చనిపోయేవారికి చివరి క్షణాల్లో ఏం కనిపిస్తుంది, వారి ప్రవర్తన ఎందుకు వింతగా ఉంటుంది?

అమెరికాలో వైద్యుడిగా పని చేస్తున్న క్రిస్టోఫర్ కెర్‌కు 1999 ఏప్రిల్‌లో ఒక ఘటన ఎదురైంది. అది తన కెరీర్‌నే మార్చేస్తుందని ఆయనకు అప్పుడు తెలియదు.

తన పేషెంట్లలో ఒకరైన మేరీ ఆస్పత్రిలో బెడ్‌ మీద పడుకుని ఉన్నారు. చుట్టూ ఆమె నలుగురు పిల్లలు కూర్చున్నారు. మరణ అంచుల్లో ఉన్న మేరీ, ఒక్కసారిగా లేచి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.

70 ఏళ్ల మేరీ బెడ్‌పై కూర్చుని, ఆమెకు మాత్రమే కనిపిస్తున్న ఒక బేబీని చేతులు చాచి ఎత్తుకున్నారు. ఆ బేబీని ఆమె డానీ అని పిలిచారు. దగ్గరకు తీసుకుని, హత్తుకుని ముద్దు పెట్టుకున్నారు. ఆ బేబీ ఆమెకు తప్ప ఎవరికీ కనిపించడం లేదు. ఆమె ప్రవర్తన మాత్రం వింతగా ఉంది.

పిల్లలకు ఏం జరుగుతోందో అర్ధం కాలేదు. డానీ అనే పేరును వారెప్పుడూ వినలేదు.

ఆ తర్వాత రోజు మేరీ సోదరి ఆస్పత్రికి వచ్చారు. అప్పుడు ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మేరీకి ఈ పిల్లలు పుట్టకముందు, డానీ అనే కొడుకు పుట్టి చనిపోయినట్లు ఆమె సోదరి తెలిపారు.

ఆ తర్వాత మేరీ చాలా బాధను అనుభవించారని, చనిపోయిన బిడ్డ గురించి ఆ తర్వాత ఎప్పుడూ మేరీ మాట్లాడలేదని చెప్పారు.

కెర్ ఒక మామూలు వైద్యుడు. కార్డియోలాజీలో నైపుణ్యం ఉంది. న్యూరోబయోలజీలో పీహెచ్‌డీ చేశారు. ఇదంతా ఆయనకు చాలా అరుదైన వ్యవహారంలా అనిపించింది.

దీనిని చూశాక, చనిపోయే ముందు వ్యక్తులకు ఎదురయ్యే అనుభవాల మీద రీసెర్చ్ చేసేలా ఈ ఘటన కెర్‌ను ప్రేరేపించింది.

మేరీ సంఘటన జరిగి ఇప్పటికీ 25 ఏళ్లు అవుతుంది. చనిపోబోయే వ్యక్తులకు వచ్చే కలలు, ఊహలు, వారికి కనిపించే విషయాలపై అధ్యయనం చేసిన ప్రపంచ ప్రముఖులలో కెర్ ఒకరుగా మారారు.

మరణానికి కొన్ని వారాల ముందుగా ఈ అనుభవాలు ఎదురవుతాయని కెర్ చెప్పారు. చివరి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఈ అనుభవాలు మరింత పెరుగుతాయని తెలిపారు.

తమ జీవితాల్లో కోల్పోయిన ముఖ్యమైన వ్యక్తులు, వస్తువులతో వాళ్లు తిరిగి గడుపుతున్న అనుభవాలను తాను గమనించానని కెర్ చెప్పారు.

ఎన్నో ఏళ్ల కిందట చనిపోయిన తమ తల్లిదండ్రులు, పిల్లలు, పెంపుడు జంతువులను వాళ్లకు కనిపిస్తాయని, వాళ్లు వారితో మాట్లాడతారని కెర్ అన్నారు.

ఇలాంటి అనుభవాల వల్ల చనిపోబోయే వారికి మనశ్శాంతి లభిస్తుందని ఆయన అన్నారు.

‘‘ఈ సంబంధాలన్నీ కూడా వారికి అర్థవంతంగా కనిపిస్తాయి. ఓదార్పునిస్తాయి. అనుభవించిన జీవితంపై తృప్తిని, చావు అంటే భయాన్ని తగ్గిస్తాయి’’ అని బీబీసీతో అన్నారు కెర్.

ఈ రోగులు భ్రమపడటం లేదని, శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు కూడా వారిలోని భావోద్వేగం, ఆధ్యాత్మిక దృష్టి అలాగే ఉంటుందని కెర్ అన్నారు.

అయితే, చాలామంది వైద్యులు ఇదంతా పేషెంట్ల భ్రమ లేదా గందరగోళ పరిస్థితి అని అభివర్ణిస్తున్నారు. ఇది నిజమేనని చెప్పేందుకు మరింత శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని తెలిపారు.

మృత్యువుకు దగ్గరగా ఉన్న వారు ఏం చూస్తున్నారో రోగులను అడుగుతూ 2010 నుంచి అమెరికాలో కెర్ దీనిపై అధ్యయనం చేశారు.

మరణపు అంచుల్లో ఉన్న వ్యక్తుల అనుభవాలపై క్రిస్టోఫర్ కెర్ పలు రిపోర్టులను రూపొందించారు.

ఈ అధ్యయనానికి ముందు చాలా రిపోర్టులు థర్డ్ పార్టీల నుంచి సేకరించిన అనుభవాలతో రూపొందించినవే. చనిపోతున్న రోగులు ఏం చూస్తున్నారో ఊహిస్తూ సిద్ధం చేసిన డాక్యుమెంట్లు అవి.

మరణపు అంచుల్లో ఉన్నప్పుడు వారికి కనిపిస్తున్నవి ఏంటి? వాటి అర్థమేంటి? ఇవి రోగులపై, వారి కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? వంటి విషయాలను కెర్ తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

ఈ ఫలితాలు స్వీడన్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌తో సహా పలు సైంటిఫిక్ జర్నల్స్‌లలో ప్రచురితమయ్యాయి.

అయితే, ఈ అనుభవాలను వివరించేందుకు కెర్‌కు ఒక నిర్దిష్టమైన సమాధానం ఇప్పటికీ దొరకలేదు. ఈ పరిస్థితికి గల కారణాన్ని అర్థం చేసుకోవడం తన అధ్యయనాల ప్రధాన లక్ష్యం కాదని అన్నారు.

కెర్ ప్రస్తుతం న్యూయార్క్ రాష్ట్రంలోని బుఫాలో ప్రాంతంలో ఉన్న పాలియేటివ్ కేర్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు.

పాలియేటివ్ కేర్ అంటే తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడే వారికి ప్రత్యేకంగా ఉపశమన చర్యలు అందించే కేంద్రం.

‘డెత్ ఈజ్ బట్ ఏ డ్రీమ్: ఫైండింగ్ హోప్ అండ్ మీనింగ్ ఎట్ లైఫ్స్ ఎండ్’ అనే పేరుతో ఆయన పుస్తకం 2020లో ప్రచురితమైంది. ఈ పుస్తకం పది భాషల్లో అనువాదం చేశారు.

బాంధవ్యాల విషయంలో ఆలోచనలు ఒక అర్థవంతమైన, ఓదార్పునిచ్చే రూపంలో తిరిగి వస్తాయని కెర్ చెప్పారు.

చివరి దశలో ఈ అనుభవాల గురించి తాను చేపట్టిన అధ్యయనంపై కెర్ బీబీసీకి వివరించారు.

ఇన్నేళ్ల మీ అధ్యయనంలో, ఈ అనుభవాల నుంచి మీరేం నేర్చుకున్నారు?

‘‘ప్రజలు చివరి దశలో ఉన్నప్పుడు వారిలో మానసిక క్షోభ పెరుగుతుందని మనకు అనిపిస్తుంది. కానీ, అది నిజం కాదు. చనిపోతున్న వ్యక్తులు మిగిలిన వారిని ప్రేమతో దగ్గరకు తీసుకోవడం అసలు నిజం’’ అని తెలిపారు.

అంటే మనం ఆలోచిస్తున్న దానికి భిన్నంగా ఉంటుందని చెప్పారు. మరణాన్ని మనం చూసే విధానం, మనం అంచనావేసే తీరు, మనం అనుభవించేది ఒకేలా ఉండవని తెలిపారు.

మీ అధ్యయనం ప్రకారం, చివరి దశలో ప్రజల అనుభవాలు ఎంత కామన్‌గా ఉంటున్నాయి?

‘‘సుమారు 88 శాతం మంది ఇలాంటి అనుభవాల్లో కనీసం ఒకదాన్ని అనుభవిస్తున్నట్లు మా అధ్యయనాల్లో వెల్లడైంది. మా రేటు సాధారణం రిపోర్టు అయ్యే వాటి కంటే 20 శాతం అధికంగా ఉంది. ఎందుకంటే, ప్రతి రోజూ మేం అలాంటి వ్యక్తులతో మాట్లాడుతూనే ఉన్నాం’’ అని తెలిపారు.

‘‘చనిపోవడమనేది ఒక ప్రక్రియ. సోమవారం రోజూ మనం రోగుల వద్దకు వచ్చినప్పుడు, శుక్రవారం చెప్పిన దానికి భిన్నంగా వారికి సమాధానం రావొచ్చు. మరణానికి దగ్గర పడుతున్న కొద్దీ రోగులలో ఈ అనుభవాలు మరింత పెరగడాన్ని గమనించాం.’’ అని కెర్ అన్నారు.

చనిపోయిన వారు ఎక్కువగా కనబడుతుంటారు

‘‘రోగులలో మూడొంతుల మందికి చివరి రోజుల్లో ప్రయాణం లాంటి అనుభూతులు కలుగుతున్నాయి. వారు కోల్పోయిన ఆప్తులను గుర్తుకు తెచ్చుకోవడం చాలా కామన్‌గా జరుగుతోంది.’’ అని కెర్ తెలిపారు.

‘‘మరణం దగ్గర పడుతున్నప్పుడు, అంతకు ముందు చనిపోయిన వారు మరింత ఎక్కువగా కనపడుతుంటారు. ఇది వారికి ఒక సాంత్వన అనుభవంగా కనిపిస్తుంది’’ అని చెప్పారు.

‘‘దేని గురించి వారు కలలు కంటున్నారో అది ఆశ్చర్యకరం. వారు ప్రేమించిన, మద్ధతుగా నిలిచినవారు, తమకు చాలా దగ్గరివారిగా భావించిన వ్యక్తుల గురించి వారు ఆలోచిస్తున్నారు. వారు తల్లిదండ్రులు కావొచ్చు లేదా తోబుట్టువులు కావొచ్చు ’’ అని తెలిపారు.

గతంలో ఏమైనా మానసికంగా గాయమైతే , ఈ అనుభవాలతో వారు సాంత్వన పొందుతున్నారు.

ఇలాంటి వ్యక్తులకు మతిమరుపు ఉంటుందన్నది నిజం కాదా? ఈ అనుభవాలు భిన్నంగా ఉండటానికి కారణమేంటి?

‘‘మతిమరపు లేదా అయోమయ స్థితిలో ఉండటం చాలా సాధారణం. ముఖ్యంగా చివరి రోజుల్లో. కానీ, వీరు చాలా భిన్నమైన వారు’’

‘‘మతిమరుపు ద్వారా పొందే అనుభవాల నుంచి వీరు ఓదార్పు పొందలేరు. ఈ అనుభవాలు కొన్నిసార్లు భయాన్ని కలిగిస్తాయి. తరచూ చికిత్స లేదా పూర్తిగా బెడ్‌పై పరిమితమైన రోగులలో ఆందోళనను కలిగిస్తాయి’’ అని చెప్పారు.

ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కొంటున్న పిల్లలతో కలిసి మీరు పనిచేస్తుండొచ్చు. చివరి రోజుల్లో పిల్లలకు, పెద్ద వారికి కలిగే అనుభవాల్లో ఉన్న తేడాలేంటి?

‘‘పిల్లలలో కూడా ఇది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే, వారికి ఫిల్టర్స్ ఉండవు. ఊహకు, వాస్తవానికి మధ్య తేడాను వారు కనుగొనలేరు. మరణం అనే ప్రక్రియ గురించే వారికి తెలియదు. అందుకే, వారు ఆ క్షణం సంతృప్తికరంగా జీవిస్తారు. చివరి రోజులేంటి అనే విషయాల గురించి వారు ఆలోచించరు’’

రోగులకు కలిగే ఈ అనుభవాలు వారి కుటుంబాలపై ఇతర వ్యక్తులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి?

‘‘దీనిపై మేం రెండు పేపర్లు రాశాం. 750 ఇంటర్వ్యూలు చేశాం. ఈ అధ్యయనంలో బాధ నుంచి విముక్తి కలిగే ప్రక్రియను మేం చూశాం. ఆరోగ్యకరమైన రీతిలో వీరు దు:ఖాన్ని పొందుతున్నారు. వారు కోల్పోయిన వ్యక్తులను గుర్తుకు తెచ్చుకుంటారు’’ అని చెప్పారు.

ఈ అంశంపై అర్థవంతమైన చర్చలన్నీ కూడా మానవీయ కోణాల నుంచే వచ్చాయని, వైద్యం నుంచి కాదని మీరు చెప్పారు. అయితే, ఈ విషయంలో వైద్యానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు? మీరు అధ్యయనం ప్రారంభించిన దశాబ్దాలలో దీనిలో ఏదైనా మార్పు వచ్చిందా?

‘‘లేదు, ఇది మరింత ప్రమాదకరంగా మారింది’’

‘‘ఈ మానవీయ కోణాలు మన ఉనికిని, జీవిత అర్థాన్ని ప్రశ్నిస్తాయని నేను భావిస్తా. మానవీయ కోణాలలో ఎలాంటి కపటత్వం ఉండదు’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-05-08T10:31:40Z dg43tfdfdgfd