కనీసం నా అంత్యక్రియలకైనా రండి.. ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున ఖర్గే భావోద్వేగం

తన సొంత రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన స్వస్థలం కలబురగిలో జరిగిన బహిరంగ సభలో ఖర్గే మాట్లాడుతూ.. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయకుంటే.. కనీసం తన అంత్యక్రియలకైనా హాజరుకావాలని ఓటర్లను కోరారు. నియోజకవర్గంలోని ప్రజలు కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేయకుంటే, తనకు ఇక ఇక్కడ స్థానం లేదని భావిస్తానని, వారి హృదయాల్లో తన చోటులేదని అనుకుంటా ఆయన చెప్పారు. తన ఊపిరి ఉన్నంత వరకు బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం ఆగదని కాంగ్రెస్ అధ్యక్షుడు స్పష్టం చేశారు.

ప్రస్తుతం కలబురగి నుంచి ఖర్గే అల్లుడు దొడ్డమాని రాధాకృష్ణ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ‘ప్రస్తుతం దేశంలో ఏం జరుగుతోందంటే.. ఇద్దరు అమ్మకందార్లు, ఇద్దరు కొనుగోలుదార్లు ఉన్నారు.. అమ్మకందార్లు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, కొనుగోలుదార్లు అంబానీ, అదానీ.. మాజీ ప్రధాని జవహర్‌ లాల్ నెహ్రూ స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదానీలకు మోదీ, అమిత్‌ షాలు అమ్మేస్తున్నారు ’ అని ఖర్గే ధ్వజమెత్తారు.

‘నేను రాజకీయాల కోసమే పుట్టాను. నేను ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా, ఈ దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నా చివరి శ్వాస వరకు కృషి చేస్తాను. నేను రాజకీయాల నుంచి విరమించుకోను... ఒకరు ఒక పదవి నుంచి రిటైర్ కావచ్చు.. కానీ, వారి సిద్ధాంతాల నుంచి ఎప్పటికీ రిటైర్డ్ కాకూడదు’ అనిని కాంగ్రెస్ చీఫ్ ఉద్ఘాటించారు.

ఈ సందర్భంగా పక్కనే ఉన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఉద్దేశించి ఖర్గే మాట్లాడారు. ‘మీరు సీఎం లేదా ఎమ్మెల్యేగా రిటైర్డ్ కావచ్చు కానీ, బీజేపీ, ఆరెస్సెస్ సిద్ధాంతాలను ఓడించే వరకు మీరు రాజకీయాల నుంచి విరమించుకోవద్దని పదే పదే సిద్ధరామయ్యకు చెబుతున్నాను’ అని ప్రత్యర్థి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి మల్లికార్జున ఖర్గే పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఖర్గే భావోద్వేగానికి గురయ్యారు.

కేరళ రాజధాని తిరువనంతపురంలో విలేకరుల సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీకి అనూహ్యంగా ఓటర్ల మద్దతు లభిస్తుండటంతో మోదీ నిరాశకు గురవుతున్నారని అన్నారు. అందుకే ఓటర్లలో మతపరమైన చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. ప్రతిదానికీ మతంతో సంబంధం అంటగట్టి దేశాన్ని నాశనం చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, చిల్లర రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-25T07:03:07Z dg43tfdfdgfd