తొలిదశలో 64 % పోలింగ్.. ఆ రాష్ట్రంలో అత్యధికంగా 80 శాతం నమోదు

దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు తొలిదశలో పోలింగ్ నిర్వహించారు. చెదురుమదురు ఘటనలను మినహా పోలింగ్‌ ప్రశాతంగా జరిగిందని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా 64 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ తెలిపింది. తమిళనాడులోని 39 సహా ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరం, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌లలో అన్ని లోక్‌సభ స్థానాలకు తొలి దశలోనే పోలింగ్‌ పూర్తయింది. ఇక, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ వినిపిస్తున్న తూర్పు నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల్లో ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. ఒక్కరు కూడా ఓటువేయకపోవడం గమనార్హం.

సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనుండగా.. వాటిలో తొలి దశే అతిపెద్దది. ఇక, 2019 లోక్‌సభ ఎన్నికల తొలి దశ (91 సీట్లు)లో నమోదైన 69.43% పోలింగ్‌తో పోల్చితే ఈసారి తక్కువగానే ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా త్రిపురలో 80.17 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకోగా.. అత్యల్పంగా బిహార్‌లో కేవలం 48.50 శాతం మంది ఓటేశారు. త్రిపుర తర్వాత పశ్చిమ్ బెంగాల్ 77.57 శాతం, మేఘాలయ 74.21 శాతం, పుదుచ్చేరి 73.50 శాతం, అసోం 72.10 శాతం, తమిళనాడు 72.09 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ భారత సార్వత్రిక ఎన్నికలే. ఎండలు మండిపోతున్నా.. కొన్నిచోట్ల కుండపోత వర్షం కురుస్తున్నా.. ఓటర్లు ఓపికగా క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూసి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. నవ దంపతులు పెళ్లి దుస్తుల్లో నేరుగా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటేయడం కొన్ని చోట్ల కనిపించింది. యువత ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. పూర్తిగా మహిళా సిబ్బందితో జమ్మూ కశ్మీర్‌లోని ఉధమ్‌పూర్‌ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన ‘పింక్‌ బూత్‌’లకు ఓటర్ల నుంచి విశేష స్పందన వచ్చింది. సాధారణ పోలింగ్‌ కేంద్రాలతో పోలిస్తే వాటికి మహిళా ఓటర్లు ఎక్కువగా తరలివచ్చారు.

లోక్‌సభతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌ (60 నియోజకవర్గాలు), సిక్కిం (32) అసెంబ్లీ ఎన్నికలకు కూడా తొలిదశలోనే పోలింగ్‌ ప్రక్రియ పూర్తయింది. అరుణాచల్‌లో 69.44%, సిక్కింలో 70.39% పోలింగ్‌ నమోదైంది. ఎండల కారణంగా వడదెబ్బకు తమిళనాడులో ముగ్గురు మృతిచెందారు. సేలం జిల్లాలో ఇద్దరు, తిరువళ్లూరు జిల్లాలో ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. వారు పోలింగ్‌ కేంద్రాల్లోనే వారు కుప్పకూలిపోయారు. గతేడాది జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్‌లోనూ కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. బాంబు దాడులు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-20T02:45:06Z dg43tfdfdgfd