‘ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రాణాంతక రసాయనిక పదార్థం’ క్లోరోపిక్రిన్‌ను తన శత్రువులపై రష్యా ప్రయోగిస్తోందా?

యుక్రెయిన్‌‌తో యుద్ధంలో రష్యా రసాయన ఆయుధాలు ప్రయోగిస్తోందని అమెరికా ఆరోపించింది.

రసాయన ఆయుధాలను రష్యా ఓ 'యుద్ద పద్ధతి'గా ఉపయోగిస్తోందని, ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని అమెరికా ఆరోపణలు చేసింది.

యుక్రెయిన్‌తో యుద్ధంలో పైచేయి సాధించేందుకు ప్రాణాంతక క్లోరోఫిలిన్‌ను రష్యా ఉపయోగించిందని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారులు చెబుతున్నారు.

రష్యా రసాయన ఆయుధాలను ప్రయోగించడం ఇదే ఇప్పుడేం కొత్తకాదని, అది రష్యాతో సహా ప్రపంచంలోని పలు దేశాలు సంతకాలు చేసిన కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ (సీడబ్ల్యూసీ)ని ఉల్లంఘించడమేనని అమెరికా అధికారులు అంటున్నారు.

ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

తమపై వచ్చిన ఈ ఆరోపణలన్నింటినీ క్రెమ్లిన్ తిరస్కరించింది. అవి 'నిరాధారమైనవి'గా పేర్కొంది.

నూతన రసాయన ఆయుధాల తయారీ లేదా కొనుగోలు చేయడాన్ని నిషేధించే సీడబ్ల్యూసీ ఒప్పందానికి రష్యా కట్టుబడి ఉందని రష్యన్ ప్రభుత్వ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాస్కోలో అన్నారు.

ప్రపంచంలోని దాదాపు 193 దేశాలు ఈ ఒప్పందాన్ని ఆమోదించాయి.

ఏంటీ క్లోరోపిక్రిన్

ఎవరినైనా చంపేందుకు లేదా ఎవరికైనా హాని కలిగించేందుకు వినియోగించే విషపూరిత రసాయన మూలకాలున్న పదార్ధాలే రసాయన ఆయుధాలని రసాయన ఆయుధాలపై నిషేధం విధించే సంస్థ (ఓపీసీడబ్ల్యూ - ది ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్), సీడబ్ల్యూసీ పరిధిలోని పర్యవేక్షణ కమిటీ చెబుతున్నాయి.

అమెరికా చెబుతున్న 'క్లోరోపిక్రిన్' అనేది మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వాడిన జిడ్డుగా ఉండే ఓ పదార్థం.

యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) ప్రకారం, క్లోరోపిక్రిన్ ఊపిరితిత్తులు, కళ్లు, చర్మానికి హాని చేస్తుంది. వాంతులు, విరేచనాలకు కూడా కారణమవుతుంది.

సీడబ్ల్యూసీ ఒప్పందం ప్రకారం, యుద్ధంలో ఈ రసాయన పదార్థాన్ని వినియోగించడంపై స్పష్టమైన నిషేధం ఉంది. ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రాణాంతక రసాయనిక పదార్థంగా ఓపీసీడబ్ల్యూ దీనిని అభివర్ణించింది.

అమెరికా హెచ్చరికలు

యుద్ధంలో కూడా రష్యా తరచూ టియర్ గ్యాస్‌ను వాడుతోందని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

యుక్రెయిన్‌లో రసాయన ఆయుధాలను మోహరించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే రష్యాకు హెచ్చరికలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రసాయన ఆయుధాలను ఉపయోగిస్తే ''తగిన మూల్యం'' చెల్లించాల్సి వస్తుందంటూ యుక్రెయిన్‌పై దాడి చేసిన కొద్దివారాల తర్వాత, 2022 మార్చిలో బైడెన్ హెచ్చరించారు.

''వాళ్లు (రష్యా) వాటిని (రసాయన ఆయుధాలను) ఉపయోగిస్తే, మేం ప్రతిస్పందిస్తాం'' అని ఆయన అన్నారు. ఎలాంటి చర్యకు దిగితే, అదే రకమైన ప్రతీకార చర్య ఉంటుందన్నారు.

కానీ, అమెరికా హెచ్చరికలను రష్యా పట్టించుకోవడం లేదంటూ నివేదికలు వస్తూనే ఉన్నాయి. అల్లర్లను నియంత్రించేందుకు ఉపయోగించే రసాయనాలను రష్యా ఘర్షణాత్మక ప్రాంతాల్లో వాడుతోందని యూఎస్ ఆర్మ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ సెక్రటరీ మాలోరి స్టీవార్ట్ గతంలో చెప్పారు.

అయితే, ఇటీవల కాలంలో తమ బలగాలపై రసాయన దాడులు జరిగినట్లు యుక్రెయిన్ చెబుతోంది. సీఎస్, సీఎన్ టియర్ గ్యాస్‌తో నిండిన గ్రనేడ్లను రష్యన్ సైనికులు ఉపయోగించారని ఈ ఏడాది ప్రారంభంలో వార్తా సంస్థ రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.

కనీసం 500 మంది యుక్రెయిన్ సైనికులు విషవాయువుల ప్రభావానికి గురై చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని, వారిలో ఒకరు టియర్ గ్యాస్ కారణంగా ఊపిరాడక మరణించినట్లు అందులో పేర్కొంది.

రష్యాపై ఆరోపణలు

సీడబ్ల్యూసీ నిబంధన ప్రకారం రష్యా అవసరమైన చర్యలు చేపట్టిందని, ప్రచ్ఛన్న యుద్ధ కాలంనాటి ఆయుధాల నిల్వలను ధ్వంసం చేసిందని ఓపీసీడ్ల్యూ 2017లో తెలిపింది.

కానీ, రష్యా తన వద్దనున్న నిల్వల్లో సగం గురించి మాత్రమే చెప్పిందని బ్రిటన్‌కి చెందిన హౌస్ ఆఫ్ కామన్స్ లైబ్రరీ ఆరోపించింది.

2017 నుంచి రష్యా రెండు రసాయన దాడులు చేసింది. మొదటిది సాలిస్‌బరీ దాడి. ఇందులో రష్యన్ మాజీ గూఢచారిపై దాడి జరిగింది. 2020లో అప్పటి ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీ‌పై విషప్రయోగం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.

ఈ ఆరోపణలన్నీ 30 మందిని లక్ష్యంగా చేసుకుని ఆమెరికా విధించిన ఆంక్షల్లో భాగమే. నావెల్నీ మరణంతో సంబంధమున్న ముగ్గురు వ్యక్తులు కూడా వారిలో ఉన్నారు.

వారంతా అలెక్సీ నావెల్నీ మరణించిన సైబీరియన్ జైలు కాలనీలో పనిచేస్తున్నారు. నావెల్నీ మరణానికి ప్రభుత్వానికి సంబంధం ఉందన్న ఆరోపణలను రష్యా ఖండించింది. మరోవైపు, నావెల్నీ మరణానికి అధ్యక్షుడు పుతిన్‌దే బాధ్యతని ఆయన భార్య పేర్కొన్నారు.

తూర్పు యుక్రెయిన్‌లో రష్యా విజయం

మే 9న విక్టరీ డే జరుపుకోవడానికి ముందు తూర్పు యుక్రెయిన్‌లో రష్యా పైచేయి సాధించింది.

రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ సాధించిన విజయానికి గుర్తుగా మే 9న రష్యాలో విక్టరీ డే జరుపుకుంటారు.

ప్రస్తుతం రష్యా, యుక్రెయిన్ సైనికుల పోరు చాసివ్ యార్ నగరం చుట్టూ తిరుగుతోంది. అవదీవ్కాను స్వాధీనం చేసుకున్న అనంతరం, ఇప్పుడు రష్యా నియంత్రణ సాధించాలనుకుంటున్న ప్రాంతం ఇది.

యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్‌కి అనుబంధంగా కొనసాగుతున్న సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతిని ఆ బాధ్యతల నుంచి యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ తొలగించిన సమయంలో ఇది జరిగింది.

యుక్రెయిన్‌కి చెందిన ఒక జర్నలిస్టును శిక్షించేందుకు ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ అధిపతిపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఆ జర్నలిస్ట్ రిపోర్ట్ చేశారు.

రష్యా యుద్ధ నేరాలపై హ్యూమన్ రైట్స్ వాచ్ విచారణకు పిలుపునిచ్చింది. లొంగిపోయిన డజనుకి పైగా యుక్రెయిన్ సైనికులను రష్యా హత్య చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. 2023 డిసెంబర్ నుంచి 2024 ఫిబ్రవరి మధ్య ఈ ఘటనలు జరిగినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2024-05-06T01:23:00Z dg43tfdfdgfd