కాళేశ్వరంపై క్షుణ్నంగా విచారణ చేపడతా: పీసీ ఘోష్

కాళేశ్వరంపై క్షుణ్నంగా విచారణ చేపడతా: పీసీ ఘోష్

  • ఎన్‌‌‌‌డీఎస్‌‌‌‌ఏ నివేదికను అధ్యయనం చేస్తా: పీసీ ఘోష్
  • కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన
  • ఇరిగేషన్​ శాఖ నిపుణులతో కలిసి మూడు గంటల పాటు పర్యటన 
  • పరిశీలనలో వెలుగులోకి వచ్చిన విషయాలను ప్రభుత్వానికి నివేదిస్తానని వెల్లడి

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, కాటారం, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై క్షుణ్నంగా విచారణ చేపడుతానని ఆ ప్రాజెక్ట్‌‌‌‌ జ్యుడీషియల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌, సుప్రీం కోర్టు మాజీ జడ్జి‌‌ పినాకి చంద్రఘోష్​ తెలిపారు. 'కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌పై విచారణ ఇప్పుడే మొదలైంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయంలో నేషనల్‌‌‌‌ డ్యామ్‌‌‌‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌‌‌డీఎస్‌‌‌‌ఏ) తయారు చేసిన నివేదిక ఇంకా నాకు అందలేదు. ఆ నివేదిక అందగానే క్షుణ్నంగా స్టడీ చేసి, విచారణ జరుపుతా.  అనుభవం కలిగిన ఇంజినీర్లతో కలిసి మరోసారి బ్యారేజీ సందర్శిస్తా’ అని వెల్లడించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన న్యాయ విచారణలో భాగంగా ఇరిగేషన్ శాఖ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి పీసీ ఘోష్​ మంగళవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. జిల్లాకు తొలిసారిగా విచ్చేసిన సుప్రీం కోర్టు మాజీ జడ్జికి  కలెక్టర్‌‌‌‌ భవేశ్‌‌‌‌ మిశ్రా, ఎస్పీ కిరణ్‌‌‌‌ ఖరే  పుష్పగుచ్ఛాలు అందించి, స్వాగతం పలికారు. వీరిద్దరితోపాటు కమిషన్ కు సంబంధించిన ఆఫీసర్లు, నిపుణుల బృందం వెంటరాగా పీసీ ఘోష్​ మేడిగడ్డ బ్యారేజీ  వంతెనపై  కాలి నడకన సాగుతూ అణువణువునా పరిశీలించారు. ముందుగా బ్యారేజీ పై భాగంలో కుంగిన రోడ్డును చూశారు.

7వ బ్లాక్‌‌‌‌లో మూడు పియర్స్‌‌‌‌ భూమిలోకి కుంగడంతో పైన ఉన్న రోడ్డు వీ షేప్‌‌‌‌లోకి మారడాన్ని గమనించారు. అలాగే, వంతెన పై నుంచే కిందికి వంగి చూశారు. అనంతరం వెహికల్స్‌‌‌‌పై బ్యారేజీ దిగువ భాగానికి చేరుకున్నారు.  ఏడో బ్లాక్ లో దెబ్బతిన్న 20వ పిల్లర్  ప్రాంతాన్ని పరిశీలించి, ఆఫీసర్ల నుంచి వివరాలు సేకరించారు. పిల్లర్లకు వచ్చిన భారీ క్రాక్‌‌‌‌లను గమనించారు. బ్యారేజి దిగువన పక్కనే ఉన్న 19, 21వ పిల్లర్లను పరిశీలించారు. పిల్లర్ల కింది భాగంలో వచ్చిన పగుళ్లను గమనించారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితులు,  పిల్లర్లు కుంగుబాటు వంటి పలు అంశాలపై కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌కు ఇరిగేషన్‌‌‌‌ ఇంజినీర్లు  అక్కడే ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌ ద్వారా వివరించారు. ఫొటోలు చూపిస్తూ వివరాలు వెల్లడించారు. 

క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన  విషయం పై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కమిషన్  పర్యటిస్తుందని పీసీ ఘోష్​ వెల్లడించారు. ఇరిగేషన్ శాఖ నిపుణులతో కలిసి మేడిగడ్డ బ్యారేజి పరిశీలించినట్టు చెప్పారు. తమ పరిశీలనలో వెలుగులోకి వచ్చిన విషయాల పై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. అనంత రం కాళేశ్వరం టెంపుల్‌‌‌‌ను దర్శించుకొని, తన భార్యతో కలిసి పూజలు చేశారు. ఆ తర్వాత రామగుండం వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్‌‌‌‌ శాఖ ఓ అండ్ ఎం జనరల్ అనిల్ కుమార్, ఓ అండ్ ఎం ఈఎన్సీ నాగేందర్ రావు, సీఈ సుధాకర్ రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకట కృష్ణ, ఈఈ తిరుపతి రావు, ఎల్ అండ్ టీ ప్రాజెక్టు మేనేజర్ రజనీశ్, తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-08T03:22:05Z dg43tfdfdgfd