జర్నలిస్టులు ఆ దేశాలను విడిచి ఎందుకు వెళ్లాల్సి వస్తోంది?

బలవంతంగా స్వదేశాలను విడిచి వెళ్లి, ఇతర దేశాల్లో పనిచేస్తున్న బీబీసీ వరల్డ్ సర్వీస్ జర్నలిస్టుల సంఖ్య 2020 నుంచి దాదాపు రెండింతలు పెరిగి 310కి చేరుకుందని ఒక అంచనా.

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా మొదటిసారిగా విడుదల చేసిన ఈ గణాంకాలు రష్యా, అఫ్గానిస్తాన్, ఇథియోపియాలలో మీడియా అణచివేతను ప్రతిబింబిస్తున్నాయి.

ఇరాన్‌తో సహా ఇతర దేశాల జర్నలిస్టులు దశాబ్దానికి పైగా విదేశాల్లో నివసిస్తున్నారు. చాలామంది జైలు శిక్షలు, మరణ బెదిరింపులు, వేధింపులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎదుర్కొంటున్నారు.

"జర్నలిస్టులు రిపోర్టింగ్‌ను కొనసాగించాలంటే, వారు ఇళ్ల నుంచి బలవంతంగా బయటకు వెళ్లడమే ఏకైక మార్గం" అని బీబీసీ వరల్డ్ సర్వీస్ డైరెక్టర్ లిలియన్ లాండర్ అన్నారు.

"దేశం విడిచి వెళ్తున్న జర్నలిస్టుల సంఖ్య పెరుగుతుండటమనేది పత్రికా స్వేచ్ఛ విషయంలో తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్న అంశం" అని ఆమె చెప్పారు.

2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్‌‌ను తాలిబాన్ అధీనంలోకి తీసుకున్న తర్వాత, బీబీసీ తన బృందంలో చాలామందిని దేశం నుంచి బయటకు తీసుకొచ్చింది.

మహిళా సిబ్బంది అక్కడ పని చేయడానికి తాలిబన్లు అనుమతించలేదు, పురుష జర్నలిస్టులు కూడా బెదిరింపులు ఎదుర్కొన్నారు.

2022లో యుక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడుల తర్వాత, రష్యా కొత్త సెన్సార్‌షిప్ చట్టాన్ని ప్రవేశపెట్టింది, అంటే యుద్ధాన్ని విమర్శించే ఎవరినైనా ప్రాసిక్యూట్ చేయవచ్చు.

"నేను యుద్ధాన్ని యుద్ధమనే పిలుస్తున్నాను, దాని కారణంగా నన్ను సులభంగా జైలులో పెట్టవచ్చు" అని బీబీసీ రష్యన్ ప్రతినిధి నినా నజరోవా చెప్పారు.

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో నినా సహోద్యోగి, బీబీసీ రష్యన్ కరస్పాండెంట్ ఇల్యా బరాబనోవ్‌ను "విదేశీ ఏజెంట్"గా చిత్రీకరించారు.

ఆయనపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, యుద్ధాన్ని వ్యతిరేకించడం వంటి అభియోగాలు మోపారు. ఇల్యాతో పాటు బీబీసీ కూడా సదరు ఆరోపణలను తిరస్కరించింది, కోర్టులో ఈ కేసు నడుస్తోంది.

ఆ దేశాలలో మీడియాపై నియంత్రణ..

మియన్మార్, ఇథియోపియాలోని జర్నలిస్టులపై కూడా ఒత్తిడిని పెంచారు, దీనివల్ల వారు స్వేచ్ఛగా రిపోర్టు చేయలేకపోతున్నారు.

గత మూడేళ్లలో ఆర్థిక, చట్టపరమైన సహాయాన్ని అందుకునే బహిష్కృత జర్నలిస్టుల సంఖ్య 225 శాతం పెరిగిందని ప్రొటెక్ట్ జర్నలిస్ట్‌ల కమిటీకి చెందిన జోడీ గిన్స్ బర్గ్ చెప్పారు.

"జైలులో రికార్డు స్థాయిలో జర్నలిస్టుల సంఖ్య ఉంది, జర్నలిస్టుల హత్యలు 2015 నుంచి ఎన్నడూ లేనంతగా పెరిగాయి" అని ఆమె తెలిపారు.

రష్యా, ఇరాన్, సౌదీ అరేబియాలలో వారి దేశాల లోపల, వెలుపల కథనాలపై నియంత్రణ పెరుగుతుండటం నిరాశకు గురిచేస్తోందని ఆమె చెప్పారు.

2022లో నీనా నజరోవా తన భర్త, 16 నెలల కొడుకుతో కలిసి రష్యాను విడిచి వెళ్లారు.

తల్లి చనిపోయినా వెళ్లలేక..

"నేను ఎప్పుడూ నా వెనకాలే చూస్తుంటాను" అని బీబీసీ పర్షియన్ ప్రతినిధి జియర్ గోల్ చెప్పారు.

ఆయన, ఇపుడు ఒక గదిలోకి వెళితే, తప్పించుకునే మార్గం కోసం వెతుకుతానని చెబుతున్నారు జియర్.

"నా ఇంట్లో చాలా సెక్యూరిటీ కెమెరాలు ఉన్నాయి. నా కూతురిని స్కూల్‌ని మార్పించడం మంచిదని నన్ను హెచ్చరించారు’’ అని జియర్ అన్నారు.

జియర్ 2007 నుంచి ఇరాన్‌కు వెళ్లలేదు. ఆయన తల్లి చనిపోయినా, అంత్యక్రియలకూ వెళ్లలేకపోయారు. ఆమె సమాధిని సందర్శించడానికి మాత్రం సరిహద్దును దాటగలిగారు.

నాలుగేళ్ల క్రితమే తన భార్య క్యాన్సర్‌తో చనిపోవడంతో జియర్ మరింత జాగ్రత్తతో ఉంటున్నారు.

"నాకేదైనా జరిగితే, నా కూతురి పరిస్థితి ఏంటి? అది నిజంగా నా మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది" అని ఆయన చెప్పారు.

ఇరాన్‌లో కఠినమైన ఆంక్షలున్నాయని, వారు ఒంటరిగా ఉంటున్నందున అంతర్జాతీయ సమాజం వారి గురించి ఏమి ఆలోచిస్తుందో వారు పట్టించుకోబోరని జియర్ అభిప్రాయపడ్డారు.

'పర్షియన్ సిబ్బందికి ముప్పు'

స్వతంత్ర బ్రాడ్‌కాస్టర్ అయిన ఒక ఇరాన్ ఇంటర్నేషనల్ ప్రెజెంటర్ మార్చిలో లండన్‌లోని ఇంటి వెలుపల ఉండగా కాలుపై దుండగులు కత్తి వేటు వేశారు.

యూకేలో నివసిస్తున్న బీబీసీ పర్షియన్ సిబ్బందికి ముప్పు పెరుగుతోందని ఇటీవల బ్రిటిష్ ఉగ్రవాద నిరోధక పోలీసులు హెచ్చరించారు.

పది మంది బీబీసీ పర్షియన్ సిబ్బందిపై ఒక సంవత్సరం జైలు శిక్ష విధించినట్లు ఇటీవలె తెలుసుకున్నారు. ఇరాన్ న్యాయవ్యవస్థ నుంచి సమాచారాన్ని హ్యాకర్లు లీక్ చేసిన తర్వాత ఈ విషయం వారికి తెలిసింది.

గతంలో బీబీసీ పర్షియన్ సిబ్బందిపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ హింస, ద్వేషపూరిత ప్రసంగం, మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు చేసింది.

ప్రభుత్వం తన పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించడానికి నిరాకరిస్తే నిరాశ్రయుడిగా మారతానేమోనని ఆఫ్రికాలోని ఒక వరల్డ్ సర్వీస్ జర్నలిస్ట్ అంటున్నారు. అక్కడి నాయకులపై ఆ జర్నలిస్టు భయాందోళనలు వ్యక్తంచేశారు.

తన ప్రవాస జీవితం అపరాధ భావనతో నిండి ఉందని బీబీసీ పాష్టోకు చెందిన షాజియా హయా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

అఫ్గానిస్తాన్‌ను 2022లో తాలిబాన్ అధీనంలోకి తీసుకోవడంతో ఆమె ఒంటరిగా యూకేకు వెళ్లాల్సి వచ్చింది. షాజియా తల్లిదండ్రులు, సోదరుడు కాబూల్‌లోనే ఉండిపోయారు.

"నేను రాత్రి 2 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాను, ఎందుకో నాకు తెలియదు కానీ నేను నా తమ్ముడిని కౌగిలించుకోలేకపోయాను. నేను చింతిస్తున్నాను" అని షాజియా చెప్పారు.

"నేను ఇక్కడ స్వేచ్ఛగా ఉన్నాను, కానీ వారు ఒక రకమైన జైలులో ఉన్నారు" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-05-03T07:32:51Z dg43tfdfdgfd