నాగర్​కర్నూల్​లోకాంగ్రెస్​ వర్సెస్​ బీజేపీ

నాగర్​కర్నూల్​లోకాంగ్రెస్​ వర్సెస్​ బీజేపీ

  • మూడోసారి గెలవాలని మల్లు రవి ప్రయత్నం 
  • మోదీ ఛరిష్మాపై బీజేపీ అభ్యర్థి భరత్ ఆశలు
  • బోణీ కొట్టాలని బీఆర్ఎస్​ క్యాండిడేట్ ​ప్రవీణ్ తాపత్రయం
  • కారును కలవరపెడుతున్నకాంగ్రెస్​ లీడ్

నాగర్​కర్నూల్,​ వెలుగు :నాగర్​కర్నూల్,​ వెలుగు : నాగర్ కర్నూల్​ లోక్​సభ స్థానాన్ని దక్కించుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు శ్రమిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్,  బీజేపీల మధ్యే పోటీ ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ సాధించిన ఓట్ల శాతం, కీలక నేతల చేరికలతో కాంగ్రెస్​ బలంగా కనిపిస్తోంది. దీంతో ఆ పార్టీ అభ్యర్థి మల్లు రవి గెలుపు తనదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్​ప్రసాద్ ​సిట్టింగ్​ ఎంపీ రాములు కొడుకుగా, తాను స్థానికుడైనందున ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నారు. కుదరని పొత్తుల బేరంతో బీఎస్పీని వీడిన ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్​అనూహ్యంగా బీఆర్ఎస్​అభ్యర్థిగా నాగర్​కర్నూల్ ​నుంచి పోటీలో ఉండడం చర్చనీయాంశంగా మారింది.

 ఇక బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉంటానని నామినేషన్​ వేసిన సీనియర్​ లీడర్, మాజీ ఎంపీ డా.మంద జగన్నాథం బీఫారం సమర్పించకుండానే నాకౌట్​దశలోనే అనర్హుడయ్యారు. జగన్నాథం చీల్చే ఓట్ల ప్రభావం ఎవరి మీద ఉంటుందో అని మూడు పార్టీల అభ్యర్థులు కొంత టెన్షన్​పడ్డా ఇప్పుడు రిలాక్స్​ అయ్యారు. బీఎస్పీ అభ్యర్థి యోసేఫ్, సోషల్​మీడియా ఇన్​ఫ్లుయెన్సర్​ బర్రెలక్క అలియాస్​శిరీష, ఇతర ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నా గెలుపోటముల నిర్ణయించే స్థాయిలో వారి ప్రభావం ఉండదంటున్నారు.  

ఐదు స్థానాల్లో గెలిచి జోష్​ మీదున్న కాంగ్రెస్ 

నాగర్​కర్నూల్​పార్లమెంట్​నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా కొల్లాపూర్, వనపర్తి, నాగర్​కర్నూల్​, అచ్చంపేట, కల్వకుర్తిల్లో కాంగ్రెస్​విజయం సాధించింది. బీఆర్ఎస్​ గద్వాల, అలంపూర్​స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ రెండు చోట్లా బీఆర్ఎస్ ఎమెల్యేలు గెలిచారన్న సంతోషం కూడా మిగలకుండా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీల చైర్మన్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం ఆ పార్టీని షాక్​కు గురి చేసింది. మరోవైపు అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి​ నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ లక్ష వరకు మెజార్టీ సాధించడంతో పాటు సీఎం రేవంత్​రెడ్డి సొంత జిల్లా కావడంతో గెలుపు కోసం స్థానిక కాంగ్రెస్ ​లీడర్లు శ్రమిస్తున్నారు. 

మంత్రి జూపల్లికి నాగర్​కర్నూల్​ పార్లమెంట్​ ఇన్​చార్జి బాధ్యతలు ఇవ్వడంతో గెలుపు కోసం ఆయన కష్టపడుతున్నారు. 2019 పార్లమెంట్​ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి డా.మల్లు రవి ఓటమిపాలైనా 1991,1998లో రెండు సార్లు గెలిచారు. జడ్చర్ల నియోజకవర్గానికి షిప్ట్​ అయినా నాగర్​కర్నూల్ ​పార్లమెంట్ ​సెగ్మెంట్​లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, క్యాడర్​తో ఆయన సంబంధాలు వీడలేదు. ఈ పరిచయాలు తన విజయానికి తోడ్పడతాయని, కాంగ్రెస్​ ఆరు గ్యారంటీలు, అగ్రనేత రాహుల్​గాంధీ సభల్లో పాల్గొనడం, రేవంత్​రెడ్డి ప్రచారం  కలిసి వస్తాయని మల్లు రవి నమ్ముతున్నారు.  

లోకల్​ స్లోగన్​, మోదీ హవాపై ఆశలు...

అచ్చంపేట నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసిన రాములుకు నాగర్​కర్నూల్​ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో పరిచయాలున్నాయి. బీఆర్ఎస్​ బాసులు కేసీఆర్, కేటీఆర్​ తనను చిన్నచూపు చూశారన్న బాధతో ఆయన బీజేపీలో చేరారు. ఆ పార్టీ జనరల్ ​సెక్రెటరీ బంగారు శ్రుతిని కాదని కొడుకు భరత్​కు టికెట్​ఇప్పించుకోవడంలో సక్సెస్​ అయ్యారు. 

ప్రధాని మోదీ నాగర్ ​కర్నూల్​బహిరంగ సభతో క్యాడర్​లో మరింత జోష్ ​పెరిగింది. గుజరాత్​ సీఎం, కేంద్రమంత్రులు కూడా ప్రచారానికి రావడం ప్లస్ ​పాయింట్స్. ​ ప్రధాని మోదీ ఛరిష్మా, ఆయోధ్య రామమందిరం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విజయాలు తనను గెలిపిస్తాయని భరత్​ప్రసాద్​ నమ్మకంగా ఉన్నారు. ఆ పార్టీ ముఖ్య లీడర్లు ఎల్లేని సుధాకర్​ రావు, టి.ఆచారి, జక్కా రఘునందన్​ రెడ్డి,లోక్​నాథ్​రెడ్డిలకు ఈ ఎన్నికలు సవాల్​గా మారనున్నాయి. 2019 పార్లమెంట్​ఎన్నికల్లో బీజేపీ 1,29,021 ఓట్లు సాధించగా, ఇప్పుడు విజయానికి అవసరమైన ఓట్లను సాధించడం కోసం కష్టపడుతున్నారు. 

ఎంపీగా అయినా గెలవాలని.. 

సిర్పూర్​ టి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన ఆర్ఎస్ ​ప్రవీణ్ ​కుమార్ ప్రస్తుతం బీఆర్​ఎస్​   ఎంపీ అభ్యర్థిగా ..​మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూనే ముందుకు పోతున్నారు. గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు ఏర్పాటైన పూర్వ విద్యార్థుల ఫోర్స్​అయిన స్వేరోస్​ను రంగంలోకి దించారు. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం, అచ్చంపేట, నాగర్​కర్నూల్ ​మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాల రాజు, మర్రి జనార్దన్​రెడ్డి ప్రచారంలో సీరియస్​గా పాల్గొనడం కలిసి వస్తుందని ఆర్ఎస్పీ భావిస్తున్నారు. 

కల్వకుర్తి, వనపర్తి నియోజకవర్గాల్లో ప్రచారం పుంజుకోకపోయినా పోలింగ్​ వరకు సర్దుకుంటుందని అనుకుంటున్నారు. నిన్న మొన్నటివరకు డల్​గా ఉన్న బీఆర్ఎస్​ క్యాడర్​లో కేసీఆర్​ రోడ్​ షోతో కాస్త జోష్ పెరిగింది. ప్రచారంలో లోకల్ ​ఇష్యూస్​తో పాటు రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ఆర్​ఎస్పీ ప్రస్తావిస్తున్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, మల్లు రవి స్థానికేతరుడని, తనను పార్లమెంట్​కు పంపిస్తే నిలదీసి కొట్లాడుతా అంటూ వాగ్దానం చేస్తున్నారు.  

లెక్క రిపీటైతే బీఆర్​ఎస్​కు కష్టమే   

2019 పార్లమెంట్​ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోరులో టీఆర్ఎస్​అభ్యర్థి, సిట్టింగ్​ఎంపీ పోతుగంటి రాములు 1,89,668 ఓట్ల మెజారిటీ సాధించారు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే సరికి టోటల్​ సీన్​ రివర్సయ్యింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ 6,39,628 ఓట్లు సాధించి  ఐదుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. బీఆర్ఎస్ ​మాత్రం 5,34,401 ఓట్లతో ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఎన్నికల్లో ​రెండు పార్టీల మధ్య 11.8 శాతం ఓట్ల తేడా ఉంది. ఈ లెక్క పార్లమెంట్ ​ఎన్నికల్లోనూ రిపీట్​ అయితే బీఆర్ఎస్​కు కష్టకాలమే..

©️ VIL Media Pvt Ltd.

2024-05-07T01:48:07Z dg43tfdfdgfd