ఇరాన్, ఇజ్రాయెల్ భారీ యుద్ధానికి దగ్గరగా వచ్చాయా... ఈ రెండు దేశాల క్షిపణి దాడులతో మధ్యప్రాచ్యం ఎలా మారింది?

మధ్యప్రాచ్యంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య క్షిపణి, డ్రోన్ దాడుల వార్త మీడియాలో ప్రముఖంగా కనిపిస్తే, మరునాడు గాజాలో కొనసాగుతున్న యుద్ధం, అక్కడి ప్రజలు పడుతున్న కష్టాల గురించిన కథనాలు కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ విధాన రూపకర్తలు, సైనిక అధికారులు, సామాజిక నిపుణులు ఇప్పటికీ ఈ పరిస్థితిని లోతుగా విశ్లేషించడానికి ప్రయత్నిస్తున్నారు.

మిడిల్ ఈస్ట్‌‌లో ఇరాన్, ఇజ్రాయెల్‌లు పాత శత్రువులు. ఇటీవల ఇరాన్ డ్రోన్‌లు, మిసైల్స్‌తో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది.

ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ క్షిపణులను ప్రయోగించిందని అమెరికా తెలిపింది. ఇది అంతర్జాతీయ సంఘర్షణకు అడుగు దూరంలో ఆగిపోయింది.

ఈ రెండు దేశాలు యుద్ధానికి ఎంత దగ్గరగా వచ్చాయి? వారిద్దరి మధ్య ఎంత పెద్ద సంఘర్షణ ఉందనేది గమనించాలి.

ఇరాన్, ఇజ్రాయెల్ బహిరంగంగా దాడి చేసుకోవడం ఇదే తొలిసారి. క్షిపణులు, వందలాది డ్రోన్లతో ఇరాన్ చేసిన దాడిని పెద్దదిగా కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

యుక్రెయిన్‌పై రష్యా చేసిన దాడి కంటే ఇది చాలా పెద్దదని చెబుతున్నారు. 1991లో ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేన్ ఇజ్రాయెల్‌పై స్కడ్ మిసైల్స్ ప్రయోగించిన తర్వాత, ఇజ్రాయెల్‌పై అంత పెద్ద దాడి జరగడం ఇదే మొదటిసారి.

అయినప్పటికీ, ఇజ్రాయెల్ వైపు ఇరాన్ ప్రయోగించిన 300 కంటే ఎక్కువ డ్రోన్లలో చాలా వరకు నేలకూల్చారు.

కానీ, జెరూసలేంలోని నా కార్యాలయం నుంచి పరిశీలిస్తే ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ ప్రతిచర్య కారణంగా రాత్రి ఆకాశం మెరుస్తూ కనిపించింది.

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ఆకాశంలో ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ మిసైల్స్ ప్రయత్నించాయి.

యుద్ధానికి అతి చేరువగా...

ఒకవేళ ఆ రోజు జీపీఎస్ గైడెన్స్ సిస్టం విఫలమైతే, పట్టణ జనాభా ఉన్న ప్రాంతంలో మిసైల్ పడి భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది.

"ఆ రోజు మనం విపత్తుకు ఎంత దగ్గరగా ఉన్నామో ప్రజలు గ్రహించలేదని అనుకుంటున్నా" అని ఒక సీనియర్ వెస్టర్న్ సెక్యురిటీ ఆఫీసర్ ఒకరు అన్నారు.

ఏప్రిల్ 13న ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన దాడిని, ఇజ్రాయెల్ తదుపరి పరిమిత ప్రతిస్పందనను పశ్చిమ దేశాలలో చాలామంది సానుకూల దృష్టిలో చూశారు.

ఇరాన్ దాడులను కచ్చితంగా అంచనా వేయడం, ఆపడం అనేది ఇంటెలిజెన్స్ స్థాయిలో ఇజ్రాయెల్‌కు ఒక పెద్ద విజయం అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇజ్రాయెల్‌కు మిత్రదేశాల సైనిక సహకారం ఎలా ఉందో చెప్పడానికి దాని భద్రత ఒక ఉదాహరణ అని సెక్యురిటీ ఆఫీసర్ అన్నారు.

ఈ ఘటన తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ రెండూ ఉద్రిక్తతను పెంచకుండా ఎలా నడుచుకోవాలో తెలుసుకున్నాయని ఆయన చెప్పారు.

ఇరాన్ దాడి వార్త ముందుగానే తెలిసిందా?

ముందుగా ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇరాన్‌పై శనివారం దాడికి ముందు, ఆ ప్రణాళిక గురించి సమాచారం అమెరికాకు బుధవారమే అందిందని నాకు చెప్పారు.

"ఇరాన్ ప్రతిస్పందన ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటుందని మాకు ముందస్తు సమాచారం ఉంది. అది షాక్‌కి గురి చేసింది, అయితే ఇది అంతర్జాతీయ ప్రతిస్పందన కోసం మాకు సహాయపడుతుందనుకున్నాం" అని పశ్చిమానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు అన్నారు.

దాని సహాయంతో అమెరికా కొన్ని గల్ఫ్ దేశాలను ఇజ్రాయెల్ భద్రతకు మద్దతుగా ఒప్పించగలిగింది, వీటిలో సౌదీ అరేబియా, జోర్డాన్ ఉన్నాయి.

ఇరాన్ దాడి గురించి ముందస్తు ఇంటెలిజెన్స్ సమాచారం అందుకున్నందున, ఇజ్రాయెల్ ప్రతిస్పందించడం తప్ప వేరే మార్గం లేదు.

అంటే ఇరాన్ దాడిపై కచ్చితమైన సమాచారం రావడంతో ఇజ్రాయెల్, దాని మిత్రదేశాలకు దాడులను ఎదుర్కోనేలా సిద్ధం కావడానికి సమయం దొరికింది.

ఈ మొత్తం విషయంలో జోర్డాన్, సౌదీ అరేబియా ఏ పాత్ర పోషించాయి? అనేది ఇంకా స్పష్టంగా లేదు.

జోర్డాన్ తన సార్వభౌమాధికారం, సరిహద్దుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు తెలిపింది.

జోర్డాన్ కొన్ని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను తన గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించిందని కూడా అర్థం చేసుకోవచ్చు.

సౌదీ అరేబియా అమెరికాకు సమాచారం అందించిందని, ఈ సమయంలో యెమెన్ నుంచి ఇరాన్-మద్దతుగల సాయుధ దళాల నుంచి వచ్చే ముప్పుపై నిఘా ఉంచిందని భావిస్తున్నారు.

వ్యూహం ఫలించిందా?

ప్రధాన విషయం ఏమిటంటే ఈ వ్యూహం పని చేసింది. అమెరికా, బ్రిటీష్, ఫ్రెంచ్, జోర్డాన్, సౌదీ అరేబియా సైన్యాలు గగనతల భద్రత విషయంలో కలిసి పనిచేయగలవని నిరూపించాయి.

"ఇది విజయవంతమైన వ్యూహాత్మక ఆపరేషన్. ముందస్తుగా అందిన ఇంటెలిజెన్స్ సమాచారం చాలా సాయపడింది, మేం కలిసి పనిచేశాం. ప్రపంచంలోని ఇతర దేశాల గ్రూపులు దీన్ని చేయలేవు" అని భద్రతా అధికారి ఒకరు తెలిపారు.

ఇరాన్‌కు వ్యతిరేకంగా మిడిల్​ ఈస్ట్​లో కొత్త మిత్ర బృందం ఉనికిలోకి రావడానికి ఇది నాంది కావచ్చని కూడా కొందరు అంటున్నారు.

అయితే, దీనిని నిర్దిష్ట భద్రత, సైనిక కోణం నుంచి కూడా చూడవచ్చని మరికొందరు చెబుతున్నారు. ఈ సంఘటనను రాజకీయంగా కాకుండా సాంకేతిక విజయంగా చూడవచ్చని సూచిస్తున్నారు.

కొందరు నిరాశావాద విశ్లేషకుల ప్రకారం, ఇరాన్ నిజంగా ఇజ్రాయెల్‌కు పెద్ద నష్టం కలిగించాలనుకుంటే, అది ముందస్తు హెచ్చరిక ఇవ్వకుండా ఉండాల్సింది. అది తన లక్ష్యాలను పెంచుకుంది, ఒక దాడి ముగిసిన తర్వాత మళ్లీ దాడులు చేసి వుండాలి. ఇజ్రాయెల్‌పై పెద్ద దాడి చేయమని హిజ్బుల్లాను కోరవచ్చు.

ఈ ఘటన ఇజ్రాయెల్ తన భద్రత కోసం మిత్రదేశాలపై ఎంతవరకు ఆధారపడుతుందో ప్రపంచానికి తెలియజేసిందని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్‌ థింక్​ ట్యాంక్​ ప్రాంతీయ భద్రతా వ్యవహారాల డైరెక్టర్ ఎమిలీ హొకాయెమ్ చెప్పారు.

ఒకవేళ దాడుల తీవ్రత పెరిగి ఉంటే, ఇజ్రాయెల్ వద్ద దానికి అవసరమైన వైమానిక రక్షణ క్షిపణులు ఉన్నాయా లేదా అనే సందేహం కలిగిందని మిలీ హొకాయెమ్ అన్నారు.

"తగినంత ఆయుధాగారం ఉండటం ఎంత ముఖ్యమో రష్యా, యుక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధంలో మనం చూశాం" అని హోకాయెమ్ గుర్తుచేశారు.

ఈ సంఘటన మధ్యప్రాచ్యంలో కొత్త సైనిక కూటమికి నాంది కావచ్చనే వాదనను ఆయన కొట్టిపారేశారు.

"మనం కొత్త శకం ప్రారంభంలో లేము. అరబ్ దేశాలు దీనికి సహకరించాయి ఎందుకంటే వాళ్లు ఈ ప్రాంతంలో ఎలాంటి వివాదాలను కోరుకోలేదు" అని అన్నారు.

"వారు తమ పాశ్చాత్య మిత్రదేశాలకు మంచి భాగస్వాములు అని కూడా చూపించాలనుకున్నారు. ఇది వారికి జాతీయ సార్వభౌమాధికారాన్ని కాపాడే విషయం. వారు తమ గగనతలంలో పేలుళ్లు జరగడం ఇష్టపడరు" అని హోకాయెమ్ అన్నారు.

ఆట నియమాలు మారాయి

ఆశావాదుల ప్రకారం, ఇరాన్, ఇజ్రాయెల్ రెండూ ఈ సంఘటన నుంచి కొంత నేర్చుకున్నాయి. ఇరు దేశాలు తమ ఉద్దేశాలను స్పష్టంగా చెప్పడం ఇదే తొలిసారి. ఎలాంటి అవమానాలు లేకుండా ఉద్రిక్తతలను పెంచడం కంటే, వెనక్కి తగ్గడం మంచిదని వారు గ్రహించారు.

ఇజ్రాయెల్‌పై ఇరాన్​ మళ్లీ దాడి చేసి ఉండొచ్చు, కానీ, ఒక్కసారేననే ఉద్దేశాన్ని మిత్రదేశాలకు సందేశంగా పంపింది.

అదే సమయంలో సెంట్రల్ ఇరాన్‌లోని గగనతల రక్షణపై చిన్న దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్ ఎంత శక్తివంతంగా ఉందో చూపించింది. ఎప్పుడు, ఎక్కడైనా దాడి చేయగలనని హెచ్చరించింది.

ఇజ్రాయెల్ ప్రతీకార దాడి తర్వాత మళ్లీ దాడి చేయబోనని ఇరాన్ ముందుగానే సంకేతాలు ఇచ్చింది. రెండు దేశాలు ఖచ్చితంగా సైనిక పాఠాలు నేర్చుకుని ఉండాలి.

"ఈ దాడి ఇజ్రాయెల్ వైమానిక రక్షణ బలహీనతలు, బలాలను గుర్తించడంలో ఇరాన్‌కు సహాయపడి ఉండవచ్చు" అని ఇనిస్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ చెప్పింది.

ఇదికాకుండా ఇరాన్ వ్యూహాలపై ఇజ్రాయెల్, అమెరికాలకు అవగాహన వచ్చి ఉండొచ్చు.

ఇప్పటివరకు ఇరాన్, ఇజ్రాయెల్ ఒకదానికొకటి సంవత్సరాలుగా షాడో యుద్ధం చేస్తున్నాయి. ఇప్పుడు రెండు దేశాలు ఒకరిపై ఒకరు నేరుగా దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

ఫారిన్ అఫైర్స్ కోసం ఫారిన్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన అఫ్షోన్ ఓస్టోవర్ రాసిన ఒక కథనంలో ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేసిన స్థాయిని బట్టి అది ఇకపై సంయమన విధానాన్ని అనుసరించడానికి ఇష్టపడబోదని చూపిస్తుందని తెలిపారు.

ఇరాన్ ఉద్దేశపూర్వకంగా ఇజ్రాయెల్‌పై బలహీనమైన దాడిని చేసిందనడంలో వాస్తవం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దాడితో ఇజ్రాయెల్‌కు పెద్ద దెబ్బ తగులుతుందని ఇరాన్ భావించిందని ఓస్టోవర్ చెప్పారు.

ఇరాన్ , ఇజ్రాయెల్ ఒకరినొకరు అర్థం చేసుకోవడం నేర్చుకున్నారనే వాదనను హోకోయం అంగీకరించలేదు.

డమాస్కస్‌లోని ఇరాన్ కాన్సులేట్‌పై దాడి పరిణామాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడంలో ఇజ్రాయెల్ విఫలమైందని వారు అంటున్నారు.

“ఈ రెండు దేశాలు పరస్పరం మాట్లాడుకోవు. బదులుగా వారు సైనిక మార్గాల ద్వారా, మూడో పక్షం ద్వారానే చెబుతారు'' అని ఆయన తెలిపారు.

రెండు దేశాల పరిమిత నష్టంతో ఆట మునుపటి నియమాలను మార్చాయని ఇజ్రాయెల్ వార్తాపత్రిక హారెట్జ్ డిఫెన్స్​ అనలిస్ట్​ అమోస్ హరేల్ తెలిపారు.

ఈ ఘటనల ద్వారా ఈ ప్రాంతం యుద్ధానికి ఎంత దగ్గరగా ఉందో అక్కడి ప్రజలకు అర్థమైందన్నారు.

“అది చాలా ఉపశమనం కలిగించింది. లేకపోతే భిన్నమైన దిశలో వెళ్లి ఉండేది" అని పాశ్చాత్య దౌత్యవేత్త ఒకరు అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-04-29T01:46:32Z dg43tfdfdgfd