కరాచీలో ఆత్మాహుతి దాడి..తప్పించుకున్న జపాన్ పౌరులు

కరాచీలో ఆత్మాహుతి దాడి..తప్పించుకున్న జపాన్ పౌరులు

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌‌‌‌లోని కరాచీలో ఐదుగురు జపాన్ పౌరులు ప్రయాణిస్తున్న వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది. శుక్రవారం లాంధీలోని ముర్తాజా చోరంగి ఏరియాలో జరిగిన ఈ ఘటనలో సూసైడ్ బాంబర్ తో సహా ముగ్గురు చనిపోయారు. మరొకరు తీవ్ర గాయాలతో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వెహికల్ లోని జపాన్ పౌరులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. జంజామాలో నివసిస్తున్న ఐదుగురు జపానీయులు.. పాకిస్తాన్ సుజుకి మోటార్స్‌‌‌‌ కంపెనీలో  పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. 

శుక్రవారం తెల్లవారుజామున వాళ్లు కంపెనీకి వ్యానులో బయలుదేరారని చెప్పారు. అప్పటికే ముర్తాజా చోరంగి ఏరియాలో కాపుకాసి ఉన్న ఇద్దరు టెర్రరిస్టుల్లో ఒకరు వ్యాన్ వైపు వెళ్లి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని తెలిపారు. అది విఫలమవ్వడంతో  మరో టెర్రరిస్ట్ కాల్పులు జరిపాడని చెప్పాడు. ఈ ఘటనలో వెహికల్ లోని జపాన్ పౌరులతో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు(45) చనిపోగా..వ్యాన్ డ్రైవర్ కు బుల్లెట్ గాయాలయ్యాయని వివరించారు. ఆ తర్వాత రెండో టెర్రరిస్టును అధికారులు కాల్చిచంపారని వెల్లడించారు. గాయపడిన వ్యాన్ డ్రైవర్ ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతున్నాడని తెలిపారు. ఈ ఘటనపై పాకిస్తాన్  కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్(సీటీడీ) ఇన్‌‌‌‌చార్జ్ రాజా ఉమర్ ఖట్టాబ్ స్పందించారు. తనకు వచ్చిన సమాచారం ప్రకారం వ్యానుపై టెర్రరిస్ట్ దాదాపు 15 రౌండ్లు కాల్పులు జరిపాడని చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-20T04:16:02Z dg43tfdfdgfd