టిక్కెట్ నిరాకరించిన పార్టీ.. ఆత్మహత్యకు పాల్పడిన ఎంపీ

సార్వత్రిక ఎన్నికల ముందు తమిళనాడు (Tamil Nadu)లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. టిక్కెట్ రాలేదని మనస్తాపానికి గురైన ఈరోడ్‌ ఎంపీ, ఎండీఎంకే నేత అవినాశ్ గణేశమూర్తి (77) నాలుగు రోజుల కిందట ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన కోయంబత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి అయిన ఎండీఎంకే పార్టీకి గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈరోడ్‌ స్థానం దక్కింది. అక్కడి నుంచి గణేశమూర్తి డీఎంకే గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు. అయితే, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో సర్దుబాట్లలో భాగంగా ఎండీఎంకేకు తిరుచ్చి కేటాయించారు.

అక్కడి నుంచి వైగో కుమారుడు దురైవైగోను ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో గణేశమూర్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మార్చి 24న అకస్మాత్తుగా ఎంపీ అస్వస్థతకు గురవడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన పురుగుల మందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ తర్వాత పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి గురువారం ఉదయం విషమించడంతో కన్నుమూసినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై పోలీసులు ఆత్మహత్య కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన అవినాశ్ గణేశ్‌మూర్తి.. 1993లో ఎండీఎంకే ఆవిర్బావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. 1998 ఎన్నికల్లో తొలిసారిగా పళని స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009 ఎన్నికల్లో ఈరోడ్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి దాదాపు 2 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో మరోసారి ఘన విజయం సాధించారు. 2016లో పార్టీ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు.

డీఎంకే కూటమిలో భాగమైన ఎండీఎంకే.. ఇరవై ఏళ్ల తర్వాత తిరుచ్చి పార్లమెంటరీ నియోజకవర్గంలో మళ్లీ అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. డీఎంకే ఈ సెగ్మెంట్‌ను ఎండీఎంకెకు అప్పగించాలనే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా అంచనాలు నెలకొన్నాయి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T05:04:57Z dg43tfdfdgfd