టీచర్ ఉద్యోగాల కుంభకోణంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ్ బెంగాల్‌లో జరిగిన ఉపాధ్యాయ ఉద్యోగాల కుంభకోణంపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. 2016లో జరిగిన 25 వేల ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను కలకత్తా హైకోర్టు రద్దుచేయడంతో మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. సూపర్‌న్యూమరీ పోస్టులను సృష్టించి, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి నియామకాలు ఎందుకు చేపట్టారని బెంగాల్ సర్కారును ప్రశ్నించారు.

బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది నీరశ్ కిషన్ కౌల్.. హైకోర్టు వెలువరించి ఇలాంటి ఉత్తర్వులను కొనసాగించవచ్చా? అని అన్నారు. ‘25,000 నియామకాలన్నీ చట్టవిరుద్ధమని సీబీఐ కూడా చెప్పలేదు.. తీర్పు వల్ల ఉపాధ్యాయ-విద్యార్ధి నిష్పత్తి దారుణంగా పడిపోతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

ఉద్యోగ నియామక ప్రక్రియను రద్దు చేసే అధికారం హైకోర్టుకు లేదని, ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని పశ్చిమ్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ తరఫున హాజరైన మరో సీనియర్ లాయర్ జైదీప్ గుప్తా వాదించారు. ఈ సమయంలో ఓఎంఆర్‌ షీట్లు, జవాబు పత్రాల స్కాన్‌ కాపీలు ధ్వంసమయ్యాయా? సీజేఏ ప్రశ్నించగా.. ఆయన అవునని చెప్పారు. ‘అటువంటి సున్నితమైన అంశానికి’ ఎందుకు టెండర్ జారీ చేయలేదని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.

ఓఎంఆర్ షీట్లు, జవాబుపత్రాల డిజిటల్ కాపీలను భద్రపరచడం కమిషన్ విధి అని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రక్రియను ఓ ఔట్‌సోర్సింగ్ సంస్థకు అప్పగించినట్టు చెప్పారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన సీజేఐ ‘ఎక్కడా? సీబీఐ గుర్తించలేదు.. ఔట్‌సోర్సింగ్ సంస్థకు అప్పగిస్తే. భద్రతాపరమైన ఉల్లంఘన జరుగుతుందా? కేవలం స్కానింగ్ కోసం మాత్రమే అప్పగించారు.. కానీ మీరు వారికి మొత్తం డేటాను అందజేశారు.. ప్రజల డేటాను నిర్వహించాల్సిన బాధ్యత మీపై ఉంది.’ అని పేర్కొన్నారు.

ఆర్టీఐ దరఖాస్తుదారులకు తమ వద్ద డేటా గురించి కమిషన్ తప్పుడు సమాచారం ఇచ్చిందా? ‘మీపద్ద ఎలాంటి డేటా లేదా?’ అని సీజే నిలదీయగా..‘బహుశా’ అని లాయర్ బదులిచ్చారు. హైకోర్టు ఆదేశాలు న్యాయమైనవేనా? అన్న న్యాయవాది వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ‘ఇది వ్యవస్థాగత మోసం. నేడు ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువగా ఉన్నాయి.. ఈ నియామకాలను కూడా భ్రష్టుపట్టిస్తే వ్యవస్థలో ఏమి మిగిలి ఉంటుంది? ప్రజలు విశ్వాసం కోల్పోతారు.. మీరు దీన్ని ఎలా చూస్తారు?’ అని చీఫ్ జస్టిస్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T10:29:48Z dg43tfdfdgfd