ఈ ఎన్నికలు గుజరాత్​ వర్సెస్​ తెలంగాణ : సీఎం రేవంత్​రెడ్డి

ఈ ఎన్నికలు గుజరాత్​ వర్సెస్​ తెలంగాణ : సీఎం రేవంత్​రెడ్డి

  • ఇది ఫైనల్​ మ్యాచ్​
  • ఈ మ్యాచ్​లో ఎవరిని గెలిపిస్తారో ప్రజలు, యువకులు తేల్చుకోవాలి 
  • శేరిలింగంపల్లి, కూకట్​పల్లిలో కాంగ్రెస్​ అభ్యర్థులకు మద్దతుగా రోడ్​షో

చందానగర్/కూకట్​పల్లి, వెలుగు: ఈ లోక్​సభ ఎన్నికలు ఫైనల్ మ్యాచ్​అని, గుజరాత్ అహంకారానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య పోటీ జరుగుతున్నదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ఈ సమరంలో కాంగ్రెస్​ను గెలిపిస్తారో? తెలంగాణపై మోదీ, అమిత్​షా పెత్తనాన్ని రుద్దుతారో?  రాష్ట్ర యువకులు, ప్రజలు తేల్చుకోవాలని కోరారు. డిసెంబర్​3న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్​ అని, ఇందులో ప్రజలు 420 కేసీఆర్​ను ఓడించి ఇంటికి పంపారని చెప్పారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్​రెడ్డికి మద్దతుగా శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్​లోని తారానగర్​ వద్ద నిర్వహించిన కార్నర్​ మీటింగ్​తోపాటు మల్కాజ్​గిరి అభ్యర్థి సునీతా మహేందర్​రెడ్డి తరఫున కూకట్​పల్లిలో నిర్వహించిన రోడ్​ షోలో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. పదేండ్లు రాష్ట్రాన్ని పట్టి పీడించి వేలాది కోట్లు దోచుకున్న బీఆర్​ఎస్​ పార్టీని  ఓడించి కాంగ్రెస్​ను అధికారంలోకి తెచ్చామని, ఇక  ఏ సమస్యలు లేవని కార్యకర్తలు, నాయకులు అనుకోవద్దన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేయాలని చూస్తున్నదని ఆరోపించారు. దళితులు, బీసీ బిడ్డలు, మైనా ర్టీలు.. డాక్టర్లు, ఐఏఎస్​లు, ఐపీఎస్​లు, ఇతర ఉద్యోగాల్లో రాణిస్తున్నారంటే దానికి కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్లే కారణమని అన్నారు. రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్​ పార్టీ డిమాండ్​ చేస్తుంటే.. బీజేపీ మాత్రం రద్దు చేయాలని చూస్తున్నదని విమర్శించారు. 

బీజేపీని ఓడించి.. కాంగ్రెస్​ను గెలిపించుకుంటాం

బీసీలు, మైనార్టీలు, దళితులకు రిజర్వేషన్లు పెంచాలని మోదీ, అమిత్​షాకు చెప్తే, బీజేపీ వాళ్లు ఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్​ హోం అఫైర్స్​లో తనపై ఫిర్యాదు చేశారని రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ఇది వరకు కేసీఆర్​తనపై 200కు పైగా కేసులు పెడితేనే భయపడలేదని, ఢిల్లీ పోలీసులు తనను ఢిల్లీకి రమ్మంటే తాను రానని చెప్పి శేరిలింగంపల్లి మీటింగ్​కు వచ్చానని పేర్కొన్నారు. కేసీఆర్ ​ఓడిపోతే ఇప్పుడు నరేంద్ర మోదీ వచ్చి కేసులుపెట్టి బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించి, కాంగ్రెస్​ను గెలిపించుకుంటానని చెప్పారు. 

మెట్రోను విస్తరిస్తాం..

ఈ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా రంజిత్​రెడ్డిని గెలిపిస్తే చందానగర్​ నుంచి ఆర్​సీపురం వరకు, హైటెక్​సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్​లోని అమెరికా కాన్సులేట్​ వరకు మెట్రో తీసుకువస్తామని రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారు. వీటితోపాటు నాగోల్​ నుంచి ఎల్బీనగర్, ఎల్బీనగర్​ నుంచి హయత్​నగర్​, ఎల్బీనగర్​ నుంచి ఒవైసీ మీదుగా ఎయిర్​పోర్టు వరకు మెట్రో తీసుకువచ్చే బాధ్యత కాంగ్రెస్​ పార్టీదేనని చెప్పారు. 

విభజన హామీలు నెరవేర్చకుండా పదేండ్లుగా మోదీ తెలంగా ణకు తీరని అన్యాయం చేశారని అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రంజిత్​రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు.  ఆయన వెంట ఎంపీ అభ్యర్థి రంజిత్​రెడ్డి, శేరిలింగంపల్లి కాంగ్రె స్​ ఇన్​చార్జి జగదీశ్వర్​గౌడ్​, కాంగ్రెస్​ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 

కూకట్​పల్లి అభివృద్ధి బాధ్యత నాదే

 మల్కాజ్​గిరి ఎంపీగా సునీతామహేంద్​రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపిస్తే కూకట్​పల్లి అభివృద్ధి బాధ్యత తానే తీసుకుంటానని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. సునీతకు వేసే ప్రతి ఓటు తనకు, తన పాలనకు వేస్తున్నట్టే భావించి, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్​ప్రభుత్వం తనపై కక్షగట్టి కొడంగల్​లో ఓడిస్తే మల్కాజ్​గిరి ప్రజలు తనను అక్కున చేర్చుకుని ఎంపీగా గెలిపించారని తెలిపారు. ముఖ్యంగా కూకట్​పల్లి నియోజకవర్గ కార్యకర్తలు పడిన శ్రమ, ప్రజల ఆదరణ  మర్చిపోలేనని అన్నారు. వారి రుణం తీర్చుకునే అవకాశం తనకు ఇప్పుడు వచ్చిందని తెలిపారు. ఆయన వెంట మాజీ మంత్రి పట్నం మహేందర్​రెడ్డి, నియోజకవర్గ ఎనినకల కో ఆర్డినేటర్​ వినయ్​రెడ్డి, తదితరులున్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T00:44:14Z dg43tfdfdgfd