చనిపోయిన వ్యక్తి వస్తువులను ఇతరులు వాడొచ్చా..? గరుడ పురాణం ఏం చెబుతోంది?

భూమి మీద మరణం ఒక్కటే శాశ్వతం. ఈ లోకంలో పుట్టిన వాళ్లు ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే, ఈ భూలోకంలో తన జీవనయానం ముగించుకుని భౌతిక దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. మరణానంతరం ఆ వ్యక్తి జ్ఞాపకాలు, వారికి సంబంధించిన వస్తువులు మాత్రమే మనతో ఉంటాయి. భూమిపై జీవించి ఉన్నప్పుడు అందరూ మంచి జీవితాన్ని గడపడానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మరి వారు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి భౌతిక వస్తువులను ఏం చేయాలి? దీనికి సంబంధించి ప్రజలకు చాలా సందేహాలు ఉంటాయి. చనిపోయిన వ్యక్తి వస్తువులను ఇతరులు ఉపయోగించాలా? వద్దా? లేదా వాటిని పడేయాలా? అని ఆలోచిస్తుంటారు. గరుడ పురాణం ప్రకారం.. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

* చనిపోయిన వ్యక్తి నగలు ధరించవచ్చా?

గరుడ పురాణం ప్రకారం.. చనిపోయిన వ్యక్తి ఆభరణాలను ఇతరులు ధరించకూడదు. ఆ ఆభరణాలను స్మారక చిహ్నాలుగా లేదా సెంటిమెంట్ కారణాల కోసం ఉంచుకోవచ్చు. వాటిని ధరించడం వల్ల మరణించిన వ్యక్తి ఆత్మను ఆకర్షించినట్లు అవుతుంది. మరణానికి ముందు వారి ఆభరణాలను మీకు బహుమతిగా ఇచ్చి ఉంటే, వాటిని ధరించవచ్చు. అలాగే మరణించిన వ్యక్తి ఆభరణాలకు కొత్త ఆకృతిని ఇవ్వడం ద్వారా.. అంటే వాటిని కరిగించి కొత్త డిజైన్‌లో మౌల్డ్ చేసిన తర్వాత కూడా ధరించవచ్చు.

* చనిపోయిన వ్యక్తి వస్త్రాలు?

గరుడ పురాణం ప్రకారం, పొరపాటున కూడా చనిపోయిన వ్యక్తి దుస్తులను ఇతరులు ధరించకూడదు. ఎందుకంటే ఆ బట్టలు వారి ఆత్మలను ఆకర్షిస్తాయి. ప్రత్యేకించి మరణించిన వ్యక్తి దుస్తులను కుటుంబ సభ్యులు ధరిస్తే, అది చెడు ప్రభావాలను కలిగిస్తుంది. అలా చేస్తే, చనిపోయిన వ్యక్తి ఆత్మ సులభంగా అనుబంధాల బంధాలను తెంచుకోలేక ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటుంది.

మరణించిన వారి వస్త్రాలు ధరిస్తే పితృ దోషం బారిన పడవచ్చు. అందువల్ల చనిపోయిన వ్యక్తికి దగ్గరగా ఉన్న వ్యక్తులు ఈ దుస్తులను వాడకూడదు. తెలియని వ్యక్తులకు వాటిని బహుమతిగా ఇవ్వవచ్చు లేదా దానం చేయవచ్చు.

* ఇతర వస్తువులను ఏం చేయాలి?

మరణించిన వ్యక్తికి సంబంధించిన ఇతర వస్తువులను జ్ఞాపకంగా ఉంచుకోవచ్చు లేదా ఎవరికైనా విరాళంగా ఇవ్వవచ్చు. అయితే పొరపాటున కూడా మరణించిన వ్యక్తి గడియారాన్ని ఇతరులు ధరించకూడదు. అలా చేయడం కూడా పితృ దోషానికి కారణం కావచ్చు. మరణించిన వ్యక్తి వాడిన దువ్వెన, షేవింగ్ కిట్‌, వస్త్రధారణ వస్తువులు లేదా రోజువారీ వస్తువులు కూడా దానం చేయాలి లేదా నాశనం చేయాలి.

మరణించిన వ్యక్తి పడుకున్న మంచం సైతం దానం చేయడం మంచిది. వీటితో పాటు చనిపోయిన వారి జాతకాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు. దాన్ని ఆలయంలో ఉంచాలి లేదా పవిత్ర నదిలో పడేయాలని గ్రంథాలు చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల మరణించిన వారి ఆత్మకు విముక్తి లభిస్తుంది.

2024-05-07T10:03:29Z dg43tfdfdgfd