ఐకే రెడ్డి, శ్రీహరి రావు మధ్య సయోధ్య కుదిరేనా?

ఐకే రెడ్డి, శ్రీహరి రావు మధ్య  సయోధ్య కుదిరేనా?

  • ఇద్దరి మధ్య సమన్వయంపై మంత్రి సీతక్క దృష్టి
  • శ్రీహరి రావు ఇంట్లో సమావేశం
  • కలిసిపోతే హస్తానికి చేకూరనున్న బలం 

నిర్మల్, వెలుగు: మాజీ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్​లో చేరారు. ఆయన హస్తం గూటికి చేరుతారని కొద్దికాలం పాటు సాగిన సందిగ్ధతకు బుధవారం తెరపడింది. కాంగ్రెస్​రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్​మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి చేరికను ఇప్పటివరకు అడ్డుకున్న డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరి రావు అధిష్టానం నిర్ణయంతో వెనుకడుగు వేయాల్సి వచ్చింది. జిల్లాలో మరింత బలపడాలంటే ఈ ఇద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే తూర్పు, పడమరగా ఉన్న ఈ ఇద్దరి మధ్య సమన్వయం కుదర్చడం పార్టీకి కత్తిమీద సాములా మారింది.

ఈ ఇద్దరి మధ్య సమన్వయాన్ని మంత్రి సీతక్క ఛాలెంజ్​గా తీసుకున్నారు. వీరు ఒక తాటిపైకి వచ్చి పనిచేస్తే పార్లమెంట్​అభ్యర్థి ఆత్రం సుగుణకు జిల్లాలో మెజార్టీ ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఐకే రెడ్డి కాంగ్రెస్​లో చేరినప్పటికీ.. ఈ కార్యక్రమానికి శ్రీహరి రావు హాజరు కాకపోవడంతో ఈ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీతక్క ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం ఇంద్రకరణ్​రెడ్డితో కలిసి శ్రీహరి రావు ఇంటికి వెళ్లిన సీతక్క ఆయనతో చర్చలు జరిపారు.

ఇద్దరూ సమన్వయంతో కలిసి పని చేయాలని, కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం పకడ్బందీగా ప్రచారం కొనసాగించాలని సూచించారు. రాహుల్​గాంధీ సభను విజయవంతం చేయాలని, ఎక్కడా సమన్వయ లోపం జరగకుండా చూసుకోవాలన్నారు. అయితే మంత్రి సమక్షంలో ఇద్దరూ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ రాహుల్ గాంధీ పర్యటన తర్వాత వీరి వ్యవహార శైలి ఎలా ఉండబోతోందోనని చర్చ సాగుతోంది. నిన్నటి వరకు ఇంద్రకరణ్ రెడ్డి చేరికను వ్యతి రేకిస్తూ శ్రీహరి రావు వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం, అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయడం వంటి అంశాలు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనన్న సందిగ్ధం నెలకొంది. 

మెజార్టీపై ఆశలు

విభేదాలు పక్కనపెట్టి ఐకే రెడ్డి, శ్రీహరి రావు సమన్వయంతో పనిచేస్తే పార్టీ అ భ్యర్థి గెలుపు కోసం పనిచేస్తే నిర్మల్ జిల్లాలో పైచేయి సాధించే అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముథోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో ఓడిపోగా ఒక్క ఖానాపూర్​లో మాత్రం గెలుపొందింది. ఈ ఓటమితో పార్టీ శ్రేణులు కొంత నిరాశ చెందినప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి పూర్వ వైభవం వచ్చినట్లయ్యింది.

బీఆర్ఎస్​కు చెందిన మాజీ ఎమ్మెల్యే విఠల్​రెడ్డి సహా వందలాదిమంది ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వరుసకట్టి కాంగ్రెస్​లో చేరడంతో ఆ పార్టీలో ఉత్సాహం కనిపిస్తోంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం కాంగ్రెస్​లో చేరడంతో ఆ పార్టీ మరింత బలపడింది. మొత్తానికి ఐకే రెడ్డి, శ్రీహరి రావు మధ్య సయోధ్య కుదిరితే పార్లమెంట్ ఎన్నికల్లో నిర్మల్ జిల్లా నుంచి మెజార్టీ ఓట్లను సాధించవచ్చని కాంగ్రెస్ వర్గాలు ఆశిస్తున్నాయి.

©️ VIL Media Pvt Ltd.

2024-05-05T01:11:03Z dg43tfdfdgfd