కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు పదిలమేనా? మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, సీపీఐతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా ఒక అసెంబ్లీ సీటులో పోటీ చేసి కమ్యూనిస్టు పార్టీ విజయం కూడా సాధించింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. తమకు ఒక సీటు కేటాయించాలని సీపీఐ పార్టీ ఇది వరకే కాంగ్రెస్ పార్టీని కోరింది. దీనిపై హస్తం పార్టీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తున్న వేళ సీపీఐ ప్రతిపాదన పరిస్థితి ఏమిటీ అనే ఉత్కంఠ ఉన్నది. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఇంకా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. ఈ నెల 31వ తేదీన మరోసారి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఆ సమావేశంలోనే పెండింగ్ సీట్ల అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. ప్రస్తుతం ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కమ్యూనిస్టులు కరీంనగర్ సీటు ఆశిస్తున్నారు. ఈ సీటు కోసం కాంగ్రెస్ నాయకుడు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.

అసలు కమ్యూనిస్టు పార్టీకి టికెట్ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం కరీంనగర్ సీటుకు సంబంధించి సీపీఐ, సీపీఎం పార్టీలు హస్తం పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్టు ట్వీట్ చేశారు. దీంతో కమ్యూనిస్టులకు భంగపాటే మిగిలిందా? అనే అనుమానాలు వస్తున్నాయి.

2024-03-28T13:28:57Z dg43tfdfdgfd