చంద్రబాబు మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదంటున్న బీజేపీ నేత? ఎందుకో తెలుసా ?

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీకి ఎన్నికలకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒక్కొక్కరిగా తమ మేనిఫెస్టోలో ప్రకటించాయి. అయితే వైసీపీ మేనిఫెస్టో తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి మేనిఫెస్టో ప్రకటించారు. ఈ సారి ఏపీలో కూటమిగా ఏర్పడిన బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే మేనిఫెస్టోలో మాత్రం ఎక్కడా కూడా బీజేపీ మార్క్ కనిపించలేదు. అంతేకాకుండా ఆ మ్యానిఫెస్టో కాపీలో ఎక్కడా మోడీ ఫోటో కానీ.. బీజేపీ కమలం గుర్తు కానీ లేదు. కేవలం చంద్రబాబు, పవన్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అయితే కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేసే సమయంలో ఢిల్లీ నుంచి బీజేపీ నేత సిద్దార్థ నాథ్ సింగ్ వచ్చారు. ఈ ముగ్గురు నాయకులు నిలబడి ఫోటోలకు...పత్రికలకు ఫోజులిచ్చే ముందు కాపీని చేత్తో పట్టుకోవడానికి కూడా బీజేపీ నేత సిద్దార్థ నాథ్ ఇష్టపడలేదు.

అయితే అనంతరం ఓ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రత్యేక మేనిఫెస్టో ఉందని.. ఆయన మాట్లాడటం విశేషం. అదే రాష్ట్రంలోనూ ప్రచురించామన్నారు. ఇప్పుడు ఇచ్చింది టీడీపీ, జనసేన మేనిఫెస్టో అని.. దాంతో బీజేపీకు ఎలాంటి సంబంధం లేదని సిద్దార్థ నాథ్ చెప్పారు. ఇదిలా ఉంటే... అసలు రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఎవరూ రాలేదు.అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం హాజరు కాలేదు. దీంతో ఇది జస్ట్ పవన్... చంద్రబాబుల పొత్తు అని తేలిపోయింది. మేనిఫెస్టో చూస్తేనే... మనకు టీడీపీ సారధ్యంలో ఏర్పడిన కూటమి మనసులు కలవని బలవంతపు కాపురమే అని అర్థమవుతుంది. ఇది ఎన్నికల కోసం ఏర్పడిన తప్పనిసరి తంతు తప్ప అందులో తమకేం పెద్ద పాత్ర లేదని బీజేపీ తేల్చేసింది.

అసలేం జరిగింది?

2014 లోనూ ఇదే మూడు పార్టీలు పొత్తులో ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు చంద్రబాబు దాదాపు ఆరువందల హామీలు ఇచ్చి... ఆ తరువాత మాటతప్పి.. మ్యానిఫెస్టోను పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేశారు. అయితే ఇప్పుడు ఆ మ్యానిఫెస్టోను ఎన్నికల వేళ మరోసారి సీఎం వైయస్ జగన్ బయటకు తీసి.. ఒక్కో హామీని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. అందులో ఇచ్చినవి ఒక్కటైనా అప్పట్లో బాబు అమలు చేశారా అంటూ రాష్ట్ర ప్రజల్ని జగన్ ప్రశ్నిస్తున్నారు. ఈ హామీలకు అప్పట్లో మోడీ.. పవన్ సైతం గ్యారెంటీగా ఉన్నారు... వాళ్ళ ఫోటోలు సైతం ఉన్నాయ్. మళ్ళీ అలాంటి వాళ్లకు ఓట్లేస్తారా అంటూ ఊరూరా ప్రచారం చేయడంతో... చంద్రబాబు అమలు సాధ్యం కానీ హామీలవల్ల మేమెందుకు ప్రజలకు జవాబుదారీ కావాలి? మేమెందుకు పరువు పోగొట్టుకోవాలని భావించిన బీజేపీ ఈసారి ఆ హామీల విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దని కమల పార్టీ తేల్చి చెప్పింది.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల విషయంలో కూడా చంద్రబాబు తమను మోసం చేసినట్లు కేంద్రం గుర్తించింది.. పీవీఎన్ మాధవ్, జివిఎల్ నరసింహారావు... సోము వీర్రాజు వంటివాళ్లకు టిక్కెట్లు ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులనే బీజేపీ నేతలుగా చూపించి టిక్కెట్లు ఇచ్చుకుని అసలైన బీజేపీ నేతలను మోసం చేసారని అధిష్టానం గమనించింది. దీంతో చంద్రబాబు వైఖరి మారదని స్పష్టత వచ్చిన ఢిల్లీ బీజేపీ నేతలు మీ మ్యానిఫెస్టోలో మాకు ఏం సంబంధం లేదని తేల్చేశారు.

2024-05-02T15:01:04Z dg43tfdfdgfd