క్వీన్స్‌లాండ్ మహిళా ఎంపీ: ‘నాకు డ్రగ్స్ ఇచ్చి లైంగికంగా దాడి చేశారు’

ఆస్ట్రేలియాకు చెందిన ఆరోగ్య శాఖ సహాయమంత్రి, క్వీన్స్‌లాండ్ ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు. కొందరు వ్యక్తులు తనకు మత్తుమందు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డార అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఆస్ట్రేలియా పోలీసులు విచారణ చేపట్టారు.

సెంట్రల్ క్వీన్స్‌లాండ్‌లోని తన నియోజకవర్గమైన యెప్పూన్‌లో రాత్రిపూట ఈ ఘటన జరిగిందని బ్రిటానీ తెలిపారు.

"ఇలాంటిది మరెవరికైనా జరగొచ్చు, ఇది విషాదకరం" అని ఆమె అన్నారు.

37 ఏళ్ల బ్రిటానీ ఏప్రిల్ 28న ఈ ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు, అనంతరం ఆసుపత్రికి వెళ్లారు.

"నా శరీరంలో డ్రగ్స్ ఉన్నట్లు పరీక్షల్లో తేలాయి, వాటిని నేను తీసుకోలేదు" అని బ్రిటానీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ పదార్ధం తనపై గణనీయంగా ప్రభావం చూపిందని చెప్పారు.

డ్రగ్స్ బాధిత మహిళలు శనివారం సాయంత్రమే తనను కలిశారని బ్రిటానీ చెప్పారు.

"ఇది కరెక్టు కాదు. మన పట్టణంలో మత్తుమందులు లేదా దాడుల ప్రమాదం లేకుండా మనం ఆనందంగా ఉండాగలగాలి" అని ఆమె అన్నారు.

తనకు జరిగినట్లే చాలామందికి జరిగిందని పలువురు మహిళలు తనకు చెప్పినట్లు బ్రిటానీ తెలిపారు.

తాను శారీరకంగా, మానసికంగా కోలుకోవడానికి సమయం కావాలని ఆమె అన్నారు.

పోలీసులు ఏమంటున్నారు?

యెప్పూన్‌లో ఆదివారం నమోదైన ఒక లైంగిక వేధింపుల కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు క్వీన్స్‌లాండ్ పోలీస్ సర్వీస్ (క్యూపీఎస్) అధికారులు ధృవీకరించారు.

ఆ ప్రాంతంలో ఇలాంటి రిపోర్టులు ఇంతకుముందు లేవని, అయితే అలాంటి అనుభవం ఎవరికైనా ఎదురైతే, సంప్రదించాలంటూ పోలీసులు తెలిపారు.

ఘటన జరిగిన సమయంలో ఆమె తాగిన డ్రింక్‌ రిపోర్టులను పరిశీలిస్తున్నట్లు క్వీన్స్‌లాండ్ పోలీసులు తెలిపారు.

ఘటన షాక్‌కు గురిచేసింది: మంత్రి మేఘన్

బ్రిటానీ 2015లో కెప్పెల్ స్థానం నుంచి తొలిసారిగా ఎన్నికయ్యారు.

ఈ ఆరోపణలు షాకింగ్, భయంకరంగా ఉన్నాయని క్వీన్స్‌లాండ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి మేఘన్ స్కాన్లాన్ అన్నారని ఆస్ట్రేలియన్ మీడియా పేర్కొంది.

"బ్రిటానీ నా సహోద్యోగి, ఫ్రెండ్, క్వీన్స్‌లాండ్ పార్లమెంటులో ఆమె ఒక యువ నాయకురాలు. ఈ ఘటన గురించి తెలిశాక షాక్‌కు గురయ్యాను" అని మేఘన్ స్కాన్లాన్ తెలిపారు.

"గృహ, కుటుంబ, లైంగిక హింసకు మహిళలు బాధితులు కావడం ఆమోదయోగ్యం కాదు. మహిళలను రక్షించడానికి, హింస జరగకుండా నిరోధించడానికి మా ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తూనే ఉంటుంది." అని మంత్రి అన్నారు.

మహిళలపై పెరుగుతున్న దాడులు

ఆస్ట్రేలియాలో ఇటీవల లింగ-ఆధారిత హింస ఎక్కువైంది.

ఏప్రిల్‌లో సిడ్నీ షాపింగ్ సెంటర్‌లో ఒక దుండగుడు ఆరుగురిని కత్తితో పొడిచి చంపాడు. బాధితుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు.

నిందితుడు మహిళలకు హాని కలిగించడానికే దాడి చేసినట్లు ఉందని న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ అక్కడి ఏబీసీ న్యూస్‌తో చెప్పారు.

హత్యలను ఖండిస్తూ స్థానికులు ర్యాలీలు చేశారు.

లింగ-ఆధారిత హింసను జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని, కఠిన చట్టాలను తీసుకురావాలని నిరసనకారులు పిలుపునిచ్చారు.

ఆస్ట్రేలియాలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు సగటున ప్రతి నాలుగు రోజులకు ఒక మహిళ హత్యకు గురవుతోందని తేలింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-05-05T12:50:47Z dg43tfdfdgfd