నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో ప్రచారం జోరుగా నడుస్తోంది. ఎంపీ అభ్యర్థులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. గడప గడపకు ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎలాగైనా గెలవాలన్న కసితో అన్ని పార్టీల అభ్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే.. తమకు పోటీ అనుకున్న బలమైన ప్రత్యర్థిని గుర్తించి.. తనపై గెలుపు సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే.. అన్ని చోట్ల అభ్యర్థులు.. నాకు ఫలానా వ్యక్తి పోటీ అంటూ వారిని టార్గెట్ చేసుకుని ఎన్నికల క్షేత్రంలో ముందుకెళ్తుంటే.. చేవెళ్ల (Chevella) బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) మాత్రం తనకు ప్రత్యర్థులు ఎవరూ లేదని చెప్తున్నారు.

ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రత్యర్థి లేరని ప్రకటించటమే కాకుండా.. గెలుపు తనదేనని, ఆ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీనే సహాయం చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. చేవెళ్ల స్థానానికి గానూ.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని బరిలో దింపింది కాంగ్రెస్. కానీ.. ముందు నుంచి ఆ స్థానానికి స్థానిక నేత మాజీ మంత్రి మహేంద్ర రెడ్డి సతీమణి సునీతా మహేందర్ రెడ్డికి ఇస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. చివరి క్షణంలో ఆమెకు కాకుండా.. కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న రంజిత్ రెడ్డిని బరిలో దింపి, సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజిగిరి నుంచి పోటీ చేపిస్తోంది కాంగ్రెస్ నాయకత్వం.

దీంతో.. తన గెలుపు సులువైందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. జడ్పీ ఛైర్ పర్సన్‌గా చేసిన సునీతా మహేందర్ రెడ్డి అయితే స్థానికంగా ఆమెకు చాలా పరిచయాలు ఉన్నాయని, క్యాడర్ కూడా మంచిగా ఉందని.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి వివరించారు. దీంతో.. ఆమెను బరిలోకి దింపితే తనకు గట్టి పోటీ ఎదురయ్యేదని.. కానీ రంజిత్ రెడ్డికి నియోజకవర్గంలో అన్ని పరిచయాలు లేవని.. ఎక్కడా తిరగలేదని.. కాబట్టి తన గెలుపు చాలా సులువని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో.. కొండా చేసిన వ్యా్ఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

మరి కొండా చెప్పిన మాటలను బట్టి.. కాంగ్రెస్ కావాలనే బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు ఇలా చేసిందా.. అన్న అనుమానాన్ని బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో.. కాంగ్రెస్, బీజేపీ మధ్య దోస్తీ అర్థమైపోతుందంటూ ఆరోపణలు చేస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T16:18:53Z dg43tfdfdgfd