ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఒకసారి గెలిచిన వారికి మరో చాన్స్ ఇవ్వని నియోజకవర్గం, ఇక్కడే ఎందుకిలా జరుగుతోంది?

ఈ నియోజకవర్గం 1978లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ప్రతి ఎన్నికల్లో కొత్త ముఖాన్నే ఓటర్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఒకసారి గెలిచిన వారికి మళ్లీ అవకాశం ఇవ్వలేదు.

ఎన్నికల్లో ఒకసారి గెలిచిన వారు మళ్లీ పోటి చేసినా ఎందుకు గెలవలేకపోయారు?

ప్రతిసారి కొత్తవారినే ఇక్కడి ప్రజలు ఎందుకు ఎన్నుకుంటున్నారు? ఇంతకీ ఈ నియోజకవర్గం ఏమిటి? దాని ప్రత్యేకత ఏమిటి?

‘ఒక్కసారే’ ఆనవాయితీకి బ్రేక్

రెండు జిల్లాల పరిధిలో అంటే ఇటు విశాఖపట్నం, అటు అనకాపల్లి జిల్లాలలో ఉన్న నియోజకవర్గం పెందుర్తి.

విశాఖపట్నంలోని అర్బన్ కల్చర్ ఒక వైపు, అనకాపల్లిలోని గ్రామీణ వాతావరణం మరో వైపు మిళితమై ఉంటుంది ఈ నియోజకవర్గం. ఇక్కడ ఓటర్ల సంఖ్య 3,03,581.

గ్రామీణ, పట్టణ ప్రాంత ఓటర్ల కలయితో ఉండే ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఓటర్ల తీర్పు విలక్షణంగానే ఉంది. పెందుర్తి నుంచి ఎవరు పోటీ చేసినా ఒకసారి మాత్రమే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండోసారి ఏ పార్టీలో నుంచి రంగంలోకి దిగినా ఓటమే ఎదురైంది.

నియోజవర్గం ఏర్పడి 46 ఏళ్లు గడిచింది. ఒక ఉపఎన్నికతో కలిపి మొత్తంగా 11 సార్లు పెందుర్తిలో ఎన్నికలు జరిగాయి. ఈ పదకొండు సార్లు కొత్త వ్యక్తే ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చారు.

కాగా, దశాబ్ధాలుగా వస్తున్న ఈ ‘ఒక్కసారే ఛాన్స్’ ఆనవాయితీ 2024 ఎన్నికల్లో బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికల్లో రంగంలోకి దిగిన వైకాపా, జనసేన అభ్యర్థులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా పని చేసిన వారే. ప్రధాన పార్టీలు కావడంతో వీరిద్దరిలోనే ఎవరో ఒకరు గెలుపొందే అవకాశం ఎక్కువగా ఉంది.

అయితే ఈ రెండు పార్టీలు కాకుండా బరిలో ఉన్న కాంగ్రెస్, ఇతర ఇండిపెండెంట్లు అభ్యర్థులు గెలుపొందితే మాత్రం ఈసారి కూడా ‘ఒక్కసారే ఛాన్స్’ అనవాయితీ కొనసాగినట్లే అవుతుంది.

పెందుర్తి నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ బరిలో ఉన్నారు. కూటమి అభ్యర్థిగా 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పెందుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన పంచకర్ల రమేష్ బాబు తాజాగా జనసేన నుంచి పోటీలో ఉన్నారు.

గత 11 సార్లు ఏం జరిగిందంటే?

1978లో పెందుర్తి నియోజకవర్గం ఏర్పడింది. పెదగంట్యాడ, పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇందులో పెదగంట్యాడ, పెందుర్తి నగరాన్ని తలపిస్తే... పరవాడ, సబ్బవరం మండలాలు పూర్తి గ్రామీణ వాతావరణంతో ఉంటాయి.

పెందుర్తి నియోజకవర్గంపై సీనియర్ సిటిజన్ రవికుమార్ మాట్లాడుతూ.. “1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు గుడివాడ అప్పన్న, ఆయన మరణంతో 1980లో జరిగిన ఉప ఎన్నికల్లో ద్రోణంరాజు సత్యనారాయణ గెలిచారు. అయితే, 1983లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పెతకంశెట్టి అప్పలనరసింహం చేతిలో ద్రోణంరాజు ఓటమిపాలయ్యారు.

కాగా, పెతకంశెట్టికి అనకాపల్లి ఎంపీగా పోటీచేసే అవకాశం వచ్చింది, దీంతో రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోయారు. అనంతరం 1985 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆళ్ల రామచంద్రరావు గెలిచారు.

1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా గుడివాడ గురునాథరావు టీడీపీ అభ్యర్థి పల్లా సింహాచలంపై గెలుపొందారు. ఆ తరువాత జరిగిన రాజకీయ సమీకరణాలతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన గుడివాడ గురునాథరావు, 1994లో విశాఖ 1 నుంచి పోటీకి దిగారు. దీంతో పెందుర్తి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ద్రోణంరాజు శ్రీనివాసరావు పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికలో సీపీఐ అభ్యర్థి మానం ఆంజనేయులు విజయం సాధించారు.

ఇక సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా పెందుర్తి నుంచి 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన మానం ఆంజనేయులు మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పి.గణబాబు గెలిచారు.

అప్పటివరకు కాంగ్రెస్‌లో ఉన్న గుడివాడ నాగమణి 2004లో పెందుర్తి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి, తిప్పల గురుమూర్తి రెడ్డిపై గెలుపొందారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గణబాబుకు సీటు దక్కలేదు” అని తెలిపారు.

2009లో జరిగిన పెందుర్తి శాసనసభ ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు గెలిచారు. తరువాత పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో పంచకర్ల కాంగ్రెస్‌లో చేరారు.

2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గండి బాబ్జీపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండారు సత్యనారాయణమూర్తి గెలుపొందారు. అనంతరం 2019లో బండారు సత్యనారాయణమూర్తిపై వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ గెలిచారు.

ఇలా నాలుగు దశాబ్దాలుగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో పెందుర్తి నుంచి ఒకరికి ఒకసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యే చాన్స్‌ దక్కింది. అయితే, ఈ సారి వైసీపీ, జనసేన నుంచి ఎవరు గెలిచినా పెందుర్తిలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తొలి వ్యక్తి అవుతారు.

పెందుర్తిలో మొత్తం ఉపఎన్నికతో కలిపి 11 సార్లు ఎన్నికలు జరగ్గా... కాంగ్రెస్, టీడీపీలు చెరో నాలుగు సార్లు విజయం సాధించగా, సీపీఐ, ప్రజారాజ్యం, వైకాపా ఒక్కొసారి గెలుపొందాయి.

పెందుర్తి నియోజకవర్గానికి జరుగుతున్న 12వ ఎన్నికలో వైసీపీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అన్నంరెడ్డి అదీప్ రాజ్, జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. పిరిడి భగత్ కాంగ్రెస్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు.

కొత్త నాయకులకు కేరాఫ్ అడ్రస్

ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న 3 లక్షలపైగా ఓటర్లలో దాదాపు 90 వేల మంది కాపులు, 70 వేలు కొప్పల వెలమ, 45 వేల మంది యాదవ కులాల ఓట్లతో పాటు ఎస్సీలు 30 వేలు, గవర దాదాపు 20 వేలు, శెట్టి బలిజ దాదాపు 15 వేలు, మత్యకారుల్లో దాదాపు 6 వేల వరకు ఓటర్లు ఉన్నారని, అయితే కాపులు, కొప్పల వెలమలే ఈ నియోజకవర్గంలో కీలక పాత్ర పోషిస్తుంటారని పొలిటికల్ ఎనలిస్ట్ ఎం. యుగంధర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

కొత్తవారికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడంలో పెందుర్తి నియోజకవర్గానికి 45 ఏళ్ల చరిత్ర ఉందని యుగంధర్ రెడ్డి అన్నారు.

“గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో కొత్త ముఖాలే ఇక్కడ ఎక్కువగా పోటి చేశాయని, అయితే ఈసారి ప్రధాన పార్టీల తరపున బరిలో ఉన్న అభ్యర్థులు మాత్రం పాత వారే కావడంతో.. ఒక్కసారే ఛాన్స్ అనే సంప్రదాయానికి తెరపడ్డట్లే కనిపిస్తోంది’’ అని తెలిపారు.

విశాఖ నగరానికి శివారు ప్రాంతంగా ఉండటం ఒకవైపు నగర వాతావరణం, మరో వైపు పూర్తి గ్రామీణ వాతావరణం ఉంటుంది. దీంతో ఇక్కడ పని చేసే ఎమ్మెల్యేకు ప్రజా సమస్యలు తీర్చడంలో కాస్త ఇబ్బంది పడతారు. ఎందుకంటే జీవీఎంసీ వార్డుల రూపంలో సగ భాగం, పంచాయితీలు, గ్రామాల రూపంలో మరో సగం నియోజకవర్గం ఉంటుంది. దీంతో ఈ నియోజకవర్గంపై పని చేసిన ఎమ్మెల్యేకైనా పట్టు సాధించడం కష్టమే. ప్రతిసారి కొత్త ఎమ్మెల్యేనే రావడానికి అది కూడా ఒక కారణమేనని యుగంధర్ రెడ్డి విశ్లేషించారు

పంచకర్లకు అనుకోని ఛాన్స్..

2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పీఆర్పీ తరపున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పంచకర్ల రమేష్ బాబు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే అనుకొని పరిస్థితుల్లో పంచకర్లకు పెందుర్తి నుంచి పోటీ చేయాలని ప్రజారాజ్యం అధిష్టానం ఆదేశించింది.

“నామినేషన్ల గడువు ముగియడానికి ఒక్క రోజు ముందే పెందుర్తిలో నామినేషన్ వేసిన పంచకర్ల గెలుపుపై పెద్దగా ఎవరికి నమ్మకం లేదు. అప్పటికే కాంగ్రెస్‌ నుంచి గండి బాబ్జీ, టీడీపీ నుంచి బండారు సత్యనారాయణమూర్తి లాంటి నాయకులు బరిలో ఉన్నారు. అయినప్పటీకి కేవలం మూడు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో 16 రోజుల వ్యవధిలోనే పంచకర్ల పెందుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.” అని యుగంధర్ రెడ్డి తెలిపారు.

ఈ నియోజకవర్గంలో ప్రతిసారి కొత్త ఎమ్మెల్యేనే ఎన్నికవ్వడానికి కారణం.. పెందుర్తిలో గెలిచిన అభ్యర్థికి మళ్లీ పార్టీలు ఎక్కువగా సీటు ఇవ్వకపోవడం, రాజకీయ సమీకరణాల పేరుతో వారికి సీటు నిరాకరించడం లేదా నియోజకవర్గం మార్చడంతో పెందుర్తిలో ఒక్కసారే అనే అనవాయితీ మొదలైందని పెందుర్తికి చెందిన సీనియర్ సిటీజన్ డి. రవికుమార్ బీబీసీతో చెప్పారు.

పెందుర్తి పేరు వెనుక చరిత్ర...

పెందుర్తి అనే పేరు ఈ నియోజకవర్గానికి ఎలా వచ్చిందనే విషయాన్ని ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ బీబీసీకి వివరించారు.

“దశాబ్ధాలుగా విశాఖ నగర పరిధి దాటిన తర్వాత వచ్చే ప్రాంతంగానే విశాఖ వాసులకు పెందుర్తి పరిచయం. అలాగే విశాఖ నుంచి విజయనగరం, అనకాపల్లి, అరకు వెళ్లే దారిలో పెందుర్తి ఒక ల్యాండ్ మార్క్ ఏరియా. ఇప్పుడు విశాఖలో అంతర్భాగంగా, నగరానికి అనుకుని ఉన్న పెందుర్తితో విశాఖ నగరానికి ఒకప్పుడు అంతగా సంబంధాలు ఉండేవి కావు. విశాలమైన భూములు ఉండటంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా పందులును మేపేవారు. దాంతో ఈ ప్రాంతాన్ని అప్పట్లో పందులూరు అనేవారు. అదే క్రమంగా పెందుర్తిగా మారింది” అని కొల్లూరి సూర్యనారాయణ తెలిపారు.

విశాఖ నగరంలో భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో, నగరానికి శివారు ప్రాంతంగా ఉన్న పెందుర్తిలో రియల్ ఎస్టేట్ ఎక్కువ జరుగుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారి రమేష్ చెప్పారు.

పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న పరవాడ ఫార్మా సిటీ వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. అదే సమయంలో ఫార్మా పరిశ్రమల కాలుష్యం కూడా సమస్యగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఫార్మా పరిశ్రమల బాధితుల ఓట్లే కీలకంగా మారతాయని పరవాడకు చెందిన నారాయణబాబు బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-04-29T03:26:01Z dg43tfdfdgfd