నేరుగా మీ ఇంటికి నెలకు 5 వేలు.. ఈ ప్రభుత్వ పథకానికి అర్హులు వీళ్లే..

దేశంలోని ప్రజలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తోంది. ప్రజా లబ్ది చేకూరే పథకాలు ప్రవేశపెడుతూ వారికి భరోసా కల్పిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అటల్ పెన్షన్ యోజన (Atal pension Yojana).
ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రారంభించారు. అసంఘటిత రంగంలోని వ్యక్తుల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు, వృద్ధాప్యంలో ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ఈ స్కీం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో చేరిన వారు 60 ఏళ్ల తర్వాత పెన్షన్ అందుకోవచ్చు.
రోజువారీ వేతన జీవులు, స్వయం ఉపాధి పొందే వ్యక్తులు, చిన్న తరహా వ్యాపారులకు అధికారిక పెన్షన్ స్కీమ్‌ లేని కొరతను అటల్‌ పెన్షన్‌ యోజన తీర్చుతోంది. ఓ ప్లాన్ ప్రకారం ఇందులో కొద్దిమొత్తం ఇన్వెస్ట్ చేస్తూ పోవడం వల్ల రిటైర్మెంట్ తర్వాత నెల నెలా పెన్షన్ అందుకోవచ్చు.
లబ్ది పొందాలనుకునే వ్యక్తి వయస్సు, చెల్లించే ప్రీమియం ఆధారంగా రూ.1000, రూ.2000, రూ.3000, రూ.4000, రూ.5000 వరకు పింఛను పొందే అవకాశం ఉంటుంది. మరి ఈ స్కీమ్‌లో ఎలా చేరాలి? ఎవరెవరు అర్హులు? లాంటి వివరాలను ఇప్పుడు క్లియర్ గా చూద్దాం.
60 ఏళ్ల వయసు దాటిన తర్వాత అసంఘటిత రంగ కార్మికులకు సైతం పెన్షన్ అందించాలని కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు వారు ఇందులో చేరవచ్చు. వ్యవసాయ రంగానికి చెందిన వారికి కూడా ఈ స్కీం వర్తిస్తుంది. ఈ పథకంలో చేరిన వారికి గరిష్ఠంగా నెలకు రూ.5 వేల వరకు పెన్షన్ అందించనుంది కేంద్రం.
ఇందులో చెల్లించే ప్రీమియం ఖాతాదారుల వయసును బట్టి మారుతుంది. 18 ఏళ్ల వ్యక్తి చేరినట్లయితే నెలకు రూ.42 నుంచి రూ.210 వరకు చెల్లించవచ్చు. నెలకు రూ.210 చెల్లిస్తూ 60 ఏళ్ల వయసు వచ్చే వరకు కంటిన్యూ అయితే అతనికి రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్ వస్తుంది.
40 ఏళ్ల వయసు వ్యక్తి అయితే నెలకు రూ.1454 ప్రీమియం చెల్లించాలి. అప్పుడే అతను నెలకు రూ.5 వేలు పెన్షన్ అందుకోగలడు. ఒకవేళ అంతకు తక్కువ పెన్షన్ అయినా ఓకే అనుకుంటే తక్కువ ప్రీమియం చెల్లించుకోవచ్చు. ప్రీమియం స్థాయి రూ.291 నుంచి రూ.1454 మధ్య ఉంటుంది.
ఈ పథకంలో తక్కువ వయసులోనే పొదుపు చేయడం ప్రారంభిస్తే ఎక్కువ లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది. పెట్టుబడి పెట్టి దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందాలని చూసే వారికి ఇదొక మంచి ఆప్షన్.

2024-03-28T01:43:22Z dg43tfdfdgfd