ఈ ప్రాజెక్ట్ నీటి చుక్క కోసం 8500 ఎకరాలు వెయిటింగ్ .. వరుణదేవా కరుణించవయ్యా అంటున్న రైతులు

వేసవి కాలం ఆరంభం కావడంతోనే ఆదిలాబాద్ జిల్లాలో భానుడు తన ప్రతాపం చూపడం మొదలైంది . అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా కొద్ది రోజులు వాతావరణం చల్లబడి జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురవగా , మళ్లీ భానుడు భగ భగమంటున్నాడు. దీనితో వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది.

దీనికి తోడు ఉక్కపోత కూడా మొదలైంది. కాగా గత వర్షాకాలంలో కురిసిన వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి గ్రామంలోని మత్తడివాగు ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరి నిండుకుండను తలపించింది. అయితే ఈ యేడు ఎండాకాలం ప్రారంభవమడంతోనే ప్రాజెక్టులోని నీటి నిల్వలు క్రమంగా తగ్గుముఖం పట్టి ప్రాజెక్టు వెలవెలబోతోంది. ఇది చూసి ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న ఆయకట్టు రైతులు, ఇదే ప్రాజెక్టులో చేపలు పట్టి ఉపాధి పొందుతున్న మత్స్యకారులు కలవరపడుతున్నారు.

లేతకొబ్బరితో ఐస్‌క్రీమ్ కాంబినేషన్... సమ్మర్‌లో తింటే ఆ మజాయే వేరు... ఇక్కడికి వెళ్లండి మరి

ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 277.50 మీటర్లు. కాగా యాసంగి కాలంలో ఫిబ్రవరి, మార్చి నెలలో నిండుగా కనిపించేది. కానీ ఈ సంవత్సరం మార్చి నెల మొదటి వారం నుండే ప్రాజెక్టులోని నీరు పూర్తిగా తగ్గింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 274 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. ఈ ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా వడ్డాడి గ్రామంతో పాటు తాంసి మండలంలోని జామిడి, కప్పర్ల, బండల నాగపూర్, సావర్గాం, గోట్కూరి, పొచ్చెర తదితర గ్రామాలకు చెందిన సుమారు 8500 ఎకరాల భూమికి సాగు నీరు అందుతుంది. ఏప్రిల్ నెల చివరి వరకు పంటలకు నీరు అందితేనే అవి చేతికి అందే అవకాశం ఉంది. లేకుంటే రైతుల కంట కన్నీరు చూడాల్సిందే. అయితే ప్రస్తుతం క్రమంగా ప్రాజెక్టులోని నీరు ఇంకిపోతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మీ పెళ్లి క్యాసెట్ ప్లే కావట్లేదా? ఇక్కడికి వస్తే చాలు... ఆ వీడియోలను రికవరీ చేసిస్తారు

కాగా ఈ మత్తడి వాగు ప్రాజెక్టులో గత దశాబ్దాల కాలంగా కొందరు మత్స్యకారులు చేపలు పడుతూ ఉపాధిని పొందుతున్నారు. ప్రాజెక్టులోని నీటి మట్టం క్రమం తగ్గుముఖం పడుతుండటంతో మత్స్యకారుల్లోనూ ఆందోళన నెలకొంది. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంత రైతులు, మత్స్యకారుల పాలిట వరప్రదాయినిగా విరాజిల్లుతోంది. వర్షా కాలంలో ఈ ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరడంతో కళకళలాడుతుంది. ఆ సమయంలో సందర్శకుల తాకిడి కూడా పెరుగుతుంది. అయితే వేసవి కాలం ఆరంభం నుండే నీటి మట్టం తగ్గుతూ వస్తుండడం, అధికంగా ఎండలు మండి పోయే సమయంలో ప్రాజెక్టులో నీటి నిల్వలు ఎలా ఉంటాయోనని గ్రామస్థులతో పాటు ఆయకట్టు రైతులు, ఈ ప్రాజెక్టునే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి వరుణదేవా మా మొర ఆలకించవయ్యా అంటూ ఇక్కడి రైతులు, మత్స్యకారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2024-04-19T07:35:11Z dg43tfdfdgfd