ఏడేళ్ల పాటు దీన్ని మగ హిప్పో అనుకున్నారు, కానీ..

జపాన్‌లోని ఒక జూలో ఏడేళ్లపాటు మగదిగా భావించిన హిప్పోపోటమస్ ఇప్పుడు ఆడదని తేలింది.

‘ఇది మగ హిప్పోలా ఏమాత్రం ప్రవర్తించడంలేదు ఎందుకు?’ అని అనుమానించిన జూ సిబ్బంది 12 ఏళ్ల జెన్-చాన్‌కు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు.

జెన్-చాన్‌ను 2017లో మెక్సికో నుంచి ఒసాకాకు తీసుకొచ్చారు. అప్పట్లో కస్టమ్స్ పత్రాల్లో దీన్ని మగ హిప్పోగా పేర్కొన్నారు.

‘‘జెన్-చాన్‌ ప్రశాంతంగా జీవించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు మేం చేయాల్సిందంతా చేస్తాం’’ అని జూ తెలిపింది.

గత వారం తమ వెబ్‌సైట్లో పబ్లిష్ చేసిన ఒక వార్తలో ‘ఒసాకా టెన్నోజీ జూ’ జెన్-చాన్ జెండర్‌ను ధ్రువీకరించింది.

మెక్సికోలోని ‘ఆఫ్రికమ్ సఫారీ యానిమల్ పార్క్’ నుంచి ఈ హిప్పోను తీసుకొచ్చినట్లు పోస్టులో పేర్కొన్నారు. అప్పట్లో దాని వయసు ఐదేళ్లు మాత్రమే. దాన్ని మగదిగా మెక్సికో సిబ్బంది చెప్పారని తెలిపారు.

అప్పట్లో జెన్-చాన్ ఇంకా చిన్నగానే ఉండటంతో.. డాక్యుమెంట్లలో వివరాలను జపాన్ అధికారులు ధ్రువీకరించుకోలేకపోయారు.

అయితే, జెన్-చాన్ వయసు పెరిగేటప్పటికీ మగ జీవికి ఉండాల్సిన ప్రత్యుత్పత్తి అవయవాలు లేకపోవడంతో జూ సిబ్బందికి అనుమానం వచ్చింది.

ఈ విషయంపై ఒసాకా టెన్నోజీ జూ అధికార ప్రతినిధి ఏఎప్‌పీ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘‘ఆడ హిప్పోల దగ్గరకు అది వెళ్లేది కాదు. అలానే తన భూభాగాన్ని(టెరిటరీని) మార్క్ చేసుకోవడానికి మలాన్ని ఆ ప్రాంతం చుట్టూ పడేలా వేయడం లాంటివి చేసేది కాదు’’ అని చెప్పారు.

‘‘జెండర్‌ను మొదట్లోనే గుర్తించాల్సిన ప్రాముఖ్యత మాకు అర్థమైంది. భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు జరగకుండా మేం జాగ్రత్త వహిస్తాం’’ అని జూ వైస్ డైరెక్టర్ కియోషి యసుఫుకు.. మైనిషి పత్రికతో చెప్పారు.

అయితే, జెన్-చాన్‌కు ప్రస్తుతం పేరు మార్చే ఆలోచనేమీలేదని జూ సిబ్బంది స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-04-25T14:22:26Z dg43tfdfdgfd