కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం స్థానంలో మళ్లీ మసీదు నిర్మిస్తారు: రఘునందన్ రావు

లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న క్రమంలో అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై చేసే విమర్శల్లో ఘాటు పెంచుతున్నారు. తాము గెలిస్తే ఏం చేస్తామన్న విషయాలతో పాటు తమ ప్రత్యర్థులు గెలిస్తే ఏం చేస్తారో కూడా వివరిస్తూ.. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. బీజేపీ పార్టీ గెలిస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్లీ దేశం వెనక్కి వెళ్తుందంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి కౌంటర్‌గా మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. అయోధ్య రామమందిరం స్థానంలో మళ్లీ బాబ్రీ మసీదు నిర్మిస్తారని.. మళ్లీ దేశమంతా బాంబులు పేలుతాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సంగారెడ్డిలో.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామళైతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన రఘునందన్ రావు.. జగ్గారెడ్డిపై విమర్శలు గుప్పించారు. బీజేపీ నుంచి రాజకీయం మొదలు పెట్టిన జగ్గారెడ్డి.. రాష్ట్రంలో అసలు బీజేపే లేదని మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టారు. సంగారెడ్డి హిందువుల అడ్డ అని పేర్కొన్నారు. అయోధ్య ప్రారంభానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. జగ్గారెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతున్నారని, సంగారెడ్డిని జగ్గారెడ్డి బహిష్కరించడం కాదు.. ప్రజలే జగ్గారెడ్డిని బహిష్కరించారని రఘునందన్‌రావు తెలిపారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ్యారెంటీ ఇచ్చారంటే అది కచ్చితంగా జరిగి తీరుతుందని రఘునందన్ రావు చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ చొరవతోనే శతాబ్ధాల నిరీక్షణ ఫలించి అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు లాంటి సాహోసోపేతమైన నిర్ణయాలు ఒక్క మోదీకే సాధ్యమన్నారు.

మరోవైపు.. 45 డిగ్రీల ఎండలో కూడా ఇక్కడ కార్యకర్తలు సూర్యుడినే భయపెడుతున్నారని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అభినందించారు. తెలంగాణలో అభివృద్ధి కావాలంటే కమలం వికసించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ఇంకా అమలు కాలేదని విమర్శించారు. అబద్ధాలతో ప్రభుత్వాన్ని ఏర్పరిచారని.. దేశ భవిష్యత్తు రక్షణ కావాలంటే అది మోదీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్‌ నేతలకు రామమందిరాన్ని తాకే హక్కు కూడా లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తాము రక్తం చిందించి తెచ్చిన చట్టాలన్నింటినీ రద్దు చేస్తుందన్నారు అన్నామలై.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T18:04:11Z dg43tfdfdgfd