నంద్యాలలో పీవీ నరసింహారావు భారీ విజయానికి బాటలు వేసిన కిడ్నాప్‌లెన్ని, తెర వెనుక జరిగిన దారుణాలేంటి?

‘‘నేను లాడ్జీలో దిగి కిటికీ తీసి చూడగానే, పంచెలు కట్టుకున్న కొందరు ఒక కాంగ్రెస్ నాయకుడి గెస్టు హౌసు దగ్గర ఏకే 47 తుపాకులను పట్టుకుని కాపలా కాయడం కనిపించింది. పీవీ గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తలు తుపాకులు పట్టుకున్నారని నేను పత్రికలో వార్త రాయగానే, నా భద్రత కోసం ఆ లాడ్జీ ఖాళీ చేసేయమని చెప్పారు.’’

‘‘నేను కలెక్టరును కలవడానికి వెళ్తుంటే అక్కడ చాలా బలంగా ఉన్న కొందరు వ్యక్తులు ఒక మధ్య వయస్కుడిని చితకబాదుతున్నారు. చూస్తున్న వారు ఎవరూ మాట్లాడలేదు. ఆయన్ను కొట్టి ఒక ట్రక్కులో వేసుకుని తీసుకుపోయారు. ఎవరా అని ఆరా తీస్తే నామినేషన్ వేయడానికి వచ్చిన ఇండిపెండెంటును కాంగ్రెస్ కార్యకర్తలు కొడుతున్నారు అని చెప్పారు.’’

ఇవి ఆనాడు ప్రత్యక్షంగా ఎన్నికల కవరేజీలో పాల్గొన్న కొందరు జర్నలిస్టుల అనుభవాలు.

పీవీ నరసింహా రావు ప్రధాని అయిన తరువాత నంద్యాల స్థానం నుంచి ఎంపీగా గెలవడం ఒక భారీ రికార్డు. అప్పట్లో అది గిన్నీస్ బుక్ వరకూ వెళ్లింది. ప్రత్యర్థులకు డిపాజిట్లు రాకపోవడమే కాదు, పీవీకి 89 శాతం ఓటింగ్ రావడం ఒక సంచలనం.

వాస్తవానికి అప్పుడు అసలు ఎన్నిక జరగకుండా పూర్తిగా ఏకగ్రీవం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. కానీ సాధ్యపడలేదు.

ఆ క్రమంలో కర్నూలులో అప్పటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పీవీకి వ్యతిరేకంగా ఎవరూ పోటీ చేయకుండా చూడటమే కాకుండా, ఆ ప్రయత్నం చేసిన వారిని బెదిరించి, కిడ్నాప్ చేసి, చావబాదారని నాటి ఎన్నికను దగ్గరగా పరిశీలించినవారు చెబుతారు.

కిడ్నాప్‌లు, తుపాకులు, బెదిరింపుల మధ్య జరిగిన ఎన్నికల్లో పీవీ భారీ మెజార్టీ సాధించడంతో, ఈ ఎన్నికల్లో అనుసరించిన అప్రజాస్వామిక పద్ధతుల విషయం మరుగున పడిపోయిందని వారు అన్నారు.

గ్రామ పంచాయితీలలో తప్ప పార్లమెంటు సీట్లలో ఏకగ్రీవం అనేది చాలా అరుదు. కానీ, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోక్‌సభ స్థానం ఏకగ్రీవం అయిన నేపథ్యంలో పీవీ అంశం చర్చకు వచ్చింది.

అప్పట్లో పీవీ ఎన్నిక చుట్టూ, తెలుగు జాతి వైభవం, కాంగ్రెస్ పార్టీ ప్రాభవం వంటి మాటలే వినిపించేవి.

ఆ వైభవం, ప్రాభవం వెనుక కనిపించని దుర్మార్గాలూ, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలూ జరిగాయని పలువురు పాత్రికేయులు, హక్కుల కార్యకర్తలు వ్యాఖ్యానించారు.

దీనిపై 1991 నవంబర్ 16 నాటి ‘ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’ పత్రికలో మానవ హక్కుల పోరాట నాయకుడు దివంగత కె.బాలగోపాల్ సుదీర్ఘ వ్యాసం రాశారు.

పీవీపై నామినేషన్ వేయాలనుకున్న ఎవరెవర్ని కాంగ్రెస్ నాయకులు ఎలా బెదిరించి, భయపెట్టి ఆ ఎన్నికల్లో పీవీకి అంత మెజార్టీ వచ్చేలా చేశారో, అదంతా మౌనంగా గమనిస్తూ, పరోక్షంగా ఈ ప్రక్రియకు పీవీ ఎలా మద్దతిచ్చారో వివరంగా రాశారాయన.

ఆయనే కాదు ఎందరో నామినేషన్ వేయాలనుకున్న వారు, పాత్రికేయులు ఈ విషయాన్ని రికార్డు చేశారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు కొందరు తమ అనుభవాలనూ పంచుకున్నారు.

‘‘అప్పట్లో పీవీ నరసింహారావు పోటీ చేస్తున్న ఎన్నికల్లో నేను కూడా పోటీ చేయడం కోసం ఆంధ్రా వెళ్లాను. మొదటి రోజే నంద్యాల ఎన్నికల అధికారికి నా నామినేషన్ సమర్పించాను. నాకు మద్దతివ్వడానికి నాతో పాటూ వచ్చిన వ్యక్తి, నేనిలా నామినేషన్ వేయడం కోసం వచ్చినట్టుగా ప్రత్యర్థులకు (కాంగ్రెస్ వారికి) చెప్పాడు. నామినేషన్ వేసి నేను బయటకు వచ్చానో లేదో నన్ను కొందరు జీపులో కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. నన్ను ఒక కొండ మీద మూడు రోజుల పాటూ ఉంచారు. నా దగ్గర ఉన్న డబ్బు, బంగారం అంతా తీసేసుకుని ఒకరిని నాకు కాపలా పెట్టారు. ఆ ఎన్నిక ఏకగ్రీవం చేయడానికి పీవీ నరసింహా రావు వర్గం వారు నన్ను కిడ్నాప్ చేశారు. కానీ అక్కడ ఒక బీజేపీ అభ్యర్థి కూడా పోటీ చేయడంతో, వాళ్లు తరువాత నా గురించి పెద్ద పట్టించుకోలేదు. ఆ బీజేపీ నాయకుడి నామినేషన్ హడావిడిలో నేను అదను చూసి తప్పించుకున్నాను. వెంటనే నంద్యాల పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాను. అప్పుడే నేను కిడ్నాప్ అయిన సంగతి బయటి ప్రపంచానికి తెలిసింది. అక్కడి పోలీసులు నాకొక గార్డును ఇచ్చి తమిళనాడు వరకూ తోడు పంపారు.’’ అని నంద్యాలలో పీవీ నరసింహా రావు మీద పోటీ చేయాలనుకున్న తమిళనాడుకు చెందిన పద్మరాజన్ అనే వ్యక్తి బీబీసీకి చెప్పారు.

పద్మరాజన్ తరచూ నామినేషన్లు వేసి ఓడిపోవడం అలవాటే. కానీ ఇలా నామినేషన్ వేయకుండా కిడ్నాప్ జరిగిన ఎన్నికను మాత్రం ఆయన మర్చిపోలేదు.

బెంగళూరుకు చెందిన సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస ప్రసాద్ ‘ఫస్ట్ పోస్ట్’ వెబ్‌సైట్‌కు రాసిన ఒక కథనంలో ఆ ఎన్నికల్లో తాను చూసిన అనుభవాలను వివరించారు.

‘‘ఆ ఎన్నికల కవరేజీ కోసం వెళ్లినప్పుడు అక్కడ బాంబులు, ఏకే 47 తుపాకులతో పాటూ ఆడవారికి చీరలు, మగవారికి పంచెల పంపిణీలు చేశారు. నేను దిగిన లాడ్జి నుంచి కిటికీ తీసి చూడగానే, పంచెలు కట్టుకున్న కొందరు, ఒక కాంగ్రెస్ నాయకుడి గెస్టు హౌసు దగ్గర ఏకే- 47 తుపాకులతో కాపలా కాయడం కనిపించింది. పీవీ గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తలు తుపాకులు పట్టుకున్నారని నేనూ, మరికొన్ని పత్రికలు వార్త రాయగానే, నా భద్రత కోసం ఆ లాడ్జి ఖాళీ చేసేయమని చెప్పారు’’ అని శ్రీనివాస ప్రసాద్ 2017లో రాసిన వ్యాసంలో వివరించారు.

‘‘వాస్తవానికి పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది కాబట్టి, అక్కడ పీవీ గెలుపు చాలా సులువు. అయినా కాంగ్రెస్ వారు రిస్క్ చేయదలచుకోలేదు. దేశంలోనే భారీ మెజార్టీతో గెలవాలనుకుంటున్నట్లు అక్కడి నాయకులు నాతో చెప్పారు. ఒకవైపు అక్కడ ఓటర్లకు తాయిలాలు పంచుతూనే, మరోవైపు కాంగ్రెస్‌కు ఓటు వేయరని అనుమానం ఉన్న వారిని చితకబాదారు’’ అని శ్రీనివాస ప్రసాద్ తన వ్యాసంలో రాశారు.

‘‘కలెక్టరును కలవడానికి వెళ్తుంటే అక్కడ కొందరు వ్యక్తులు ఒక మధ్య వయస్కుడిని చితకబాదుతున్నారు. చూస్తున్న వారు ఎవరూ మాట్లాడటం లేదు. ఆయన్ను కొట్టి ఒక ట్రక్కులో వేసుకుని తీసుకుపోయారు. ఎవరా అని ఆరా తీస్తే నామినేషన్ వేయడానికి వచ్చిన ఇండిపెండెంట్‌ అభ్యర్ధిని కాంగ్రెస్ కార్యకర్తుల కొడుతున్నారని చెప్పారు. ఆ గొడవంతా కిటికీ నుంచి మౌనంగా చూస్తున్న ఎన్నికల అధికారిని, దానిపై ఏమైనా చర్యలు తీసుకుంటారా అని అడిగితే, ఫిర్యాదు లేకుండా చర్యలు తీసుకోలేం అన్నారాయన’’ అని శ్రీనివాస ప్రసాద్ వివరించారు.

1991 నవంబరులో ‘ఇండియా టుడే’ మేగజైన్ కోసం ప్రముఖ పాత్రికేయులు అమర్‌నాథ్ కె.మీనన్ కూడా తన వార్తా కథనంలో వీటిని ప్రస్తావించారు.

చాలామంది స్వతంత్ర అభ్యర్థులను నామినేషన్‌దాకా రానివ్వలేదని, రాయలసీమ రైతు సంఘం నాయకుడు శీలం సంజీవ రెడ్డిని కూడా నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని అమర్‌నాథ్ ‘ఇండియా టుడే’లో రాశారు. చాలామందిని బెదిరించి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా చూడాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించినట్టు రాశారు.

అసలు పీవీ నంద్యాలలో ఎందుకు పోటీ చేశారు?

1991లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గంగుల ప్రతాపరెడ్డి గెలిచారు. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గెలిచింది.

అంతకుముందే ప్రచారంలో రాజీవ్ గాంధీ చనిపోయారు. దీంతో ఎన్నికల తరువాత పీవీ నరసింహా రావు ప్రధాని అయ్యారు. కానీ, ఆయన అప్పటికి ఎంపీ కాదు.

ప్రధాని అయిన వారు ఎంపీగా గెలవాలి. ఆయన కోసం గంగుల ప్రతాప రెడ్డి నంద్యాల స్థానం ఖాళీ చేశారు.

పీవీకి బాగా సన్నిహితుడు, కర్నూలుకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి నంద్యాల నుంచి పీవీని పోటీ చేయించడంలో కీలక పాత్ర పోషించారు. తనకు జనామోదం ఉందని చెప్పుకోవడం కోసమే ఎందుకోగానీ, పీవీ రాజ్యసభ నుంచి కాకుండా లోక్ సభ నుంచే పోటీ చేశారు.

‘‘తెలంగాణ నుంచి కూడా పీవీ పోటీ చేయవచ్చు కానీ, ఒకవేళ నక్సలైట్లు ఏవైనా బాంబులు పేల్చడం వంటివి జరిగితే అది అంతర్జాతీయ అంశంగా మారిపోతుంది (ప్రధాని పోటీ చేశారు కాబట్టి) అందుకే ఆయన తెలంగాణలో పోటీ చేయలేదు అంటారు. అలాగే అప్పుడు తెలంగాణలో తెలుగుదేశం కాస్త బలంగా ఉంది. దీంతో ఆయన నంద్యాల ఎంచుకుని అక్కడ తనకోసం రాజీనామా చేసిన గంగుల ప్రతాప రెడ్డికి స్వేచ్ఛ ఇచ్చారు.’’ అని సీనియర్ పాత్రికేయులు నాంచారయ్య బీబీసీతో అన్నారు.

కడప నుంచి కూడా పీవీ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఆయన నంద్యాలలో పోటీ చేశారు.

‘‘వాస్తవానికి పీవీకి సొంత జిల్లా కరీంనగర్ సహా ఎక్కడా సొంతంగా బలం లేదు. దీంతో తనను గెలిపించే బాధ్యత రాయలసీమ నాయకుల చేతుల్లో పెట్టారు. వారంతా పీవీని నంద్యాల నుంచి ఏకగ్రీవంగా పార్లమెంటుకు పంపాలని తీర్మానించారు’’ అని బాలగోపాల్ తన వ్యాసంలో రాశారు.

ఆ ఉప ఎన్నికలో పీవీ గెలిచారు. పీవీ నరసింహా రావుకు 6 లక్షల 86 వేల 241 ఓట్లు, అంటే పోల్ అయిన వాటిలో 89.48 శాతం ఓట్లు వచ్చాయి.

రెండవ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసిన బంగారు లక్ష్మణ్‌కు 6.56 శాతం అంటే 45 వేల 944 ఓట్లు వచ్చాయి.

ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన ఎం.సుబ్బారెడ్డికి 20,398 ఓట్లు రాగా, మోత్కుపల్లి నరసింహులుకు 2524 ఓట్లు, ఆర్.కృష్ణమూర్తికి 1684 ఓట్లు, ఐకె రెడ్డికి 1599 ఓట్లు, జీకే రెడ్డికి 1456 ఓట్లు వచ్చాయి.

ఓట్ల రికార్డుల వెనుక కిడ్నాపులు ఎన్నో…

ఈ ఘటనలపై మానవ హక్కుల కార్యకర్త బాలగోపాల్ స్వయంగా పలువురు స్వతంత్ర అభ్యర్థులతో మాట్లాడి సుదీర్ఘంగా ఆ విషయాలను రికార్డు చేశారు.

‘‘1991 అక్టోబరు 11 నుంచి 18 మధ్య నామినేషన్ల సమయంలో కర్నూలులో కాంగ్రెస్ నాయకులు చేసిన దౌర్జన్యాలు ఎన్నో. కాకపోతే తెలుగువాడు ప్రధాని అయ్యాడు కాబట్టి, ఆయనపై నామినేషన్ వేయాలనుకున్న వారి కిడ్నాప్‌లు, వారిపై దాడులు పట్టించుకోకూడదన్న వాతావరణం ఏర్పడింది. అప్పటి న్యాయశాఖ మంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి తన మేనల్లుడు కొత్తకోట ప్రకాశ్ రెడ్డికి ఈ నామినేన్లను అదుపు చేసే బాధ్యతలు అప్పగించారు. అంతే ఇక కర్నూలులో అప్పటి కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు’’ అని బాలగోపాల్ రాశారు.

బాలగోపాల్ ఈపీడబ్ల్యూలో రాసిన వివరాలలో, ‘‘అక్టోబరు 10న పీవీ నామినేషన్ వేశారు. ఇక 11 నుంచి 18 వరకూ దాదాపు 50-60 మంది వ్యక్తులు కర్నూలు కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోనే ఉన్నారు. వీళ్లంతా నామినేషన్లు వేసేందుకు ఎవరైనా వస్తున్నారా అని తనిఖీలు చేసేవారు. కలెక్టర్ ఇతర రెవెన్యూ అధికారులు ఆ తతంగాన్ని చూసీ చూడనట్లు వదిలేశారు. ఎవరైనా దాని గురించి ప్రశ్నిస్తే, ఇక్కడ అనధికారిక వ్యక్తులున్నట్టు మాకు లిఖిత పూర్వక ఫిర్యాదు రాలేదు అనేవారు.

ఎవరైనా నామినేషన్ వేయడానికి వచ్చినట్లు అనుమానం వస్తే వారిని ఎత్తుకెళ్లి కోట్ల విజయ భాస్కర రెడ్డి బంధువుకు చెందిన మాధవి లాడ్జిలో ఉంచేవారు. వాళ్లలో కొందరిని చావకొట్టారు. నామినేషన్ల చివరి తేదీన మాత్రమే వారిని వదిలిపెట్టారు. పీసీసీ కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, కర్నూలు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ బాబు, ప్రత్తికొండ ఎమ్మెల్యే శేషి రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే మదన గోపాల్, మాజీ ఎమ్మెల్సీ రఘురాం రెడ్డి, పీవీ కోసం సీటు ఖాళీ చేసిన ఎంపీ గంగుల ప్రతాప రెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి కుమారుడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి...వీరంతా ఈ ఎత్తుకెళ్లడాలూ, చావకొట్టడాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు’’ అని బాలగోపాల్ రాశారు.

‘‘ఆత్మకూరుకు చెందిన న్యాయవాది హనుమంత రెడ్డి నామినేషన్ వేయాలనుకుని అక్టోబరు 14న కర్నూలు వెళ్లారు. ఆయన్ను బయటే కిడ్నాప్ చేయాలనుకున్నా తప్పించుకుని కలెక్టర్ బంగ్లాలోకి వెళ్లారు.

అయితే, నామినేషన్ ఫారాలు ఇవ్వడానికి ఆయన్ను ఆ రూమ్ ఈ రూమ్ అంటూ తిప్పారు. చాలామందిని ఇలానే తిప్పారు. ఈలోపు ఆయన్ను ప్రకాశ్ రెడ్డి కాలర్ పట్టుకుని బయటకు తీసుకుపోయారు. తాలూకా సమస్యల గురించి మాట్లాడిస్తాం అంటూ జీపు ఎక్కించి లాడ్జీకి తీసుకువెళ్లి అక్కడ పెట్టారాయన్ను.

ఆ లాడ్జీలో బందీ అయిన మొదటి వ్యక్తి హనుమంత రెడ్డే. ఆ తరువాత శీలం సంజీవ రెడ్డి అనే రాయలసీమ రైతు సంఘం నాయకుడు కూడా నామినేషన్ వేద్దాం అనుకున్నారు. ఆయన్ను కూడా కలెక్టరు కార్యాలయం బయటే బంధించి ఎత్తుకెళ్లి లాడ్జీలో వేశారు.

కాకినాడ నుంచి వచ్చిన ఒక జ్యోతిష్యుడికీ ఇలానే జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చిన మస్తాన్ వలీ అనే ఒక టీచర్‌ని అయితే మూడు రోజులు కలెక్టరేట్లోనే నిర్బంధిస్తే, బీజేపీ వారు నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు ఆయన్ను విడిపించారు.

గ్వాలియర్ నుంచి నామినేషన్ వేయడానికి వచ్చిన ఒకరు ఈ తంతు అంతా చూసి సైలెంటుగా వెనక్కు వెళ్లిపోయారు. ఇలా కిడ్నాప్ చేసిన వారందర్నీ అక్టోబరు 16న హంద్రీ నది పక్కనున్న ఒక గెస్ట్ హౌస్‌కు మార్చారు. కాపలాదార్లు రిలాక్స్ అవుతున్నప్పుడు, 18వ తేదీ రాత్రి వారు అక్కడి నుంచి తప్పించుకున్నారు.

అందులో నుంచి న్యాయవాది సంజీవ రెడ్డి లారీలో హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడే హైదరాబాద్‌లోని విలేఖర్లకు ఆయన విషయం చెప్పాక, ఈ తంతు అంతా బయట పడింది. కాంగ్రెస్ వారి వేధింపులు తట్టుకునేందుకు హనుమంత రెడ్డి తరువాత బీజేపీలో చేరారు.’’ అని రాశారు బాలగోపాల్.

‘‘కర్నూలు మీడియాకు ఇదంతా తెలిసినప్పటికీ వారు వార్తలు రాయలేదు. అయితే ఈనాడు పత్రికలో అసిస్టెంట్ రిపోర్టర్ అయిన సూర్యప్రకాశ్ మాత్రం దీని గురించి రాయాలనుకున్నారు. తానే సొంతంగా నామినేషన్ వేసి, ఏం జరుగుతుందో వార్తగా రాద్దామని భావించారు.

అయితే ఆయన 18వ తేదీ ఉదయం 10 గంటలకు నామినేషన్ వేయడానికి వెళ్తే, నామినేషన్‌కు అవసరమయ్యేలా ఆయన ఇంటి అడ్రస్‌ని ధ్రువీకరించకుండా అధికారులు అటూ ఇటూ తిప్పారు. దీంతో ఆయన కలెక్టర్ దగ్గరకు వెళ్లారు. నామినేషన్ ఇస్తే తీసుకుంటా తప్ప ఇతర పనులు చేయబోనని కలెక్టర్ చెప్పారు. దీంతో ఈ మొత్తం తతంగానికి కలెక్టర్ సహకరిస్తున్నట్టు సూర్యప్రకాశ్‌కి అర్థం అయింది.

బయట నుంచి ఇదంతా చూస్తున్న సుధాకర్ బాబు సూర్య ప్రకాశ్ చొక్కా పట్టుకుని లాగితే ఆయన కలెక్టర్ కాళ్ల దగ్గర పడ్డారు. అయినా కలెక్టర్ స్పందించలేదు. బయటకు వెళ్తే తనను కిడ్నాప్ చేస్తారని గ్రహించిన సూర్యప్రకాశ్, రోజంతా కలెక్టర్ కార్యాలయంలోనే ఉండి నామినేషన్ల సమయం ముగిశాక బయటకు వెళ్లారు. అప్పుడే ఎదురుపడ్డ కాంగ్రెస్ వారిని దీని గురించి అడిగితే సదరు కాంగ్రెస్ నాయకుడు ఒక కథ చెప్పారు ఆ రిపోర్టర్‌కి’’ అని బాలగోపాల్ తన కథనంలో రాశారు.

‘‘రాజీవ్‌ని చంపడం ద్వారా భారతదేశాన్ని అస్థిరం చేయాలని విదేశీ కుట్రలు జరుగుతున్నాయి. రేపు ఎవరైనా ఒక స్వతంత్ర అభ్యర్థిని చంపితే ఎన్నిక వాయిదా పడితే, అప్పుడు పీవీ ప్రధానిగా తప్పుకోవాల్సి వస్తుంది’’ అంటూ విలేఖరి సూర్య ప్రకాశ్‌కి చెప్పారు అప్పటి మున్సిపల్ చైర్మన్ సుధాకర్ బాబు. కానీ, వాస్తవం ఏంటంటే అక్కడ ఏ విదేశీ శక్తులు లేవు. స్థానిక ఫాక్షన్ రాజకీయ హత్యలు, స్థానిక శక్తులే ఇలాంటి వాటికి కారణాలు. రాయలసీమ ఫాక్షన్‌లో ఇది తరచూ జరుగుతూ ఉండేది.’’ అని బాలగోపాల్ పేర్కొన్నారు.

మొత్తానికి ఈ స్వతంత్ర అభ్యర్థుల హత్యల భయమూ, కర్నూలు ఫాక్షన్ నాయకుల ప్రెస్టేజీ కలగలిసి ఆ ఎన్నికల్లో పీవీపై ఎక్కువ మంది ప్రత్యర్థులు పోటీ పడకుండా చూశారనేది బాలగోపాల్ అభిప్రాయం. కర్నూలు పెద్దలంతా కలసి పీవీని ఒప్పించి నంద్యాల నుంచి సులువుగా గెలిపిద్దాం అనుకుంటే, ఆయనపై పోటీ పడటానికి మీకెంత ధైర్యం అని కిడ్నాప్ చేసిన వారి మొహం మీదే అన్నట్టు చెబుతారు. బయట ప్రెస్ ముందు మాత్రం పీవీ ఎన్నిక ఆవశ్యకత గురించి ప్రసంగాలు ఇచ్చేవారు.

‘‘ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ వారు బాగా రిగ్గింగ్ చేసేశారు. కొన్నిచోట్ల ఓట్లు చాలా ఎక్కువ వేసేస్తే, నిబంధనల ప్రకారం రీపోలింగ్ ఉంటుంది. ఆ విషయం తెలిసి మళ్లీ డబ్బాల్లో వేసిన ఓట్లు వెనక్కు తీసిన ఘటనలు కూడా జరిగాయి. వాస్తవానికి ఆ ఎన్నికల్లో ఎలా అయినా పీవీ గెలిచేవారు. కానీ అప్పటికే బిహార్ లో గెలిచిన రాంవిలాస్ పాశ్వాన్ రికార్డు బ్రేక్ చేయాలని పీవీ కోసం కాంగ్రెస్ వారు రిగ్గింగ్ చేశారు.’’ అని సీనియర్ పాత్రికేయులు నాంచారయ్య బీబీసీతో అన్నారు.

స్వతంత్రులే ఎందుకు లక్ష్యం?

ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనుకున్న వారిపై స్థానిక కాంగ్రెస్ వారు చాలా ఆగ్రహంతో ఉండేవారట. దానికి రెండు కారణాలు, ఒకటి వారి మాట వినకుండా పోటీకి దిగడం అయితే, మరొకటి, స్వతంత్ర అభ్యర్థులను హత్య చేసి ఎన్నికలు వాయిదా వేయించేస్తారనే భయం.

'90ల నాటి ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం పోటీలో ఉన్న అభ్యర్ధి చనిపోతే ఎన్నికను వాయిదా వేస్తారు. ఎన్నికలు వాయిదా వేయించాలి అనుకున్న వారు ఆ ఎన్నికల్లో పోటీ చేసే పెద్దగా పేరులేని స్వతంత్ర అభ్యర్థులను హత్య చేసేవారని చెబుతారు.

ప్రధాని పీవీ నిల్చున్న ఎన్నిక కాబట్టి వాయిదా పడకుండా, అలా వాయిదా పడితే ప్రధాని ఎక్కడో ఒకచోట నుంచి ఎన్నిక కావాలన్న నిబంధన అడ్డం వచ్చి, మళ్లీ ప్రధానిని మారాల్సిన పరిస్థితి వస్తుందన్న ఆందోళనతో ఎక్కువ మంది స్వతంత్రులు నామినేషన్లు వేయకుండా చూసుకున్నారు కాంగ్రెస్ నాయకులు.

మొత్తానికి ఈ స్వతంత్ర అభ్యర్థుల హత్యల భయమూ, కర్నూలు ఫాక్షన్ నాయకుల ప్రెస్టీజ్ కలసి ఆ ఎన్నికల్లో పీవీపై ఎక్కువ మంది ప్రత్యర్థులు పోటీ పడకుండా చేశాయి.

ఆ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు కూడా పోటీ చేయలేదు. కేవలం బీజేపీ, మరో రెండు మార్క్సిస్ట్ - లెనినిస్టు పార్టీలు మాత్రమే పీవీపై పోటీ పెట్టాయి.

అలాగే మోత్కుపల్లి నరసింహులు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ పడ్డారు. ఆయన చుండూరు ఘటనపై ప్రచారం చేయడానికి పోటీ చేశారు.

‘‘అయితే, బీజేపీ అభ్యర్థి, ఎంఎల్ పార్టీల అభ్యర్థులను మాత్రం కాంగ్రెస్ నాయకులు ఏమీ చేయలేరు. వారిని ఎవరూ చంపలేరు అన్న ధైర్యం ఒకటి. వారిని ఏమైనా చేస్తే పెద్ద రచ్చ అవుతుందనే భయం మరొకటి - ఈ రెండూ వారు పోటీ చేయగలగడానికి కారణాలు’’ అన్నారు బాలగోపాల్.

అయితే అంత హడావుడిలోనూ తెలుగుదేశం నాయకుడు పర్వతనేని ఉపేంద్ర సన్నిహితుడు, హైకోర్టు న్యాయవాది అయిన కోటి రెడ్డి అనే వ్యక్తి స్థానిక కాంగ్రెస్ వారి కళ్లుగప్పి నామినేషన్ వేశారు. ఆ విషయం ఆలస్యంగా తెలిసింది.

బీజేపీ అభ్యర్థితో కలసి కలెక్టరేట్‌లోకి వెళ్లడంతో వల్ల ఆయన్ను అభ్యర్థి అని ఎవరూ గుర్తించలేదు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖుల కార్లలో ఆయన వచ్చారు.

‘‘విషయం తెలిశాక ఆగ్రహంతో రగలిపోయిన కాంగ్రెస్ నాయకులు, అక్టోబరు 21న హైదరాబాద్‌లో కోటిరెడ్డి కొడుకుపై దాడి చేశారు. అయితే, పోలీసులు కోటిరెడ్డి కొడుకుపైనే కేసు పెట్టారు. నంద్యాలలో పోటీ చేసే ధైర్యం వచ్చిందా అంటూ ఆయన కారును ధ్వంసం చేశారు. కోటిరెడ్డికి పెద్దవారితో, ముఖ్యంగా మహబూబ్‌నగర్‌కు చెందిన రెడ్డి ప్రముఖులతో పరిచయాలు ఉన్నప్పటికీ అవి ఉపయోగపడలేదు. వారం తరువాత ఆయన నామినేషన్ వెనక్కు తీసుకున్నారు’’ అని బాలగోపాల్ రాశారు.

పీవీ గౌరవానికి భంగం కలిగించే ఇటువంటి చర్యను ఆయనకు చెప్పకుండా విజయభాస్కర రెడ్డి చేస్తారని చెప్పలేమని బాలగోపాల్ వ్యాఖ్యానించారు. అంటే ఇదంతా పీవీకి తెలిసే జరిగిందనేది బాలగోపాల్ అభిప్రాయం.

అప్పటి ప్రధాన పార్టీ తెలుగుదేశం, తెలుగు జాతి వైభవం పేరుతో పీవీపై పోటీకి దూరం అయింది. అయితే తెలుగుదేశం పీవీకి మద్దతివ్వడం వెనుక కూడా ఒక క్విడ్ ప్రో కో ఉందనే వాదన ఉందంటారు బాల గోపాల్.

తెలుగుదేశం నాయకులు తమ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇలా చేశారని బాలగోపాల్ అభిప్రాయం. మొత్తంగా ఆ ఎన్నికల వెనుక జరిగిన హింస బయటకి రాకుండా, భారతదేశ చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఒకరిగా పీవీ పేరు నిలిచిపోయింది.

నీలం సంజీవ రెడ్డి ఎన్నిక కూడా...

ఈ స్థానంలో నీలం సంజీవ రెడ్డి ఎన్నిక కూడా ఇలానే జరిగిందని బాలగోపాల్ తన వ్యాసంలో రాశారు. 1978 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 41 స్థానాల్లో కాంగ్రెస్ గెలిస్తే ఒక్క నంద్యాలలో మాత్రమే జనతా పార్టీ బలపరిచిన నీలం సంజీవ రెడ్డి గెలిచారు.

‘‘అంటే ఇక్కడ ప్రజలు జనతాకు ఓటేశారని కాదు. ఇక్కడ ఉన్న రెడ్డి నాయకులంతా సంజీవ రెడ్డిని గెలిపించాలని నిర్ణయించారు. అందుకోసం వారు ఏ స్థాయికి వెళ్లారంటే, కాంగ్రెస్‌కి ఓటేస్తారన్న అనుమానం ఉన్న దళితులను లారీల్లో కృష్ణా నదీ తీరంలోని నల్లమల అడవుల దగ్గరకు తీసుకెళ్లి పోలింగ్ ముగిసే వరకూ వారిని అక్కడే ఉంచారు. ఆ రకంగా ఎన్నికైన సంజీవ రెడ్డి తర్వాత రాష్ట్రపతి అయ్యారు’’ అని రాశారు బాలగోపాల్.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-04-28T02:51:48Z dg43tfdfdgfd