ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు రాష్ట్రానికి వచ్చారు : రేణుకా చౌదరి

ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు రాష్ట్రానికి వచ్చారు : రేణుకా చౌదరి

  • తెలంగాణ  తడాఖా ఏంటో చూపిస్తం
  • పెద్ద ఛాతీ ఉండడం కాదు, అందులో మనసు ఉండాలని ప్రధానిపై ఫైర్​

హైదరాబాద్, వెలుగు: ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు. తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. సోమవారం గాంధీ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పోలీసులు ఏ హక్కుతో గాంధీ భవన్ వచ్చి మా పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లకు దమ్ముంటే ప్రజ్వల్ రేవణ్ణను పట్టుకోవాలని సవాల్ చేశారు. నీరవ్ మోదీ, చోక్సీ వంటి వాళ్లు దేశం విడిచి పారిపోయినట్టే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కూడా పారిపోయారని ఆరోపించారు. 

ప్రజ్వల్ ను సపోర్ట్​చేస్తూ ప్రధాని మోదీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. బ్రిజ్ భూషణ్ అన్ని అరాచకాలు చేసినా మళ్లీ టికెట్ ఎలా ఇచ్చారన్నారు. దేశంలోని ముస్లింలకు మోదీ ప్రధాని కాదా? అని నిలదీశారు. పెద్ద ఛాతీ ఉండడం గొప్ప కాదని, అందులో గుండె, మనసు కూడా ఉండాలన్నారు. చైనా మన దేశంలోకి చొరబడుతున్నా ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదన్నారు. దొంగ విద్యార్హత సర్టిఫికెట్లు పెట్టుకొని కొందరు పార్లమెంట్ కు వస్తున్నారని ఆరోపించారు. అనంతరం ‘గల్ఫ్ కార్మిక ద్రోహి, గప్పాల అరవింద్’ పేరిట పీసీసీ ఎన్నారై సెల్ రూపొందించిన ఛార్జ్ షీట్ ను రేణుకా చౌదరి రిలీజ్ చేశారు. 

ఇందులో  పీసీసీ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, కేరళ ప్రవాసి కాంగ్రెస్ నేత మునీర్ పాల్గొన్నారు. 2019 లో మాయమాటలతో గల్ఫ్ కార్మికుల ఓట్లు కొల్లగొట్టి నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అరవింద్ .. ఆ తర్వాత వాళ్లను మోసం చేశాడని అందులో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే హక్కు అరవింద్ కు లేదన్నారు. కరోనా కష్టకాలంలో గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చే కార్మికుల నుంచి రెండుమూడింతలు విమాన చార్జీలు వసూలు చేసినా.. కేంద్రాన్ని అరవింద్  ప్రశ్నించలేదన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-07T02:33:11Z dg43tfdfdgfd