నదిలో బోల్తా పడిన పడవ, నలుగురు మృతి - మహిళలు చిన్నారులు గల్లంతు

Mahanadi River News: ఒడిశాలోని మహానది నదిలో ఘోర ప్రమాదం (Mahanadi River Accident) జరిగింది. 50 మందితో ప్రయాణికులతో వెళ్తున్న పడవ నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగతా వాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒడిశాలోని ఝార్సుగూడలో ఈ ఘటన జరిగింది. ఇవాళ ఉదయం (ఏప్రిల్ 10) కొందరి మృతదేహాలు వెలికి తీశారు. అంతకు ముందు ఓ మహిళ డెడ్‌బాడీని గుర్తించారు. ఇప్పటి వరకూ నలుగురి మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. బర్‌గర్‌ నుంచి బందిపలీ ప్రాంతానికి వెళ్తుండగా పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. నీటి ప్రవాహం పెరగడం వల్ల ఆ అలల తాకిడి పడవ మునిగిపోయింది.

ప్రమాద సమాచారం అందుకున్న కలెక్టర్ వెంటనే అప్రమత్తమయ్యారు. దాదాపు 7 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. వాళ్ల ఆచూకీ కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. Odisha Disaster Rapid Action Force రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. అటు ప్రభుత్వం తరపున కూడా కొంత మంది గజ ఈతగాళ్లు గల్లంతైన వాళ్ల ఆచూకీ కనిపెట్టేందుకు శ్రమిస్తున్నారు. 

"ప్రమాద సమాచారం తెలియగానే భువనేశ్వర్ నుంచి స్కూబా డైవర్స్‌ని పిలిపించాం. ఇప్పటి వరకూ కొందరిని కాపాడి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగాం. మిగతా వాళ్ల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బయటకు వచ్చిన వాళ్లందరినీ ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. స్కూబా డైవర్స్‌ వద్ద నైట్‌ లైట్ ఎక్విప్‌మెంట్‌ కూడా ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది"

- అధికారులు

ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. మృతులు కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. అయితే...లైసెన్స్ లేకుండానే నదిలో పడవ నడుపుతున్నారని స్థానిక ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఫిట్‌నెట్ సర్టిఫికేట్ లేకున్నా అనుమతినిచ్చారని మండి పడుతున్నారు. ఈ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని విమర్శిస్తున్నారు. 

2024-04-20T06:53:09Z dg43tfdfdgfd