ఇజ్రాయెల్- హమాస్ మధ్య చర్చలు.. 7 నెలల యుద్ధానికి పరిష్కారం లభిస్తుందా..?

గత కొన్ని నెలలుగా మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నెలల తరబడి కొనసాగుతోంది. అయితే ఈ రెండు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ఇతర దేశాలు చేస్తున్న ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడింది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకారం తెలిపింది. దీంతో గాజాలో ఏడు నెలల తీవ్ర యుద్ధం తర్వాత కాల్పుల విరమణపై ఆశలు రేకెత్తుతున్నాయి.

అయితే సుదీర్ఘంగా జరిగిన దాడులు లక్షల మంది పాలస్తీనియన్ల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇజ్రాయెల్ భీకర బాంబు దాడుల కారణంగా గాజాలోని దాదాపు 60% భవనాలు దెబ్బతిన్నాయి లేదా ధ్వంసమయ్యాయి. ఈ విధ్వంసంలో దాదాపు 21 లక్షల మంది పాలస్తీనియన్ల జీవితాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శాటిలైట్ అనాలసిస్‌లు జరిగిన నష్టం తీవ్రతను వెల్లడిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సాధారణ స్థితిని కల్పించడానికి, పునర్నిర్మాణ ప్రయత్నాలు వేగంగా చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.

* గాజా పరిస్థితి ఏంటి?

ఇజ్రాయెల్ దాడుల్లో గాజా తీవ్రంగా నష్టపోయింది. UN డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ కమిషన్‌ ఫర్‌ వెస్ట్రన్ ఆసియా నివేదిక ప్రకారం.. ఈ యుద్ధం కారణంగా దాదాపు 3,70,000 ఇళ్లు ప్రభావితమయ్యాయి. 79,000 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పూర్తిగా ధ్వంసమైన ఇళ్లను పునర్నిర్మించడానికి చాలా సమయం పట్టవచ్చని UNDP అంచనా వేస్తోంది. మునుపటి గాజా పునర్నిర్మాణ వేగం ఆధారంగా చూస్తే.. ఇందుకు 80 సంవత్సరాలు పట్టవచ్చని చెబుతోంది. 2021లో జరిగిన దాడుల సమయంలో కంటే మెటీరియల్‌లు చాలా వేగంగా డెలివరీ చేసినా (వాస్తవానికి ఐదు రెట్లు వేగంగా), గాజాను పునర్నిర్మించడానికి ఇంకా 16 సంవత్సరాలు పడుతుంది.

ఈ యుద్ధం వల్ల గాజా ప్రజా మౌలిక సదుపాయాలకు $18.5 బిలియన్ల నష్టం వాటిల్లిందని అంచనాలు ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ గ్రూప్, ఐక్యరాజ్యసమితి నివేదించిన ప్రకారం, ఇది 2022లో వెస్ట్ బ్యాంక్, గాజా సంయుక్త GDPలో దాదాపు 97% కావడం గమనార్హం. గాజా నష్టంలో ఎక్కువ భాగం సుమారు 73%- గృహ నష్టాల కారణంగా సంభవించింది. మరో 18% నీరు, ఆరోగ్యం, విద్యా సౌకర్యాల వంటి ప్రజా సేవలకు నష్టం వల్ల ఏర్పడింది. అయితే 9% వాణిజ్య, పారిశ్రామిక భవనాల నష్టాల వల్ల జరిగింది.

* ఆశలు రేపుతున్న చర్చలు

యుద్ధంతో దెబ్బతిన్న గాజాలో పరిస్థితులు మారుతున్నాయి. హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు ప్రకటించడంతో, ఈ ప్రాంతంలో వేడుకలు చేసుకున్నారు. నిజానికి ఒప్పందం వివరాలు లేదా హమాస్ ఆమోదించిన నిబంధనల వివరాలపై స్పష్టత లేదు. అయితే ఇజ్రాయెల్ ఇప్పటి వరకు టార్గెట్స్ చేరుకోలేదని భావిస్తోంది. అయినప్పటికీ శాశ్వత కాల్పుల విరమణ, పాలస్తీన ప్రజలకు కరవు నుంచి ఉపశమనం కల్పిస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆశపడుతున్నారు.

ఒక హమాస్ అధికారి ‘అల్ జజీరా’తో మాట్లాడుతూ, ఈ ఒప్పందం మూడు దశలను కలిగి ఉంటుందని చెప్పారు. గాజాలో ప్రజలు సంచారానికి అనుమతివ్వడం, పోరాటాన్ని నిలిపివేయడం. తర్వాత ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ. మరొకటి శాశ్వత కాల్పుల విరమణ, పునర్నిర్మాణం. హమాస్ బందీల విడుదలకు బదులుగా యుద్ధానికి ముగింపు, ఇజ్రాయెల్ దళాల పూర్తి ఉపసంహరణ సహా స్పష్టమైన హామీలను కోరుతోంది. మరోవైపు, ఈజిప్ట్-ఖతార్ మధ్యవర్తిత్వ చర్చలు మంగళవారం కూడా కొనసాగాయి. ఇజ్రాయెల్‌ మాత్రం ప్రస్తుతం ఉన్న ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదంటోంది. తదుపరి చర్చల కోసం మధ్య స్థాయి రాయబారులను కైరోకు పంపాలని ఆ దేశం యోచిస్తోంది.

---- Polls module would be displayed here ----

* ఏకైక సరిహద్దును ఆక్రమించిన ఇజ్రాయెల్‌

హమాస్ కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిసేపటికే, ఇజ్రాయెల్ నియంత్రణలో లేని ఏకైక రవాణా కేంద్రమైన రఫా సరిహద్దు క్రాసింగ్‌ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. యుద్ధ సమయంలో, ఈ సరిహద్దు పాయింట్ ద్వారానే గాజాలోని ప్రజలకు ఇతర దేశాల నుంచి సాయం అందేది.

అక్కడ హమాస్ ఉనికిని గుర్తించిన ఇజ్రాయెల్, ఆ ప్రాంతాన్ని తమ సైన్యం అధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. అమెరికా నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ నెలల తరబడి గాజాలో భూదాడులకు సిద్ధమైంది. వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. రఫాలోని 1,50,000 మంది పాలస్తీనియన్లలో 1,00,000 మందిని ఖాళీ చేయమని ఆదేశించింది. ఉత్తర గాజా తీవ్ర కరవును ఎదుర్కొంటోందని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం అధిపతి హెచ్చరించారు.

2024-05-08T08:52:20Z dg43tfdfdgfd