నిరుద్యోగులకు అలర్ట్... ఈ వారం దరఖాస్తు చేసుకోవాల్సిన ఉద్యోగాలు ఇవే..!

ప్రభుత్వ రంగ సంస్థలు వివిధ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్స్ జారీ చేస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన కొన్ని రిక్రూట్‌మెంట్స్‌కు అప్లై చేసుకునే గడువు త్వరలో ముగియనుంది. ఈ వారం దరఖాస్తు చేసుకోవాల్సినవి ఏవో చూద్దాం.

* ఐటీఐ అప్రెంటీస్‌షిప్

రక్షణ రంగంలో కీలక సంస్థ డీఆర్‌డీవో ఆధ్వర్వంలో పనిచేసే డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ (DMRL)-హైదరాబాద్‌‌లో ఐటీఐ అప్రెంటీస్‌షిప్ నోటిఫికేషన్ వెలువడింది. వివిధ డిపార్ట్‌మెంట్‌లలో ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, కంప్యూటర్ ఆపరేటర్, వెల్డర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌ వంటి అప్రెంటీస్‌షిప్ ఖాళీలు మొత్తంగా 127 భర్తీ కానున్నాయి. ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు అధికారిక పోర్టల్ విజిట్ చేసి మే 31లోపు దరఖాస్తు చేసుకోవాలి.

* HAL అసిస్టెంట్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అసిస్టెంట్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక పోర్టల్ hal-india.co.in విజిట్ చేసి మే 9 లోపు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్‌తో నాలుగు ఖాళీలు భర్తీ కానున్నాయి. మెకానికల్ విభాగంలో 2, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 2 పోస్టులు ఉంటాయి. ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.30,000 నుంచి రూ.120,000 మధ్య ఉంటుంది.

* అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్‌మెంట్

బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ వంటి సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఇటీవల రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు యూపీఎస్సీ పోర్టల్ upsc.gov.in విజిట్ చేసి మే 14లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌‌మెంట్‌తో 506 అసిస్టెంట్ కమాండెంట్స్ పోస్టులు భర్తీ కానున్నాయి. రాత పరీక్ష ఆగస్టు 4 నిర్వహిస్తారు.

* అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్‌మెంట్

తమిళనాడు టీచర్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TN TRB) అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు మే 15లోపు అధికారిక వెబ్‌సైట్ trb.tn.gov.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌తో తమిళనాడులోని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కాలేజీల్లో 4000 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు భర్తీ కానున్నాయి. రాత పరీక్షలో అర్హత సాధించడానికి జనరల్ అభ్యర్థులు 40 శాతం, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 30 శాతం స్కోర్ చేయాల్సి ఉంటుంది.

* టెక్నికల్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్

ఉత్తరప్రదేశ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిటీ (UPSSSC) టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్-సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక పోర్టల్ upsss.gov.in విజిట్ చేసి మే 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి అగ్రికల్చర్‌లో బీఈ, బీటెక్, బీఎస్సీ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు జులై ఒకటి నాటికి 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ రిక్రూట్‌మెంట్‌తో 3446 ఖాళీలు భర్తీ కానున్నాయి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

2024-05-06T06:29:48Z dg43tfdfdgfd