నాడు కలిసి పనిచేశారు.. నేడు తలపడుతున్నారు

నాడు కలిసి పనిచేశారు.. నేడు తలపడుతున్నారు

  • ఎంపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల పోరు రసవత్తరం      
  •  మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో టఫ్ ఫైట్​

మహబూబాబాద్, వెలుగు: కలిసి పనిచేసిన వారే నేడు లోక్​సభ ఎన్నికల్లో తలపడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహబూబాబాద్​పార్లమెంట్​ఎలక్షన్​లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు 2009లో ఒకేపార్టీలో కలిసి పనిచేశారు. ఒకరి గెలుపుకోసం మరొకరు ప్రచారం చేశారు. మారిన రాజకీయ పరిణామాలతో ఇప్పుడు ప్రధాన పార్టీల నుంచి బీ ఫారాలు పొంది ఢీ అంటే ఢీ అనేలా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ముగ్గురి మధ్య టఫ్​ఫైట్​సాగుతుండడంతో ఎవరు గెలుపొందుతారోనన్న ఆసక్తి నెలకొన్నది. 

నాడు ఒకరి గెలుపుకోసం మరొకరు..

2009లో మహబూబాబాద్ ఎంపీ స్థానం పునర్ విభజనలో భాగంగా ఎస్టీ రిజర్వ్​గా ఏర్పడింది. ఆ సమయంలో కాంగ్రెస్ నుంచి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా మాలోతు కవిత ఎన్నికల్లో గెలుపొందారు. అదేసమయంలో లోక్​సభ ఎన్నికల్లో నిలబడిన పోరిక బలరాం నాయక్​ గెలుపు కోసం కవిత కృషి చేశారు.2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓటమి తర్వాత బీఆర్​ఎస్​లో చేరిన కవిత, 2014లో అప్పటి టీఆర్​ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన అజ్మీరా సీతారాం నాయక్ గెలుపు కోసం పని చేశారు. 2019 ఎంపీ ఎన్నికల్లో మాలోతు కవిత గెలుపుకోసం అదే పార్టీలో ఉన్న మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ పని చేశారు. ఒకరిగెలుపు కోసం ఒకరు కలిసి పని చేసిన వారు ఇప్పుడు కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీల నుంచి పోటీ చేస్తుండడంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారింది. 

హోరాహోరీగా ప్రచారం..

2024  ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోరిక బలరాం నాయక్​, బీఆర్​ఎస్ మాలోతు కవిత, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్​లు బీ ఫామ్​లు దక్కించుకోవడంతోపాటు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే మహబూబాబాద్​కు ఒక్కోసారి ఎంపీగా గెలుపుపొందగా, రెండో సారి ఈ పీఠం దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్​రెడ్డి, బీజేపీ తరఫున జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీఆర్​ఎస్​పార్టీ అధినేత కేసీఆర్ ను ప్రచారానికి తీసుకువచ్చారు. ఈ పార్లమెంట్ పై ముగ్గురు అభ్యర్థులకూ పూర్తి పట్టు ఉండటంతో, 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం కొనసాగేలా చర్యలను తీసుకుంటున్నారు. అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మానుకోటలో హోరాహోరీగా ప్రచారం సాగుతుండగా, ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది.

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-04T00:52:04Z dg43tfdfdgfd