ఆంధ్రప్రదేశ్: ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటా నుంచి ముస్లింలకు రిజర్వేషన్‌లు పంచారా? ప్రధాని మోదీ ఆరోపణల్లో వాస్తవమెంత...

లోక్‌సభ ఎన్నికల ముందు దేశమంతా ముస్లిం రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ను ‘లాక్కొని’ ముస్లింలకు ఇస్తుందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు అమలవుతోన్న రిజర్వేషన్లను ఆయన దీనికి ఉదాహరణగా చూపారు.

మోదీ చెప్పినట్టుగా ఆంధ్ర-తెలంగాణల్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను తీసేసుకుని ముస్లింలకు ఇచ్చారా? అసలేం జరిగింది?

రాజస్థాన్‌లోని టోంక్ సవాయ్ మాధోపూర్ దగ్గర మోదీ బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు.

‘‘రాజ్యాంగం రాసినప్పుడు మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకించి, ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులు కాపాడారు. కానీ, మన్మోహన్ సింగ్ మాత్రం ఈ దేశపు వనరుల మీద ముస్లింలకే మొదటి హక్కు ఉందన్నారు. 2004లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ తగ్గించి ముస్లింలకు ఇచ్చారు. ఇది పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. తరువాత దేశమంతా ఇవ్వాలనుకున్నారు. 2004-2010లో ఏపీలో కాంగ్రెస్ నాలుగుసార్లు ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రయత్నించింది. కానీ సుప్రీంకోర్టులో కేసులు ఉండటం వల్ల ఇది సాధ్యపడలేదు. 2011లో దేశమంతా ముస్లిం రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ వారు ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను తీసేసుకున్నారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని లెక్క చేయదు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని తెలిసినా కాంగ్రెస్ ఇలా చేసింది’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

మోదీ వాదనలో నిజమెంతో తెలుసుకునే ముందు అసలు ముస్లింలకు రిజర్వేషన్లు ఎప్పుడు మొదలయ్యాయో ఒకసారి చూద్దాం…

ముస్లిం రిజర్వేషన్లు ఎప్పుడు వచ్చాయి?

1960లలోనే అప్పటి మైసూరు రాష్ట్రం అంటే (ఇప్పటి కర్ణాటక) ప్రభుత్వం వేసిన నాగన్న గౌడ కమిటీ నివేదికల ప్రకారం ముస్లింలను బీసీలుగా గుర్తించింది.

అయితే కేవలం ముస్లింలకు రిజర్వేషన్ అనే కాకుండా మొత్తం ఆ కమిటీ నివేదిక అమలుపై సుప్రీంకోర్టులో కేసు పడింది. తరువాత 1977లో కర్ణాటకలోనే దేవరాజ్ అర్స్ ప్రభుత్వం ముస్లింలకు బీసీల్లో రిజర్వేషన్ ఇచ్చింది.

అప్పట్లో దీనిపై కర్ణాటక హైకోర్టులో కేసు పడగా, ఆ రిజర్వేషన్లను కర్ణాటక హైకోర్టు సమర్థించింది.

ముస్లింలకు రిజర్వేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి?

కేంద్ర ఓబీసీ జాబితాలో కొన్ని ముస్లిం గ్రూపులు ఉన్నాయి. అలాగే రాష్ట్రాల్లోని వేర్వేరు చోట్ల కూడా ముస్లిం గ్రూపులు ఓబీసీలుగా ఉన్నారు.

కేరళలో ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఉన్నాయి. తమిళనాడులో దాదాపు 90 శాతంపైగా ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి.

బిహార్‌లో కూడా ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి. కర్ణాటకలో బీసీ కోటాలో ముస్లింలకు 4 శాతం ఉప కోటా ఉంది.

మతపరంగా రిజర్వేషన్ ఇవ్వొచ్చా?

అయితే అనేక సందర్భాల్లో హైకోర్టులు ఇచ్చిన తీర్పుల్లో వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లలో ముస్లింలు ఉండవచ్చనీ, ముస్లింలకు మతపరంగా రిజర్వేషన్ ఇవ్వకపోయినా, వెనుకబాటుతనం పరంగా అధ్యయనం చేసిన తరువాత రిజర్వేషన్ ఇవ్వాలి అనుకుంటే దానికి ముస్లింగా ఉండటం అనర్హత కాబోదని తీర్పులు ఉన్నాయి.

‘‘బీసీల జాబితా నుంచి తొలగించడానికి మతపరమైన మైనార్టీగా ఉండటం ఒక కారణం కాకూడదు’’ అని వ్యాఖ్యానించింది కర్ణాటక హైకోర్టు.

ఈ కర్ణాటక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. రాజ్యాంగంలోని 16(4) ఆర్టికల్ కింద ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వొచ్చు. అయితే ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు ఇచ్చారా?

భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ – ఈ రెండు జాబితాల్లోని కులాలకు రిజర్వేషన్ రాజ్యాంగపరమైన హక్కు. అది కూడా వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలి. అంటే ప్రతీ జనాభా లెక్కల తరువాత వారి జనాభా శాతం ప్రకారం రిజర్వేషన్ శాతం కూడా పెరగుతుంది లేదా తగ్గుతుంది. దీన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ మార్చలేదు. కేంద్రమూ మార్చలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో 2004 తరువాత ఇచ్చిన రిజర్వేషన్లు ఎవరి నుంచీ తగ్గించకుండా అదనపు కోటా చేర్చడం ద్వారా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలే కాదు, బీసీల రిజర్వేషన్ కూడా తగ్గించలేదు. ఉన్న రిజర్వేషన్‌కి అదనంగా ముస్లింలకు కోటా ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా ముస్లిం రిజర్వేషన్ ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ వారు బీసీ సబ్ కోటాలోనే ఉన్నారు తప్ప దేశంలో ఎక్కడా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్లకు సంబంధం లేదు. అది రాజ్యాంగపరంగా సాధ్యం కాదు.

‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చారన్నది అవాస్తవం. అసలు అలా తగ్గించడానికి వీల్లేదు’’ అనిహైదరాబాద్‌కి చెందిన న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ బీబీసీతో అన్నారు.

అసలు ముస్లిం రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ తగ్గించడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారాయన.

ఏపీ హైకోర్టు ముస్లిం రిజర్వేషన్లను ఎందుకు కొట్టేసింది?

ఏ కులానికైనా బీసీ రిజర్వేషన్ ఇవ్వాలంటే బీసీ కమిషన్ ఆ కులంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలి. దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాల ప్రకారం సామాజికంగా, ఆర్థికంగా ఒక కులం వెనుకబడి ఉన్నట్టు నిరూపణ అయితే వారు రిజర్వేషన్లకు అర్హులే. ఇది ముస్లింలకు కూడా వర్తిస్తుంది.

కానీ ఏపీ బీసీ కమిషన్‌ను సంప్రదించకుండానే అప్పటి ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చింది.

అంతేకాదు, అప్పటి చట్టాల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదు. కానీ ఏపీలో అప్పటికే 46 శాతం రిజర్వేషన్లు ఉండగా, ముస్లింలకు 5 శాతం కోటా ఇవ్వడంతో మొత్తంగా 51 అవుతుంది కాబట్టి ఈ రెండు కారణాలతో ఏపీ హైకోర్టు ముస్లిం రిజర్వేషన్లను కొట్టేసింది. ఇది 2004లో జరిగింది. ఇది కాక బీసీ రిజర్వేషన్లో కీలకమైన క్రీమీ లేయర్ పెట్టకపోవడం కూడా ఒక కారణం.

2004లో సరైన ప్రక్రియ పాటించకుండానే రిజర్వేషన్ ఇచ్చింది. జూలైలో రిజర్వేషన్ ఇస్తే సెప్టెంబరులో కోర్టు కొట్టేసింది.

దీంతో 2005లో బీసీ కమిషన్‌ను సంప్రదించి వారి అనుమతితో మళ్లీ 5 శాతం ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అందుకోసం ముందుగా ఆర్డినెన్స్, తరువాత ఒక చట్టం కూడా చేశారు.

అయితే ముస్లింలు వెనుకబడి ఉన్నారని చెప్పడానికి సరైన లెక్కలు, ఆధారాలు, చూపకుండానే రిజర్వేషన్ ఇచ్చారంటూ మళ్లీ హైకోర్టు ఈ రిజర్వేషన్లను కూడా కొట్టేసింది. అలాగే అంతకుముందు చెప్పినట్టు 51 శాతం పరిమితి కూడా దాటుతుండటం మరో కారణం.

అయితే ఈ రెండు తీర్పులలోనూ కోర్టులు ఎక్కడా ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వకూడదని వ్యాఖ్యానించలేదు. కానీ రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియ సక్రమంగా లేదన్న కారణంతో కొట్టేశారు.

రిజర్వేషన్ కోసం కమిషన్ ఏర్పాటు

తరువాత ఏపీ ప్రభుత్వం పీఎస్ కృష్ణన్ కమిషన్ వేసింది. ఆ కమిషన్ ముస్లింల మరో ఉప కోటా చేర్చింది. అప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు ఏ,బీ,సీ,డీ అనే ఉప కోటాలు ఉన్నాయి. బాగా వెనుకబడ్డ బీసీలు ఏ కిందా, కాస్త పర్వాలేదనుకున్న బీసీలు డీ కిందా ఉంటారు.

ఈ జాబితాలో కొత్తగా ఈ అనే క్లాజ్ చేర్చి, ఆ క్లాజ్ కింద ముస్లింలకు 4 శాతం అదనపు రిజర్వేషన్ అంటే, అప్పటికే ఉన్న బీసీ రిజర్వేషన్‌ను తగ్గించకుండా అదనంగా ఈ రిజర్వేషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.

అలాగే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా, ముందుగా అనుకున్నట్టు 5 శాతం కాకుండా 4 శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చింది అప్పటి ఏపీ కాంగ్రెస్ ప్రభుత్వం.

అలాగే మొత్తం ముస్లింలను కాకుండా, 14 వెనుకబడిన ముస్లిం గ్రూపులకు ఈ రిజర్వేషన్ అమలు చేసింది. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారు. కానీ ఏపీ హైకోర్టు ఆ రిజర్వేషన్ సమర్థించింది. దీంతో పిటిషన్ దారులు సుప్రీం కోర్టుకు వెళ్లారు.

అయితే రిజర్వేషన్ అమలుపై కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. కేసుపై విచారణ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ ముస్లిం రిజర్వేషన్ కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది. మధ్యలో ఒకసారి విచారణకు వచ్చినప్పటికీ, ఈడబ్ల్యుఎస్ తీర్పు తరువాత ఈ కేసు విచారణ చేయాలని సుప్రీం భావించింది.

ఈడబ్ల్యుఎస్ తీర్పు సంగతి తేలింది కానీ ఈ కేసు ఇంకా సుప్రీంలోనే ఉంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి.

‘‘ముస్లింలలో సయ్యద్, పఠాన్, మొఘల్ అనే మూడు గ్రూపులకు తప్ప మిగిలిన వారందరికీ రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ, స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వడం వల్ల క్షేత్ర స్థాయిలో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి’’ అని హైదరాబాద్ కి చెందిన న్యాయవాది సయ్యద్ లతీఫ్ బీబీసీతో చెప్పారు.

2004 కంటే ముందే ఏపీలో దూదేకుల, లద్దాఫ్, పింజారీ, నూర్ బాషా, మెహతర్ అనే ముస్లిం సమూహాలకు బీసీ హోదా ఉంది. వీరికి హిందూ బీసీలతో కలపి ఈ హోదా దక్కింది. వీరికీ ఆ ముస్లిం రిజర్వేషన్లకూ సంబంధం లేదు.

సచార్ కమిటీ ఏం చెప్పింది?

దేశంలో ముస్లింల స్థితిగతుల అధ్యయనం కోసం సచార్ కమిటీని వేసింది యూపీఏ ప్రభుత్వం. 2005లో ఈ కమిటీని వేయగా 2006లో నివేదిక వచ్చింది.

దిల్లీ హైకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ రాజేంద్ర సచార్ ఈ కమిటీకి అధ్యక్షుడు. దేశంలోని ముస్లింల స్థితిగతులపై లోతుగా అధ్యయనం చేసి, వివరంగా ఒక నివేదిక ఇచ్చింది ఈ కమిటీ. అలాగే ముస్లిం అభివృద్ధి కోసం కొన్ని సూచనలు కూడా చేసింది.

అంతేకాదు ముస్లింలపై ఉన్న అనేక ప్రచారాలు అంటే జనాభా వంటి వాటిపై వాస్తవ లెక్కలు ఇచ్చింది ఈ 425 పేజీల నివేదిక.

అయితే సచార్ కమిటీ నేరుగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వమని సూచించలేదు. కానీ అందుకు సమానమైన అనేక సూచనలు చేసింది.

అంటరాని కులాల నుంచి ముస్లింలుగా మారిన వారికి ఎస్సీ గుర్తింపు ఇవ్వడం సమంజసంగా ఉంటుందనీ, అలా చేయకపోవడం వారికి అన్యాయం చేసిందనీ సచార్ కమిటీ భావించింది.

ఎస్సీల్లో కాకపోతే కనీసం అత్యంత వెనుకబడిన వర్గాలు అంటే ఎంబీసీ జాబితాను సృష్టించి అందులో వీరికి కోటా ఇవ్వాలని సచార్ కమిటీ అభిప్రాయపడింది.

ఈ అంశంపై ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది కె. బాలగోపాల్ విస్తృతంగా అధ్యయనం చేసి ఒక వ్యాసం రాశారు.

‘‘నిజానికి ముస్లింల స్థితిగతుల గురించి సచార్ కమిటీ వెలువరించిన వాస్తవాలను దృష్టిలో ఉంచుకున్నట్టయితే ముస్లింలు మొత్తంగానే, పిడికెడు నవాబీ కుటుంబాలను మినహాయించి రిజర్వేషన్లకు అర్హులై ఉండాలి. అన్ని విషయాలలోనూ ముస్లింలు హిందూ బీసీల కంటే వెనుకబడి ఉన్నారు. వారేమో వంద శాతం రిజర్వేషన్లు పొందుతుండగా, ముస్లింలలో కేవలం 40.7 శాతం మాత్రమే అర్హులెట్లా అవుతారు?’’ అని బాలగోపాల్ ప్రశ్నించారు.

‘‘రిజర్వేషన్లు లేదా ఇతర రూపాల్లో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల హిందూ సమాజానికి చెందిన బీసీలు, ఎస్సీ, ఎస్టీలు కాలక్రమంలో ఉన్నత విద్య విషయంలో తమ స్థితిని కొద్దిగా మెరుగు పరుచుకుంటున్నారు. కానీ, ప్రభుత్వం ఏ ప్రత్యేక చర్యలూ చేపట్టని ముస్లింలలో ఇది స్వల్పంగా ఉంది’’ అని బాలగోపాల్ అభిప్రాయపడ్డారు.

కర్ణాటకలో ఏం జరిగింది?

ముస్లిం రిజర్వేషన్ అంశం 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికల ముందు పెద్ద రచ్చ అయింది. అప్పటికే కర్ణాటకలో ఉన్న 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను అప్పటి బీజేపీ ప్రభుత్వం తొలగించింది.

అంతేకాదు ఆ 4 శాతాన్నీ రెండుగా విడగొట్టి 2 శాతం లింగాయత్‌లకు, 2 శాతం ఒక్కళిగలకూ పంచింది. తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు తిరిగి రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దానికి తగ్గట్టే 2024 ఏప్రిల్లో ముస్లింలదర్నీ బీసీలుగా గుర్తిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు దీనిపై వివాదం నడుస్తోంది. జాతీయ బీసీ కమిషన్ ఈ నిర్ణయాన్ని తప్పు పట్టింది.

బీజేపీ వైఖరి ఏంటి?

బీజేపీ నాయకులు వివిధ వేదికలపైనా, తమ పార్టీకి చెందిన వివిధ ప్రకటనల్లో చెప్పిన ప్రకారం ముస్లిం రిజర్వేషన్లను స్థూలంగా ఆ పార్టీ వ్యతిరేకిస్తోంది.

మత పరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని ఆ పార్టీ చెబుతోంది. ఇది కోర్టులో నిలబడదనీ, రిజర్వేషన్ ఇవ్వడానికి తగిన అధ్యయనం చేయకుండానే కోటా ఇచ్చారనీ, అంబేద్కర్ కూడా దీన్ని వ్యతిరేకించే వారనీ బీజేపీ అంటోంది

కాంగ్రెస్ వైఖరి ఏంటి?

కాంగ్రెస్ ముందు నుంచీ ముస్లిం రిజర్వేషన్లను సమర్థిస్తోంది.

సచార్ కమిటీ అమలును నిరంతరం ఫాలో అప్ చేస్తూ వస్తోంది. అయితే ఆ పార్టీ జాతీయ స్థాయిలో దేశమంతా ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని హామీలు ఇచ్చింది కానీ అమలు చేయలేదు.

2009 నాటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం రిజర్వేషన్ల గురించి హామీ ఇచ్చింది.

2011లో దేశవ్యాప్తంగా ముస్లింలకు 6 శాతం రిజర్వేషన్లు ఓబీసీ కింద ఇవ్వాలనుకుంది. తరువాత దాన్ని 4.5 శాతానికి తగ్గించారు. కానీ అమలు చేయలేదు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-04-26T13:30:53Z dg43tfdfdgfd