కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలని హైకోర్టులో కేఏ పాల్‌ పిటిషన్

కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలని హైకోర్టులో  కేఏ పాల్‌ పిటిషన్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో డొల్లతనం బట్టబయలైందని, ప్రజాధనం దుర్వినియోగం అయినందున సీబీఐ దర్యాప్తు జరిపేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ మౌసమీ భట్టాచార్యతో కూడిన బెంచ్​ గురువారం విచారించింది. విచారణకు కేఏ పాల్‌ స్వయంగా హాజరయ్యారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం కోరినా.. హైకోర్టు ఆదేశించినా దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీబీఐ తెలిపింది.

అయితే, ప్రభుత్వం వనరులు సమకూర్చాలని చెప్పింది. సీబీఐ విచారణకు ఆదేశిస్తే మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు బట్టబయలు అవుతాయి”అని పాల్‌ వాదన. అయితే, ఇదే తరహాలో గతంలో దాఖలైన వ్యాజ్యాలతో కలిపి దీనిని కూడా విచారణ చేస్తామని హైకోర్టు ప్రకటించింది. అనంతరం పాల్‌ మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీ కూడా మేడిగడ్డ కుంగుబాటుపై మాట్లాడటం లేదని విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మేఘా కృష్ణారెడ్డి పార్టీలకు నిధులు సమకూర్చారని, ఆ తర్వాత నుంచి అన్ని పార్టీలు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదన్నారు. సీబీఐ దర్యాప్తుతో వాస్తవాలు వెలుగులోకి  వస్తాయన్నారు.    

  ©️ VIL Media Pvt Ltd.

2024-03-29T01:13:05Z dg43tfdfdgfd