‘డియర్ మిస్ పారికా... మీ రహస్య సమాచారం నా దగ్గరుంది...’

ఫిన్లాండ్ సంప్రదాయ ఆవిరి స్నానం చేసి సేద తీరుతున్న సమయంలో టియానా ఫోన్‌కు ఒక మెయిల్ వచ్చింది.

ఆ మెయిల్ ఎవరు పంపించారో ఆమెకు తెలియదు.

కానీ అందులో ఆమె పేరు, సోషల్ సెక్యూరిటీ నెంబర్, ఇతర వ్యక్తిగత సమాచారం ఉంది.

‘‘ఆ మెయిల్ చూసిన తర్వాత షాక్‌కు గురయ్యాను’’ అని టియానా చెప్పారు.

‘‘డియర్ మిస్ పారికా’’ అంటూ ఆ ఈ మెయిల్ మొదలైంది.

ఆమె చికిత్స తీసుకుంటున్న సైకోథెరపీ కేంద్రం నుంచి ఆమె వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు అందులో రాశారు.

తాను ఆమెను వ్యక్తిగతంగా ఎందుకు సంప్రదించవలసి వచ్చిందో ఆ మెయిల్ రాసిన వ్యక్తి వివరించారు.

రోగుల సమాచారం చోరీ అయిందన్న నిజాన్ని ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆ మెయిల్ పంపిన వ్యక్తి రాశారు.

రహస్య సమాచారం ఆ వ్యక్తి చేతికి..

టియానాకు సంబంధించిన రికార్డులను రెండేళ్ళ నుంచి థెరపిస్ట్ జాగ్రత్తగా ఉంచినా , వాటిల్లోని డజన్ల కొద్దీ సెషన్ల రహస్య సమాచారమంతా గుర్తు తెలియని ఆ బ్లాక్‌మెయిలర్ చేతుల్లోకి వెళ్లింది.

24 గంటల్లోగా డబ్బు చెల్లించకపోతే, ఆ మొత్తం సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పెడతానని బ్లాక్‌మెయిల్ చేశారు.

‘‘ఆ హెచ్చరిక నాకు ఊపిరాడకుండా చేసింది. నా వ్యక్తిగత జీవితాన్ని ఎవరో దొంగలించినట్టు అనిపించింది. నా రోగం ద్వారా వారు డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు’’ అని టియానా అన్నారు.

బ్లాక్‌మెయిలర్ చేతిలో పడిన సమాచారం తన ఒక్కదానిదే కాదని ఆ తర్వాత టియానా గుర్తించారు.

చికిత్స తీసుకుంటున్న 33 వేల మంది రోగుల రికార్డులు దొంగతనానికి గురైనట్లు తెలిసింది. వేలమంది ఈ వేధింపులకు గురయ్యారు.

ఫిన్లాండ్‌లోనే బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పిల్లలతో పాటు ఎంతోమంది రహస్య సమాచారం ఉన్న వస్తామో సైకోథెరపీ డేటాబేస్ రికార్డులు దొంగతనానికి గురయ్యాయి.

ఈ రికార్డులలో వివాహేతర సంబంధాలతో పాటు రోగులు అంగీకరించిన నేరాల వరకు సంభాషణలు ఉన్నాయి. ఇప్పడీ విషయాలన్నీ నిందితుడు బేరమాడేందుకు సాధనంగా మారాయి.

ఫిన్లాండ్‌‌ సైబర్ సెక్యూరిటీ సంస్థ విత్ సెక్యూర్‌కు చెందిన మిక్కో హిప్పోనెన్ ఈ హ్యాకింగ్‌పై పరిశోధన చేస్తున్నారు.

ఈ దాడి దేశం మొత్తాన్ని షాక్‌కు గురి చేసింది. రోజుల తరబడి ఈ ఘటనే హెడ్‌లైన్లలో నిలిచిందని చెప్పారు.

‘‘ఇంత పెద్దఎత్తున హ్యాకింగ్ జరగడం ఫిన్లాండ్‌కు అతిపెద్ద సంక్షోభం. ఎంతో మంది ఇబ్బంది పడ్డారని ప్రతి ఒక్కరికి తెలుసు’’ అని చెప్పారు మిక్కో హిప్పోనెస్.

‘ర్యాన్సమ్-మాన్’పేరుతో...

కరోనా మహమ్మారి సమయంలో 2020లో ఇదంతా జరిగింది.

సైబర్ సెక్యూరిటీ ప్రపంచాన్ని ఇది దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఈ మెయిల్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది.

జెన్నీ రైస్కియో ఒక న్యాయవాది. ఆమె 2,600 మంది బాధితులకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

తమ వ్యక్తిగత సమాచారం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాక కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల బంధువుల్లో కొందరు తమ కంపెనీని సంప్రదించారని ఆమె చెప్పారు.

ఈ బ్లాక్‌మెయిలర్‌ను ‘ర్యాన్సమ్ -మాన్’గా గుర్తించారు. బాధితులందరూ 24 గంటల్లోగా 200 యూరోలు చెల్లించాలని అతను డిమాండ్ చేశారు. సమయానికి ఈ డబ్బు చెల్లించకపోతే ఆ మొత్తాన్ని 500 యూరోలకు పెంచేవారు.

దాదాపు 20 మంది బాధితులు డబ్బు చెల్లించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. తమ సమాచారం మొత్తం ఆన్‌లైన్‌లో ఉందని వాళ్లకు తెలిసింది.

ఈ ‘రాన్సమ్ -మాన్’ పొరపాటున మొత్తం సమాచారాన్ని డార్క్‌వెబ్‌సైట్‌లో పెట్టేశాడు. ఇప్పటికీ ఈ సమాచారం అక్కడ ఉంది.

హ్యాకింగ్ సంగతి తేల్చేందుకు, పోలీసులకు సాయపడేందుకు మిక్కో, ఆయన బృందం ప్రయత్నించారు.

ఫిన్లాండ్‌ పోలీసు చరిత్రలోనే అతిపెద్దదైన ఈ హ్యాకింగ్ ఘటనకు ఒక యువకుడి అరెస్ట్‌తో ముగిసింది.

ఈ టీనేజీ సైబర్ మాయగాడు.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎలా అయ్యాడు?

యూరప్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకరు జూలియస్ కివిమాకి. తను ఒక హ్యాకర్.

33 వేల మంది రోగుల రికార్డులను దొంగిలించి, ఆ తర్వాత వారిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు జూలియస్‌పై ఆరోపణలు ఉన్నాయి.

జూలియస్ కివిమాకి 13 ఏళ్ళ వయసున్నప్పుడే టీనేజీ హ్యాకింగ్ నెట్‌వర్క్‌లో కీలకంగా ఎదిగాడు. పదకొండు ఏళ్లపాటు సైబర్ నేరాలు చేశారు. చివరికి జూలియస్ అరెస్ట్ అయ్యారు.

కివిమాకీ 2014లో స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను తాను ర్యాన్ అని పిలుచుకున్నాడు.

ఓ టీనేజీ హ్యాకర్‌గా తనను తాను జికీల్‌గా పిలుచుకునే కివిమాకి తన గురించి బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు.

అతను టీనేజర్‌గా ఉన్నప్పుడు, హ్యాకింగ్ మొదలుపెట్టి, జనాన్ని బెదిరించి వీలైనంత డబ్బులు డిమాండ్ చేసేవాడు. తన గురించి అదేపనిగా గొప్పలు చెప్పుకునేవాడు.

దీంతోపాటు ‘లిజార్డ్ స్వ్కాడ్’, ‘హాక్ ప్లానెట్’ లాంటి హాకింగ్ గ్రూపులలో అతను కీలక సభ్యుడు. 2010లో టీన్ హ్యాకింగ్ కాలంలో అతను గందరగోళం సృష్టించాడు.

కివిమాకి 17వ ఏట అరెస్ట్ అయ్యేవరకు డజన్ల కొద్దీ హైప్రొఫైల్ కేసుల హ్యాకింగ్‌లో కీలకంగా వ్యవహరించాడు. 2014లో 50,700 హ్యాకింగ్ నేరాలలో అతనిని అపరాధిగా గుర్తించారు.

ఈ గందరగోళ సమయంలో ఇతర సహచరులలానే కివిమాకీని కూడా పోలీసులు ఆపడానికి ప్రయత్నించలేదు. తాను అరెస్ట్ అయి, జైలు శిక్ష పడటానికి ముందు టీనేజీ హ్యాకింగ్ గ్యాంగ్‌లు అప్పటిదాకా చేయని ఓ సాహసోపేత దాడికి కివిమాకి పాల్పడ్డాడు.

జికీల్, లిజార్డ్ బృందం కలిసి క్రిస్మస్ రోజున అతిపెద్ద గేమింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌ను హ్యాక్ చేశారు.

దీనివల్ల ప్లేస్టేషన్ నెట్‌వర్క్, ఎక్స్‌బాక్స్ లైవ్ పనిచేయడం ఆగిపోయింది. లక్షలాదిమంది వినియోగదారులు గేమ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోలేకపోయారు. తమ మిత్రులతో ఆన్‌లైన్‌లో ఆటలు ఆడలేకపోయారు. కొత్తవారు తమ పేర్లను నమోదు చేసుకోలేకపోయారు.

లిజార్డ్ బృందం తమ హ్యాకింగ్ గురించి ట్విటర్‌లో తమ లోగోను ప్రదర్శిస్తూ గొప్పలు చెప్పుకుంది.

ప్రపంచ మీడియా దృష్టి అంతా తమపై పడటంతో కివిమాకి సంతోషపడ్డాడు. స్కై న్యూస్ కోసం ఓ ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా అంగీకరించాడు. ఆ సమయంలో ఈ దాడులకు సంబంధించి ఆయన ఎటువంటి పశ్చాత్తపం చూపలేదు.

కివిమాకి ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుని, తన నైపుణ్యాలను ఆన్‌లైన్‌లో ప్రదర్శించడానికి ఇష్టపడతాడని జికీల్ లిజార్డ్ బృందానికి చెందిన మరో సభ్యుడు బీబీసీతో చెప్పారు.

‘‘తను చేసే పనిని అతను ఇష్టపడతాడు. పరిణామాలను పట్టించుకోడు. హ్యాకింగ్ ఎటాక్‌లో అందరికంటే ముందుంటాడు’’ అని తెలిపారు.

‘‘తనపైన అందరి కళ్ళు ఉన్నప్పటికీ , అతను బాంబు బెదిరింపు కాల్స్ చేసేవాడు. తన ఒరిజినల్ వాయిస్‌తోనే సీరియస్‌గా ఆటపట్టించే ఫోన్ కాల్స్ చేసేవాడు’’ అని ర్యాన్ చెప్పాడు.

తన జైలు శిక్ష తరువాత కివిమాకి పేరు చిన్న చిన్న హ్యాకింగ్‌లలో తప్ప చాలా ఏళ్లపాటు వస్తామో సైకోథెరపీ అటాక్ జరిపే వరకూ ఆయన పేరు పెద్దగా వినపడలేదు.

కివిమాకీని పట్టించిన ఒక ఫోన్ కాల్..

యూరప్‌లోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన కివిమాకీకి సంబంధించిన ఆధారాలు సేకరించి అతనికి ఇంటర్ పోల్ రెడ్ నోటీసు జారీచేసేందుకు ఫిన్లాండ్ పోలీసులకు రెండేళ్ళు పట్టింది. ఆ తర్వాత పాతికేళ్ళ వయసున్న ఈ నేరగాడు ఆచూకీ పోలీసులకు తెలియలేదు.

అయితే, పారిస్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో గొడవ జరుగుతోందంటూ ఫోన్ రావడంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు కివిమాకీ ఆచూకీ తెలిసింది.

కివిమాకీ తప్పుడు పత్రాలతో, నకిలీ గుర్తింపుతో అక్కడ ఉన్నట్టు తెలుసుకున్నారు.

అతన్ని ఫిన్లాండ్ పోలీసులకు అప్పచెప్పారు.

డిటెక్టివ్ చీఫ్ సూపరింటెండెంట్ మార్కో లిపోనెన్ ఈ కేసుకు నేతృత్వం వహిస్తున్నారు.

‘‘ఒకదశలో ఈ కేసులో 200 మందికి పైగా పోలీసులు పనిచేశారు. చాలా తీవ్రమైన విచారణ ఇది. అనేక మంది బాధితుల వాంగ్మూలాలు, కథనాల ద్వారా విచారణ సాగించాం’’ అని చెప్పారు.

కివిమాకి విచారణ స్థానిక మీడియాకు ఓ నిత్యవార్తగా మారింది. అంతర్జాతీయ మీడియా కూడా అక్కడకు చేరింది.

కివిమాకి విచారణ జరిగేటప్పుడు నేను కోర్టులోనే ఉన్నాను. అతను తన అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూ, నిశ్శబ్దంగా ఉన్న కోర్టు గదిలో జోకులు వేశాడని లెపోనెన్ చెప్పారు.

కానీ అతనికి వ్యతిరేకంగా అనేక సాక్ష్యాలు ఉన్నాయి.

కివిమాకి తస్కరించిన సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసిన సర్వర్‌తో అతని బ్యాంకు ఖాతా అనుసంధానమై ఉండటం కీలకమైన విషయమని లెపోనెన్ తెలిపారు.

కివిమాకి ఆన్‌లైన్‌లో మారుపేరుతో పోస్టు చేసిన ఓ ఫోటో నుంచి ఆధునిక ఫోరెన్సిక్ సాంకేతికతతో కివిమాకి వేలిముద్రలను అధికారులు సేకరించారు.

ఈ వేలిముద్రల ద్వారా ఆ చిత్రం కివిమాకీదేనని పోలీసులు ఆధారాలు సమర్పించారు.

‘‘ఆన్‌లైన్‌ ఫోరమ్‌లో పోస్టు చేసిన అజ్ఞాత వ్యక్తి కివిమాకీనే అని మేం నిరూపించగలిగాం. మీకు తెలిసిన ప్రతి విషయాన్ని మీరు ఉపయోగించాలి, మీకు తెలియని దానిని మీరు ప్రయత్నించాలని ఈ సంఘటన చెబుతోంది’’ అని లెపోనెన్ తెలిపారు.

చిట్టచివరకు న్యాయమూర్తి కివిమాకీని దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చారు.

కోర్టు ప్రకారం కివిమాకి 30వేలకు పైగా కేసులలో దోషి. సమాచార చౌర్యానికి పాల్పడటం, బ్లాక్‌మెయిల్ చేశారని కోర్టు పేర్కొంది. మరో 20,475 మందిని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించారని తెలిపింది. అతనికి 6 ఏళ్ళ 3 నెలల జైలు శిక్ష పడింది.

అయితే అప్పటికే జైలులో గడిపిన కాలం, ఫిన్లాండ్ న్యాయ వ్యవస్థ కారణంగా ఆయన ఈ మొత్తంలో సగం శిక్షమాత్రమే అనుభవించే అవకాశం ఉంది.

అయితే టియానాలాంటి బాధితులకు మాత్రం ఈ శిక్ష సరిపోదనిపిస్తోంది.

‘‘అనేక మంది, అనేక విధాలుగా బాధపడ్డారు. 33వేల మంది అంటే చాలా ఎక్కువ మంది బాధితులు. ఈ హ్యాకింగ్ మా ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. కొంతమంది ఆర్థిక కుంభకోణాలకు లక్ష్యాలుగా మారడమే కాక, వారి సమాచారాన్ని కూడా ఉపయోగించారు’’ అని టియానా చెప్పారు.

ఈ కేసు నుంచి తమకు ఏమైనా పరిహారం అందుతుందేమోనని టియానా, ఇతర బాధితులు వేచి చూస్తున్నారు.

కివిమాకి కోర్టు బయట ఒక గ్రూపుతో రాజీకి సూత్రప్రాయంగా అంగీకరించారు. మిగతా బాధితులు అతనికి, వస్తామో క్లినిక్‌కు వ్యతిరకంగా సివిల్ కేసులు వేసే ఆలోచనలో ఉన్నారు.

రోగుల సమాచారాన్ని పరిరక్షించడంలో విఫలమైనందుకు సైకోథెరపీ కంపెనీ మూతపడింది. దాని వ్యవస్థాపకుడికి విధించిన శిక్షను ప్రస్తుతం నిలిపివేశారు.

బిట్‌కాయిన్ రూపంలో ఎంత డబ్బు తన వద్ద ఉందనే విషయాన్ని పోలీసులకు కివిమాకి చెప్పలేదు. తన డిజిటల్ వాలెట్ వివరాలు మరిచిపోయినట్టు చెపుతున్నారు.

ప్రభుత్వం ఈ కేసులో జోక్యం చేసుకోవచ్చని, కానీ ప్రతి బాధితుడికి వ్యక్తిగతంగా ఎంత నష్టం జరిగిందో తెలుసుకోవడానికి సంవత్సరాల సమయం పట్టవచ్చని రైస్కియో చెప్పారు.

భవిష్యత్తులో ఇలాంటి సామూహిక హ్యాకింగ్ కేసులను ఎదుర్కోవడానికి వీలుగా చట్టాన్ని మార్చాలనే డిమాండ్ ఉంది.

‘‘ఫిన్లాండ్‌లో చరిత్రలోనే ఇది పెద్ద విషయం. ఈ హ్యాకింగ్ ఇలాంటి కేసులకు సిద్ధంగా ఉండాలని మాకు చూపించింది. ఇది ఇక్కడితో ముగిసిపోదు. కచ్చితంగా మార్పు వస్తుందని భావిస్తున్నాను’’ అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2024-05-07T02:56:37Z dg43tfdfdgfd