ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ పై నాని ట్వీట్... ఇండస్ట్రీ సపోర్ట్ ఎవరికి?

ఏపీలో ఎన్నికల మహా సంగ్రామానికి రంగం సిద్ధం అయ్యింది. మే 13న 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ+టీడీపీ+జనసేన కూటమిగా బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

జబర్దస్త్ కమెడియన్స్ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాకెట్ రాఘవతో పాటు మరికొందరు పిఠాపురంలో పాగా వేశారు. రోజుల తరబడి ప్రచారం నిర్వహించారు. నాగబాబు, ఆయన సతీమణి పద్మజ, వరుణ్ సందేశ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. 

కాగా ఇండస్ట్రీ నుండి పవన్ కళ్యాణ్ కి మద్దతు పెరుగుతుంది. ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని చిరంజీవి స్వయంగా వీడియో బైట్ విడుదల చేశారు. అలాగే హీరో నాని సైతం తన మద్దతు ప్రకటించారు. సినిమా ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం నెరవేరాలి. ఆయన ఎన్నికల్లో విజయం సాధించాలి. నాతో పాటు మన చిత్ర పరిశ్రమ కూడా ఇదే కోరుకుంటుందని భావిస్తున్నాను... అని నాని ట్వీట్ చేశారు. 

అలాగే నిర్మాత నాగ వంశీ సైతం పరోక్షంగా తన మద్దతు ప్రకటించారు. నాని ట్వీట్ ని ఆయన రీ ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంతో టాలీవుడ్ కి గతంలో వివాదం నడిచింది. సినిమా టికెట్స్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టాలీవుడ్ పెద్దలు వ్యతిరేకించారు. కిరాణా కొట్టు కలెక్షన్ కంటే సినిమా థియేటర్ వసూళ్లు తక్కువగా ఉంటున్నాయని హీరో నాని ఏపీ ప్రభుత్వం పై అసహనం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి వారు మద్దతు ప్రకటిస్తున్నారు. మరికొందరు చిత్ర ప్రముఖులు బహిరంగంగా తన మద్దతు పవన్ కళ్యాణ్ కి ప్రకటించే అవకాశం కలదు.. 

2024-05-07T08:28:59Z dg43tfdfdgfd