చెంగిచర్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్తే కేసులా: కిషన్​ రెడ్డి

చెంగిచర్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్తే కేసులా: కిషన్​ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ పాలన అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడం, అక్రమంగా అరెస్టులు చేయడం, కేసులతో నోరునొక్కడమేనా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం చెంగిచర్ల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, కార్యకర్తలను అడ్డుకోవడంతో పాటు అక్రమ కేసులు పెట్టడం, బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్ ను హౌజ్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

హోలీ పండుగ రోజు చెంగిచెర్లలో దాడి చేసిన వాళ్లను వదిలి, ఆత్మరక్షణ కోసం అడ్డుకున్న వాళ్లపై హత్యాయత్నం కేసు ఎలా పెడతారని  కిషన్​రెడ్డి ప్రశ్నించారు. చెంగిచర్ల ఏమైనా నిషేధిత ప్రాంతమా? బారికేడ్లు పెట్టి మరీ స్లాటర్ హౌస్ నడుపుతున్న మాఫియాకు వంతపాడడం కరెక్ట్ కాదన్నారు. అక్కడున్న స్లాటర్ హౌజ్ ను తొలగించాలని,  బీజేపీ నేతలు, కార్యకర్తలపై కేసులను వెనక్కి తీసుకొని, బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పాలనలో హిందువులు బతికే పరిస్థితి లేదని, అనాలోచిత విధానంతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం కాంగ్రెస్ కు అలవాటేనని ఆరోపించారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మతచిచ్చు రాజేసేందుకు బీజం వేసిందని కిషన్​రెడ్డి మండిపడ్డారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-03-29T02:28:18Z dg43tfdfdgfd