కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట

కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట

కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్, ఇండియా కూటమి మహిళలకు పెద్దపీట వేయడం బీజేపీకి ముఖ్యంగా పీఎం నరేంద్ర మోదీకి మింగుడు పడడం లేదు.  మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో 50 శాతం రిజర్వేషన్​తో పాటు,  పేద మహిళలకు నెలకు 8,500 రూపాయల చొప్పున, ప్రతి ఏడాది లక్ష రూపాయలు వారి అకౌంట్​లో వేస్తారు.  కోట్లాది మంది గృహిణులకు  దీనివల్ల ఒక ఆత్మ స్థైర్యం పెరుగుతుంది.  గతంలో  తమిళనాడులో సినీ నటుడు  కమల్ హాసన్  కొత్తగా పార్టీ పెట్టి  అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేసేముందు గృహిణులకు వేతనం ఉండాలి అనే ప్రతిపాదన తెచ్చారు. 

 చైనాలో కూడా ఒక మహిళ ఇందుకోసం కోర్టుకు వెళ్లింది.  ఇలా మహిళలు గృహంలో  కుటుంబాన్ని నిలబెట్టడం కోసం శ్రమ చేస్తున్న విషయం మీద ప్రపంచంలో చర్చ కూడా జరిగింది. ఇప్పుడది కాంగ్రెస్ మేనిఫెస్టోలో చోటు చేసుకోవడం హర్షణీయం.  ఈ స్కీం వల్ల మహిళలకు ఎలా లాభం జరుగుతుంది?  కుటుంబం బడ్జెట్​కు  ఎలా తోడు అవుతుందో  కాంగ్రెస్​  నేతలు వివరిస్తున్నారు.  

రాహుల్ గాంధీ,  ప్రియాంకా గాంధీ తమ ఎన్నికల ప్రచారంలో అందరికీ అర్థమయ్యే విధంగా వివరిస్తున్నారు. పురుషునికి సమానంగా బయట 8 గంటలు ఉద్యోగం చేసి వచ్చి, ఇంటిలో వంట, ఇంటిపనిని మహిళలు చేస్తారు.  భర్తకు, పిల్లలకు ఇలా ఇంటిలో అందరికీ భోజనం పెట్టిన తర్వాత గానీ గృహిణి తినదు.  ఒక్కోసారి పేద కుటుంబాల్లో తల్లి అందరికీ వడ్డించినంక అన్నం మిగలకపోతే ఆకలితోనే పడుకుంటుంటుంది.  అమ్మ ఒక అన్​పెయిడ్ లేబర్ లాంటిది. అలాంటి మహిళలకు ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రాధాన్యం పెరిగింది. 

అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీజేపీ

పది ఏండ్ల నుంచి దేశాన్ని పాలిస్తున్న పాలకులు, ముఖ్యంగా పీఎం నరేంద్ర మోదీకి, హోం మంత్రి అమిత్ షా తదితర బీజేపీ నేతలకు కాంగ్రెస్​ హామీలు నచ్చడం లేదు.  దీంతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. జాతీయ చానల్  కూడా పీఎం మోదీ ప్రచారం చేస్తున్నట్లు.. కాంగ్రెస్  మేనిఫెస్టోలో  హిందువుల బంగారం, తాళిబొట్టు తీసుకుని ఇతరులకు ఇస్తారని, ఆస్తులు తీసుకుని ముస్లింలకు పంచుతారని, రెండు ఇండ్లు ఉంటే  ఒక ఇల్లు,  రెండు కార్లు ఉంటే ఒక కారు ఇతరులకు ఇచ్చేస్తారని కాంగ్రెస్​  మేనిఫెస్టోలో రాసి లేదని స్పష్టంచేయడం విశేషం.

  కాంగ్రెస్ పార్టీ  మేనిఫెస్టోలోని పాంచ్​న్యాయ్,  25 గ్యారంటీలు  ఇప్పుడు  దేశంలోని  నిరుద్యోగుల్లో,   రైతుల్లో,  మహిళల్లో చర్చనీయాంశం అయింది.  మోదీ  ప్రభుత్వం పది సంవత్సరాలలో  ప్రజలకు చేసిన న్యాయం ఏమీ లేదని అంతా గ్రహిస్తున్నారు.  ఓటమి భయంతో  బీజేపీ.. రాహుల్ గాంధీ కుటుంబం మీద అబద్ధపు ప్రచారం చేస్తున్నట్లు స్పష్టత వచ్చింది.  

కాంగ్రెస్​వైపు సబ్బండ వర్గాలు మొగ్గు

ఒక ప్రధాన మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా తన హోదాకు మచ్చను మిగిల్చే ఉపన్యాసాలు ఇవ్వడం దేశమే కాదు, ప్రపంచం సైతం చూస్తున్నది.  ఎన్నికల ప్రచారంలో  అమిత్ షా తెలంగాణకు వచ్చినపుడు, ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్​లను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని అమిత్ షా బహిరంగంగా చెప్పి వెళ్లారు.  బీజేపీ నేతలు, పీఎం మోదీ తదితరులు,  మైనారిటీలను టార్గెట్ చేసి మాట్లాడడంతో వారంతా కాంగ్రెస్ కే ఓటు వేయాలని తీర్మానించుకునే పరిస్థితి వచ్చింది. 

 క్రిస్టియన్లు, దళితులు, ఆదివాసీలు, బీసీలు ఎక్కువగా కాంగ్రెస్​ వైపు మొగ్గు చూపుతుండగా,  ఎస్టీలు మొత్తంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే పరిస్థితి వచ్చింది. తెలంగాణలోనూ పరిస్థితి అలాగే ఉంది.  మహిళల రక్షణకు సంబంధించి కూడా కాంగ్రెస్ పైనే ఎక్కువ నమ్మకం ఉంది.  అన్నింటికన్నా ముఖ్యమైనది మనదేశ రాజ్యాంగం.  రాజ్యాంగం ద్వారా సంక్రమించే హక్కులు, మరోవైపు ప్రజాస్వామ్యం పరిరక్షణ ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన విషయంగా మారింది. 

ఎండి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్, ఎనలిస్ట్​

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T00:59:18Z dg43tfdfdgfd