ఆ మూడు బ్యారేజీలు తెరిచే ఉంచాలి.. లేదంటే వరదకు కొట్టుకుపోయే ప్రమాదం

ఆ మూడు బ్యారేజీలు తెరిచే ఉంచాలి.. లేదంటే వరదకు కొట్టుకుపోయే ప్రమాదం

రాష్ట్ర సర్కారుకు ఎన్​డీఎస్ఏ ఎక్స్​పర్ట్స్ కమిటీ సిఫార్సు

మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్లకూ డ్యామేజీలు

కాళేశ్వరంలోని మూడు బ్యారేజీలు కట్టిన ఏడాదికే దెబ్బతిన్నయ్

2019లో సీసీ బ్లాకులు, లాంచింగ్ ఆప్రాన్లు 

కొట్టుకుపోయినా రిపేర్లు చేయలేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలూ కట్టిన తొలి ఏడాదే దెబ్బతిన్నాయని చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్ఏ) ఎక్స్​పర్ట్స్​కమిటీ తేల్చింది. బ్యారేజీల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఏటా వర్షాకాలమంతా ఆ మూడు బ్యారేజీల గేట్లను తెరిచి ఉంచాల్సిందేనని స్పష్టం చేసింది. బ్యారేజీలకి ఎగువ, దిగువన ప్రవాహానికి అడ్డుగా ఏవైనా బ్లాకులుంటే వెంటనే వాటిని తొలగించాలని, ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని, లేదంటే మూడు బ్యారేజీలు కొట్టుకుపోయే ప్రమాదముందని హెచ్చరించింది. అందువల్ల  వర్షాకాలం ప్రారంభానికి ముందే గేట్లను ఓపెన్​ చేయాలని సూచించింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ 2019 నుంచే సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోవడం మొదలైందని, సీపేజీలు కూడా అప్పటి నుంచే ప్రారంభమయ్యాయని తెలిపింది. ఈ మేరకు బ్యారేజీలపై తయారు చేసిన మధ్యంతర నివేదికలో వాటి స్థితిగతులను వివరించింది. వర్షాకాలానికి ముందు బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక ఉపశమన చర్యలను చేపట్టినా.. ధ్వంసమైన ఏడో బ్లాకును కాపాడుకోగలమన్న నమ్మకం లేదని వెల్లడించింది.

అన్నారం, సుందిళ్లలో 2019 నుంచే లీకేజీలు

అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ కట్టిన ఏడాదికే డ్యామేజీలు, లీకేజీలు జరిగాయని కమిటీ రిపోర్ట్​లో పేర్కొంది. ‘‘అన్నారం బ్యారేజీని ప్రారంభించాక 2019లో సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు (సీసీ బ్లాకులు) పక్కకు తొలిగాయి. 2020లోనూ అదే పరిస్థితి. రాఫ్ట్​లోని సిమెంట్ వేరింగ్ కోట్ పూర్తిగా కొట్టుకుపోయింది. 35, 44వ గేట్ల వద్ద దిగువన 2020 ఏప్రిల్​లో బుంగలు ఏర్పడ్డాయి. గ్రౌటింగ్ చేసి వాటిని పూడ్చారు. 2024 జనవరిలోనూ 28, 38వ గేట్ల వద్ద దిగువన బుంగలు పడ్డాయి. అదే నెలలో 38వ గేట్ వద్ద ఏర్పడిన బుంగను పూడ్చగా.. 35వ గేట్ వద్ద సీపీజే ఏర్పడింది. దీంతో ఫిబ్రవరిలో గ్రౌటింగ్ చేసి వాటిని పూడ్చారు. 2019లో తొలి వర్షాకాలంలోనే సుందిళ్ల బ్యారేజీకి చాలా చోట్ల రాఫ్ట్ దగ్గర వేరింగ్ కోట్ కొట్టుకుపోయింది. 2020 మేలో 46, 52 గేట్లకు దిగువన బుంగలు పడ్డాయి. దీంతో గ్రౌటింగ్ చేసి పూడ్చారు. 2022 ఆగస్టులో సీసీ బ్లాకులు పక్కకు తొలిగాయి. 2023 అక్టోబర్​లోనూ 33, 50వ గేట్లకు దిగువన బుంగలు పడ్డాయి. ఈ రెండు బ్యారేజీల పొడవునా సీసీ బ్లాకులు, లాంచింగ్ ఆప్రాన్​లు ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల పూర్తిగా కొట్టుకుపోయాయి. అన్నారం బ్యారేజీలో సిల్ గ్లేసిస్, స్టిల్లింగ్ బేసిన్​లు చాలా చోట్ల ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల కొట్టుకుపోయాయి’’ అని పేర్కొంది.

మరింత కుంగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్​లోని పిల్లర్లు చాలా లోతుకు కుంగాయని ఎన్​డీఎస్ఏ నిపుణుల కమిటీ రిపోర్టులో పేర్కొంది. 15 నుంచి 22వ నెంబర్ గేట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, ఎత్తలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. కుంగిన పిల్లర్లు మరింత కుంగకుండా బ్రేసింగ్ (పిల్లర్లకు స్టీల్ లేదా కాంక్రీట్ స్ట్రక్చర్లతో సపోర్ట్ ఇవ్వడం) చేయాలని ఎన్​డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదికలో సిఫార్సు చేసింది. అంతేగాకుండా పిల్లర్లు కదలకుండా లాటిస్ గర్డర్ లేదా బాక్స్ గర్డర్​లతో చర్యలు చేపట్టాలని సూచించింది. ధ్వంసమైన ప్రెజర్ రిలీజ్ వాల్వ్స్​ను రీప్లేస్ చేయాలని సూచించింది. 

కావిటీలు మూసేయాలి

జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి సీకెంట్ పైల్, పారామెట్రిక్ జాయింట్ల పరిస్థితిని తెలుసుకుని.. ‘‘డౌన్​స్ట్రీమ్​లోని ప్లింత్ శ్లాబ్​కు ముందున్న షీట్ పైల్​ను 9 మీటర్ల ముందుకు జరపాలి. రాఫ్ట్ కింద డ్యామేజ్ అయిన లేదా కావిటీలు ఏర్పడిన ప్రాంతాలను ఇసుక, సిమెంట్, నీటితో గ్రౌటింగ్ చేసి మూసేయాలి. సిమెంట్, ఇసుకను 1:5 నుంచి 1:3 రేషియోలో వాడి గ్రౌటింగ్ చేయాలి. గ్రౌటింగ్ చేసే సమయంలో బ్యారేజీ ఎగువ, దిగువ ప్రవాహాలు, రాఫ్ట్, జాయింట్ల నుంచి నీళ్లు లీకవుతున్నాయా లేదా పరిశీలించాలి. దానిని డాక్యుమెంట్ చేయాలి’’ అని సూచించింది.

దెబ్బతిన్న గేట్లను పూర్తిగా తొలగించాలి

వర్షాకాలానికి ముందే ఏడో బ్లాక్​లోని గేట్లన్నింటినీ పూర్తిగా ఓపెన్ చేసి పెట్టాలని ఎన్​డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదికలో సూచించింది. ‘‘పిల్లర్లు కుంగిపోవడం వల్ల తెరుచుకోకుండా బ్లాక్ అయిన ఏడో బ్లాక్​లోని 15 నుంచి 22వ నంబర్​ గేట్లను ఎత్తేందుకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే గేట్లను కట్ చేసి లేదా డిస్​మాంటిల్ చేసి పూర్తిగా తొలగించాలి. గాంట్రీ క్రేన్​ను ఏడో బ్లాక్​కు బదులు వేరే ఏదైనా బ్లాక్​లో పెట్టాలి’’ అని సిఫార్సు చేసింది. కాగా, ధ్వంసమైన ఏడో బ్లాక్​ ప్రాంతంలో బ్యారేజీ ఎగువ, దిగువ ప్రవాహాల్లోని సీసీ బ్లాకులను పూర్తిగా తొలగించాలని సూచించింది. రివర్ బెడ్​ను పటిష్టం చేయాలంది. ఏడో బ్లాక్​లోని ప్లింత్ శ్లాబ్ డౌన్​స్ట్రీమ్ సీసీ బ్లాక్​లోని తొలి మూడు వరుసలను రీబార్ల ద్వారా ఇంటర్​ కనెక్ట్ చేసి ఉంచాలని సిఫార్సు చేసింది. కాగా, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా ఇవే సిఫార్సులను నిపుణుల కమిటీ సూచించింది. 

మరిన్ని టెస్టులు చేయాల్సిందే..

కుంగిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద వానాకాలానికి ముందే మరిన్ని టెస్టులు చేయాలని ఎన్​డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచించింది. నిర్మాణాల పటిష్టతను తెలుసుకునేందుకు జియోఫిజికల్, జియోటెక్నికల్ స్టడీస్ చేయాలని సూచించింది. ‘‘బ్యారేజీకి ఎగువ, దిగువన 5 కిలోమీటర్ల వరకు ప్రతి వంద మీటర్ల వద్ద పరిస్థితిని పరిశీలించాలి. వరద అంచనాలను లెక్కించుకోవాలి. గేజ్, డిశ్చార్జ్​ను అంచనా వేయాలి. డ్రోన్​ ద్వారా బ్యారేజీ మొత్తాన్ని మ్యాప్ చేయాలి. మరోసారి గ్రౌండ్ పెనెట్రేటింగ్​ రాడార్ (జీపీఆర్) ద్వారా జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్​టీ)లను బ్యారేజీ ఎగువ, దిగువన చేయాలి. ప్లింత్ శ్లాబ్​పై భారీ బరువులతో హ్యామరింగ్ చేయడం ద్వారా రిసీవర్​ నుంచి రికార్డింగులను నమోదు చేయాలి” అని సూచించింది.

బ్యారేజీ ఫౌండేషన్ ఎట్లుంది?

బ్యారేజీ పునాదులు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు ఏడో బ్లాక్​కు ఇరువైపులా 25 మీటర్ల లోతుతో రెండు బోర్ హోల్స్​ను తవ్వాలని నివేదికలో ఎన్​డీఎస్​ఏ నిపుణుల కమిటీ సూచించింది. ఆ లోతులో రాతి విశ్లేషణలను రికార్డ్​ చేయాలని పేర్కొంది. బోర్ హోల్స్ తవ్వే సందర్భంలో కావిటీ ఏర్పడినట్టు అనిపిస్తే వెంటనే దానిని రికార్డ్​ చేయాలని సూచించింది. రీబౌండ్ హామర్ టెస్టుల ద్వారా కాంక్రీట్ నిర్మాణాల పటిష్టతను అంచనా వేయాలని పేర్కొంది. వాటి టెస్టు ఫలితాల ఆధారంగా.. బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో అల్ట్రాసోనిక్ పల్స్ వెలోసిటీ (యూపీవీ) టెస్టులు చేయాలని సూచించింది. యూపీవీ ఫలితాల్లో ఎక్కడైనా కాంక్రీట్ బ్లాకులు బలహీనంగా ఉన్నట్టు అనిపించినా, నాణ్యతా ప్రమాణాలు లేకపోయినా సీఈపీవో (కట్ అండ్ పుల్ అవుట్) టెస్టింగ్ పరికరం ఆధారంగా కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ చేయాలని సూచించింది. పిల్లర్లు, రాఫ్ట్​లు, ఇతర కాంక్రీట్ బ్లాక్​లలోని సాంద్రత, పటిష్ఠతను తెలుసుకునేందుకు 100 మిల్లీమీటర్ల లోతులోని 3 కాంక్రీట్ కోర్​లలోని శాంపిళ్లను సేకరించి ఎన్​డీటీ టెస్టులను చేయాలని పేర్కొంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా ఈ టెస్టులన్నింటినీ చేయాలని కమిటీ సూచించింది.

©️ VIL Media Pvt Ltd.

2024-05-08T01:21:49Z dg43tfdfdgfd