అన్నారు. ఎప్పుడూ మహిళల గౌరవం గురించి మాట్లాడే ప్రధాని మోదీ.. మహిళలకు అన్యాయం జరుగుతుంటే మాత్రం మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. ‘‘మణిపూర్ లో ఆర్మీ మాజీ ఆఫీసర్ భార్యను నగ్నంగా ఊరేగించారు. మహిళా క్రీడాకారిణిని బీజేపీ లీడర్ లైంగికంగా వేధించారు. తాజాగా కర్నాటకలో బీజేపీ మిత్రపక్షం జేడీఎస్ లీడర్ ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ బయటపడింది.

ఆ నిందితుడితో ప్రధాని మోదీ వేదిక పంచుకున్నారు. కానీ అతను ఇండియా నుంచి పారిపోతుంటే మాత్రం ఆపలేదు” అని ఫైర్ అయ్యారు. ఎన్నో దేశాలు తిరుగుతున్న మోదీ.. మన దేశంలో జనం దగ్గరికి ఎప్పుడైనా వెళ్లారా? పోనీ ఆయన సొంత నియోజకవర్గం వారణాసిలో ఎవరి ఇంటికైనా వెళ్లారా? అని ప్రశ్నించారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T02:29:31Z dg43tfdfdgfd