కాంగ్రెస్‌‌లోకి గుత్తా అమిత్‌‌!.. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి దూరం

కాంగ్రెస్‌‌లోకి గుత్తా అమిత్‌‌!.. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి దూరం

నల్గొండ, వెలుగు : శాసనమండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌రెడ్డి కొడుకు అమిత్‌‌రెడ్డి త్వరలో కాంగ్రెస్‌‌లో చేరనున్నారు. బీఆర్‌‌ఎస్‌‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలతో అమిత్‌‌ ఆ పార్టీని వీడాలనే అభిప్రాయానికి వచ్చారు. తన తండ్రితో పాటు తన పట్ల పార్టీ నేతలు వ్యవహరిస్తున్న  తీరు అవమానకరంగా ఉందని, ఇన్నాళ్లూ ఎలాగోలా సర్దుకుపోయాం తప్ప ఇంకా ఊరుకుంటే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చారు. 

చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌రెడ్డి కేసీఆర్‌‌పైన, జిల్లా నేతలపైన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌‌గా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌‌కుమార్ చేసిన కామెంట్లు పెద్ద దుమారాన్నే లేపాయి. గుత్తా వర్గీయులు గురువారం నల్గొండలో కిశోర్‌‌ మీద ఎదురుదాడికి దిగారు. ఎంతో అనుభవం కలిగిన సుఖేందర్‌‌రెడ్డిపైన కిశోర్‌‌కుమార్‌‌ చేసిన వ్యాఖ్యల పట్ల అమిత్‌‌ మనస్తాపానికి గురయ్యారు. పార్టీని చక్కబెట్టాల్సిన హైకమాండ్‌‌ సైతం జిల్లా వ్యవహారాల విషయంలో అంటీముట్టనట్టుగానే ఉంటోంది. దీంతో ఇక లాభం లేదనుకున్న గుత్తా అమిత్‌‌ బీఆర్‌‌ఎస్‌‌ను వీడాలన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలు, ముఖ్యనేతలతో చర్చిస్తున్నారు.

ఇప్పటికైతే గుత్తా చేరిక లేనట్లే..

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నందున మండలి చైర్మన్‌‌ సుఖేందర్‌‌రెడ్డి ఇప్పటికిప్పుడు పార్టీ మారే అవకాశాలు లేవని పలువురు అంటున్నారు. పార్టీలకు అతీతమైన చైర్మన్‌‌ పదవిలో ఉన్నందున రాజకీయంగా ఎలాంటి సమస్యలు రావని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమిత్‌‌ పొలిటికల్‌‌ కెరీర్‌‌ను దృష్టిలో పెట్టుకొని ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదనే గుత్తా వర్గం భావిస్తోంది. గుత్తా వర్గీయులు ఇప్పటికే కాంగ్రెస్‌‌లో చేరిపోయారు. అమిత్‌‌ కాంగ్రెస్‌‌లో చేరితే 

గుత్తా వర్గానికి నాయకత్వం వహించినట్లు ఉంటుందన్న చర్చ నడుస్తోంది. జానారెడ్డితో, సుఖేందర్‌‌రెడ్డికి ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా కాంగ్రెస్‌‌ ఎంపీ క్యాండిడేట్‌‌ రఘువీర్‌‌ రెడ్డి నామినేషన్‌‌ సందర్భంగా బుధవారం నల్గొండలో చైర్మన్‌‌ గుత్తా, అమిత్‌‌ను కలిశారు. దీంతో అమిత్‌‌ చేరికపై అనుమానాలు తొలగిపోయినట్లేనని ప్రచారం జరుగుతోంది.

అమిత్‌‌ రాకను కోరుకుంటున్న కాంగ్రెస్‌‌ శ్రేణులు

కాంగ్రెస్‌‌ నుంచి ఎంపీ టికెట్‌‌ ఆశించిన అమిత్‌‌ జిల్లా మంత్రులు, ముఖ్యనేతలతో పాటు, సీఎం రేవంత్‌‌రెడ్డి ముఖ్యసలహాదారు వేం సురేందర్‌‌రెడ్డిని సైతం కలిశారు. గుత్తా తమ్ముడు, మదర్‌‌ డెయిరీ చైర్మన్‌‌ జితేందర్‌‌రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్‌‌ తరఫున ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రి జగదీశ్‌‌రెడ్డిపైన గుత్తా సుఖేందర్‌‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి సైతం సమర్థించారు. అమిత్‌‌ రాకను జిల్లా కాంగ్రెస్‌‌ శ్రేణులు సైతం కోరుకుంటున్నాయి.

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-27T04:10:00Z dg43tfdfdgfd