తెలంగాణలో గాలి వాన బీభత్సం

తెలంగాణలో గాలి వాన బీభత్సం

  • ఉరుములు, మెరుపులతో వడగండ్లు  వర్షం
  • ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో చల్లబడ్డ వాతావరణం
  •  ఈదురుగాలులకు నేలకూలిన చెట్లు.. ఎగిరిపడ్డ ఇండ్ల పైకప్పులు
  • ఫస్ట్​ టైమ్ 47 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
    

వెలుగు, నెట్ వర్క్: రాష్ట్రంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. దీంతో మండుతున్న ఎండల నుంచి పలు జిల్లాలకు కాస్త రిలీఫ్ దొరికినట్టయింది. ఆదివారం సాయంత్రం ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో కరెంట్​ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలుల కారణంగా ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. మామిడి పండ్లు నేల రాలాయి. నల్గొండలోని పానగల్లు రోడ్డు, శ్రీనగర్ కాలనీతో పాటు వివిధ ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. 

కొన్ని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. సూర్యాపేట, జనగామ జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల ఇండ్ల పై కప్పులు ఎగిరిపడ్డాయి. గుండాల మండలం దామరతోగు గ్రామ పంచాయతీలో చిన్న వెంకటయ్య, కల్తీ భిక్షం, ఎర్రయ్యకు చెందిన పశువులు పిడుగుపాటుకు చనిపోయాయి. 

మణగూరు– గుండాల రోడ్డుపై చెట్లు పడటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇల్లెందు మండలంలో పలుచోట్ల వడగండ్ల వాన పడింది. మహబూబాబాద్ జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గార్ల మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద రేకులు ఎగిరిపోగా.. గోడ కూలిపోయింది. నరసింహులపేట మండలం బంజర గ్రామంలో మాతంగి వీరన్నకు చెందిన ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. 

జగిత్యాల జిల్లా వెల్గటూరులో 47.1 డిగ్రీలు​

రాష్ట్రంలో ఫస్ట్ టైమ్ 47 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. జగిత్యాల జిల్లా వెల్గటూరులో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లా గోధూరులో 46.8, అల్లీపూర్​లో 46.7, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.7, నిర్మల్ జిల్లా బుట్టాపూర్​లో 46.5, మంచిర్యాల జిల్లా హాజీపూర్​లో 46.3, మంచిర్యాల జిల్లా జన్నారంలో 46.3, నిజామాబాద్​లో 46.2, మంచిర్యాల జిల్లా వెల్గనూరులో 46.2, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వంకులంలో 46.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

నల్గొండ జిల్లా నాంపల్లిలో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. మొత్తం ఏడు జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 9 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా.. మిగతా జిల్లాల్లో 43 నుంచి 45 మధ్య రికార్డయ్యాయి. సోమవారం పలు జిల్లాల్లో వడగాలులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం కూడా వానలు పడే చాన్స్ ఉన్నట్టు వివరించింది. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్​నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భద్రాద్రి, ఖమ్మం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్​గిరి, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్​కర్నూల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడుతాయని పేర్కొంది. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది.

ఖమ్మం సిటీలో ఈదురుగాలుల బీభత్సం

ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఖమ్మం సిటీతో పాటు కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలయ పాలెం, కారేపల్లి మండలాల్లో పలుచోట్ల కరెంట్ స్తంభాలు పడిపోయాయి. దీంతో కరెంట్ సప్లై నిలిచిపోయింది. కూసుమంచి మండలం తుర్కగూడెంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఉన్న చెట్టుపై పిడుగుపడింది. ఖమ్మం నగరంలో పలుచోట్ల షాపుల ముందు వేసిన రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. 

కారేపల్లి మండలం పేరుపల్లికి చెందిన భద్రి, పెద్దకట్టుగూడెం గ్రామానికి చెందిన రాంబాబు గొర్రెలు మేపుకొని ఇంటికి వస్తుండగా వారి సమీపంలోనే పిడుగుపడింది. దీంతో ఇద్దరూ గాయపడ్డారు. యాదాద్రి జిల్లా గుండాల, మోత్కూరు, ఆత్మకూరు (ఎం) మండలాల్లో ఈదురుగాలుల కారణంగా మామిడి కాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. అత్యధికంగా నల్గొండ జిల్లా తిప్పర్తిలో 6.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-06T02:30:05Z dg43tfdfdgfd