నిజాలు మాట్లాడితే బెదిరిస్తుండ్రు : భట్టి విక్రమార్క

నిజాలు మాట్లాడితే బెదిరిస్తుండ్రు : భట్టి విక్రమార్క

హైదరాబాద్: కేంద్రంలోని దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులను తమ ఆధీనంలో ఉంచుకున్న బీజేపీ ప్రభుత్వం నిజాలు మాట్లాడిన వారిపై బెదిరింపులకు దిగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల పక్షాన గొంతెత్తిన ముఖ్యమంత్రిని ఢిల్లీకి రమ్మంటోందని అన్నారు.  ఇవాళ గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.  సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకోవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏకైక మార్గమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బలహీన వర్గాలకు దేశంలో ఉన్న సంపదను పంచినప్పుడే ప్రజాస్వామ్యానికి అసలైన నిర్వచనమని చెప్పారు. అణగారిన వర్గాల రిజర్వేషన్ల రక్షణకు రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని చెప్పారు. 

ఈ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు సాధించి అణగారిన వర్గాల రిజర్వేషన్లు రద్దు చేసి వారిని బానిసలు మార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు  రాజ్యాధికారంలో వాటాకోసం కాంగ్రెస్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.  ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా పేరున్న భారత్ లో డెమొక్రసీ రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోందని, బ్రిటిష్ కాలం నాటి రూల్ ను తెరపైకి తెచ్చి బెదిరిస్తోందని అన్నారు. ఢిల్లీ సుల్తాన్ ల మాదిరిగా వ్యవహరిస్తామంటే కుదురదని, ఓటుతో బీజేపీ ప్రభుత్వానికి అంతా బుద్ధి చెప్పాలని  భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. 

దేశంలో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఉందని అన్నారు. మోదీ పాలనలో దేశం అల్లకల్లోలం అయ్యిందని, బీజేపీ అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత బడుగు బలహీన వర్గాలదేనని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ  కలిసిపోయాయని అన్నారు. కేసీఆర్ బీజేపీకి వత్తాసు పలకడం సిగ్గు చేటని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారును కూల్చడం ఎవరి తరమూ కాదని అన్నారు. రాష్ట్రంలో 14 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-07T12:19:44Z dg43tfdfdgfd