ఒకట్రెండు రోజుల్లో .. పంట నష్టపరిహారం జమ చేస్తాం : తుమ్మల నాగేశ్వర్​ రావు

ఒకట్రెండు రోజుల్లో .. పంట నష్టపరిహారం జమ చేస్తాం : తుమ్మల నాగేశ్వర్​ రావు

  • నిధుల విడుదలకు ఈసీ పర్మిషన్ ఇచ్చింది

హైదరాబాద్, వెలుగు: మార్చిలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన పరిహారం ఒకట్రెండు రోజుల్లో రైతుల అకౌంట్లలో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​ రావు వెల్లడించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదివారం ఓ ప్రకటనలో ఆదేశించారు. 2024, మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలకు పది జిల్లాల్లో పంట నష్టం సంభవించిందని తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 15,814 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి నివేదికను ప్రభుత్వానికి అందజేశారని పేర్కొన్నారు. దీనికి గానూ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.10వేల చొప్పున రూ.15.81 కోట్లను పరిహారం కింద రైతులకు చెల్లించడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ‘‘లోక్​సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ అనుమతి కోరింది.

 రైతుల ఇబ్బందులను పరిగణనలోనికి తీసుకొని పంట నష్టపరిహారం అందించేందుకు అనుమతివ్వాలని ఈసీని రిక్వెస్ట్ చేశాం. ప్రభుత్వ అభ్యర్థన మేరకు నిధుల విడుదలకు ఈసీ పర్మిషన్ ఇచ్చింది. పంటనష్టం సంభవించిన నెలన్నర వ్యవధిలోనే పరిహారం అందించడానికి సర్కారు సన్నాహాలు చేస్తున్నది. సోమ, మంగళ వారాల్లో పంట నష్టపరిహారం అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి’’అని తుమ్మల పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T04:30:21Z dg43tfdfdgfd