ఎన్నికలలో పోటీ చేస్తున్న అత్యంత ధనవంతులు వీరేనా? వీళ్ల ఆర్థిక మూలాలేమిటి? వ్యాపారాలేమిటి?

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు.

ప్రస్తుత ఎన్నికలలో ఇప్పటివరకు నామినేషన్లు వేసినవారిలో వీరే ధనికులన్న చర్చ జరుగుతోంది.

వారిలో ఒకరికి ఇప్పటికే ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండగా మరొకరికి ఇవే తొలి ఎన్నికలు.

అందులో ఒకరు డాక్టర్, మరొకరు ఇంజినీర్.

వారే గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ధి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి.

కొండా విశ్వేశ్వరరెడ్డి గతంలోనూ ధనికుడైన ఎంపీలలో ఒకరిగా, సంపన్న అభ్యర్థిగా ప్రతి ఎన్నికల సమయంలోనూ చర్చలో ఉండగా ఆయన్ను మించిన ఆస్తితో ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ పేరు వినిపిస్తోంది.

ఇంతకీ వేల కోట్ల ఆస్తులు ఉండి ఎన్నికలలో పోటీ చేస్తున్న ఈ అభ్యర్థులకు ఇంత డబ్బు ఎలా వచ్చింది? వారి ఆదాయమార్గాలేమిటి.

పెమ్మసాని చంద్రశేఖర్.. రూ. 5,705 కోట్ల సామ్రాజ్యం

పెమ్మసాని చరాస్తులు 2,316 కోట్ల 54 లక్షల 45 వేల 165 రూపాయలు, భార్య కోనేరు శ్రీరత్న చరాస్తులు 2,289 కోట్ల 35 లక్షల 36 వేల 539 రూపాయలు.

పిల్లలు పెమ్మసాని అభినవ్ చరాస్తులు 496 కోట్ల 27 లక్షల 61 వేల 94 రూపాయలు, మైనర్ కుమార్తె పెమ్మసాని సహస్ర పేరిట ఉన్న చరాస్తులు 496 కోట్ల 47 లక్షల 37 వేల 988 రూపాయలు.

మొత్తంగా వారి చరాస్తుల విలువ 5,598 కోట్ల 64 లక్షల 80 వేల 786 రూపాయలు.

ఇది కాకుండా వారసత్వంగా వచ్చిన, సొంతంగా సంపాదించిన స్థిరాస్తుల ప్రస్తుత విలువ ప్రకారం.. పెమ్మసాని చంద్రశేఖర్‌కు రూ. 72,00,24,245.. ఆయన భార్య పేరిట రూ. 34,82,22,507 ఆస్తులున్నాయి.

మొత్తంగా భార్య, పిల్లల సంపదతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తుల విలువ రూ. 5,705,47,27,538. అంటే 5,705 కోట్ల 47 లక్షల 27 వేల 538 రూపాయలు.

గుంటూరు జిల్లా బుర్రిపాలేనికి చెందిన 48 ఏళ్ల పెమ్మసాని చంద్రశేఖర్ 1999లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన తరువాత అమెరికా వెళ్లి అక్కడ పెన్సిల్వేనియాలో ఇంటర్నల్ మెడిసన్‌లో డాక్టర్ ఆఫ్ మెడిసన్(ఎండీ) 2005లో పూర్తిచేశారు.

తనది, భార్యది ప్రధాన వృత్తి వ్యాపారం అని ఆయన అఫిడవిట్లో వెల్లడించారు.

‘యూవరల్డ్’ అనే ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం స్థాపించి ప్రస్తుతం దానికి సీఈవోగా ఉన్న పెమ్మసానికి అదే ప్రధాన ఆదాయ వనరు.

మెడికల్, నర్సింగ్, అకౌంటింగ్, ఫైనాన్స్, లీగల్, ఫార్మసీ ఇలా అనేక రంగాలలో పరీక్షలకు ఆన్‌లైన్‌లో మెటీరియల్ విక్రయించే పోర్టల్ ఇది. పెమ్మసాని ప్రధాన వ్యాపారం ఇదే.

దీంతో పాటు అమెరికాలో 101 లిస్టెడ్ కంపెనీలలో పెమ్మసాని దంపతులుకు షేర్లు ఉన్నాయి. వాటి విలువ ఆయన అఫిడవిట్ ఇచ్చిన నాటికి 28 కోట్ల 93 లక్షల 3 వేల 933 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 2,415 కోట్లు.

కొండా విశ్వేశ్వరరెడ్డి రూ. 4,568 కోట్లు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి మనవడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రంగారెడ్డి జిల్లాకు కేవీ రంగారెడ్డి పేరే పెట్టారు.

64 ఏళ్ల విశ్వేశ్వరరెడ్డి 1983లో చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీ నుంచి బీఈ పూర్తిచేశారు. అనంతరం 1985లో అమెరికాలోని న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్ పూర్తిచేశారు.

2013లో కేసీఆర్ ఆహ్వానంతో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన 2014 ఎన్నికలలో చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే, 2019 ఎన్నికల నాటికి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి అదే నియోజవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అనంతరం బీజేపీలో చేరిన ఆయన ప్రస్తుత 2024 ఎన్నికలలో చేవెళ్లలోనే పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు.

దాని ప్రకారం.. కొండా విశ్వేశ్వరరెడ్డి చరాస్తుల విలువ 1,178 కోట్ల 72 లక్షల 63 వేల 309 రూపాయలు. ఆయన భార్య సంగీత రెడ్డికి 3,203 కోట్ల 90 లక్షల 79 వేల 76 రూపాయల విలువైన చరాస్తులున్నాయి. వారి కుమారుడు విరాజ్ మాధవ రెడ్డి పేరిట 107 కోట్ల 44 లక్షల 79 వేల 473 రూపాయలు.

స్థిరాస్తుల విషయానికొస్తే.. విశ్వేశ్వరరెడ్డి పేరిట 71 కోట్ల 35 లక్షల 25 వేల 236 రూపాయల విలువైన స్థిరాస్తులు.. భార్య సంగీత రెడ్డి పేరిట 5 కోట్ల 51 లక్షల 25 వేల రూపాయల విలువైన స్థిరాస్తులు, కొడుకు విరాజ్ రెడ్డి పేరిట ఒక కోటి 27 లక్షల 50 వేల రూపాయల విలువైన స్థిరాస్తులున్నాయి.

మొత్తంగా ముగ్గురికి కలిపి 4,568 కోట్ల 22 లక్షల 22 వేల 94 రూపాయల విలువైన ఆస్తులున్నట్లు ప్రకటించారు.

కాగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి భార్య సంగీత రెడ్డి అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాపరెడ్డి కుమార్తె. ప్రస్తుతం ఆమె అపోలో ఆసుపత్రులకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

వ్యాపారం, ఇంజినీరింగ్ తన వృత్తులని, తన భార్య వృత్తి వ్యాపారమని విశ్వేశ్వర్ రెడ్డి తన అఫిడవిట్లో పేర్కొన్నారు.

అద్దెలు, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీలు, పెట్టుబడులపై డివిడెండ్లు, వ్యాపారం తమ ప్రధాన ఆదాయ వనరులని వెల్లడించారు.

నాలుగు దశలలో..

దేశవ్యాప్తంగా ఏడు దశలలో జరుగుతున్న ప్రస్తుత ఎన్నికలలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసింది. మూడు, నాలుగు దశలకు నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ గడువులు ముగిసి పోలింగ్ మాత్రమే పెండింగ్ ఉంది.

ఇప్పటివరకు నాలుగు దశలలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో పెమ్మసాని, కొండా విశ్వేశ్వరరెడ్డిలు అత్యంత సంపన్నమైన అభ్యర్థుల జాబితాలో పైనున్నారు.

మొదటి విడత 21 రాష్ట్రాలలోని 102 నియోజకవర్గాలు.. రెండో దశలో 13 రాష్ట్రాలలోని 89 నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తయింది. మూడో దశలో 12 రాష్ట్రాలలోని 94 నియోజకవర్గాలకు మే 7న పోలింగ్ జరగనుంది. నాలుగో దశలో 10 రాష్ట్రాలలోని 96 నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరగనుంది. మూడు, నాలుగు దశలలో పోటీ చేసే అభ్యర్థులంతా ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు.

ఆ తరువాత మిగతా మూడు దశలలో 163 నియోజవర్గాలలో ఎన్నికలు జరగాల్సి ఉంది.

మొదటి దశలో సంపన్న అభ్యర్థి నకుల్ నాథ్

తొలి దశలో భాగంగా ఏప్రిల్ 19న పోలింగ్ జరిగిన 102 లోక్‌సభ నియోజకవర్గాలలో పోటీ చేసిన 1625 మంది అభ్యర్థులలో 1618 మంది అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్‌లు సంయుక్తంగా పరిశీలించాయి.

అందులో మధ్యప్రదేశ్‌లోని చింద్వారా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న నకుల్ నాథ్ అందరికంటే సంపన్న అభ్యర్థిగా తేల్చారు. ఆయనకు మొత్తం రూ. 716 కోట్ల విలువైన ఆస్తులున్నాయి.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తనయుడే నకుల్ నాథ్. తమిళనాడులోని ఈరోడ్ నియోజకవర్గ అన్నాడీఎంకే అభ్యర్థి అశోక్ కుమార్ రూ. 662 కోట్లు, తమిళనాడులోని శివగంగలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి దేవనాథన్ యాదవ్ రూ. 304 కోట్లతో రెండు, మూడు స్థానాలలో ఉన్నారు.

రెండో దశలో స్టార్ చంద్రు

రెండో దశలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్ జరిగిన 89 లోక్‌సభ నియోజకవర్గాలలో పోటీ చేసిన 1,198 మంది అభ్యర్థులలో 1,192 మంది అభ్యర్థుల అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది.

వారిలో కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి స్టార్ చంద్రు అని పిలిచే వెంకట రమణ గౌడ అందరికంటే సంపన్నుడిగా గుర్తించారు. ఆయనకు రూ.622 కోట్ల ఆస్తులున్నాయి.

తరువాత స్థానాలలో రూ. 593 కోట్ల ఆస్తులతో బెంగలూరు రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేశ్ కుమార్, రూ. 278 కోట్లతో ఉత్తరప్రదేశ్‌లోని మథుర బీజేపీ అభ్యర్థి హేమామాలిని ఉన్నారు.

డీకే సురేశ్ కుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సోదరుడు.

మూడో దశలో పల్లవి శ్రీనివాస్

మూడో దశలో మే 7న పోలింగ్ జరగనున్న 94 నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న 1352 మంది అభ్యర్థులలో దక్షిణ గోవా నియోజకవర్గ బీజేపీ కేండిడేట్ పల్లవి శ్రీనివాస్ డెంపో సంపన్న అభ్యర్థి అని ఏడీఆర్ పరిశీలనలో గుర్తించారు.

మైనింగ్, షిప్పింగ్ వ్యాపారాలు నిర్వహించే డెంపో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉన్న ఆమెకు భర్తతో కలిపి మొత్తం రూ. 1,361 కోట్ల ఆస్తులున్నాయి. అందులో దుబయి, లండన్ వంటి నగరాలలో విలాసవంతమైన భవనాలు వంటివి ఉన్నాయి.

ఆ తరువాత స్థానంలో రూ. 424 కోట్లతో మధ్యప్రదేశ్‌లోని గుణ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా... రూ. 324 కోట్లతో మహారాష్ట్రాలోని కొల్హాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి చత్రపతి సాహు సాహాజీ ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2024-05-02T04:43:49Z dg43tfdfdgfd