నౌకలను ఎలా నడుపుతారు, ఇరుకైన బ్రిడ్జ్‌‌లు, కాలువలను ఎలా దాటిస్తారు?

అమెరికాలోని బాల్టిమోర్ ఓడరేవు సమీపంలో ఓ బ్రిడ్జిని నౌక ఢీకొన్న ఘటనలో ఆరుగురు నదిలో పడిపోయి చనిపోయారు. ఈ నేపథ్యంలో అసలు నౌకలను ఎలా నడుపుతారు, వాటిని ఎలా నియంత్రిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవడం సహజం. నౌకలు బ్రిడ్జిలను, ఇరుకైన కాలువలను ఎలా దాటుతాయి? ఒకవేళ నౌకలో విద్యుత్ నిలిచిపోతే వాటిని ఆపడం సాధ్యమేనా? అనే సందేహాలకు సమాధానం ఏమిటో చూద్దాం.

మార్చి 26 రాత్రి 289 మీటర్ల పొడవున్న డాలీ అనే రవాణా నౌక బాల్టీమోర్ ఓడరేవు నుంచి శ్రీలంకకు బయల్దేరిన కొద్దిసేపటికే నౌకలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్యవసర జనరేటర్లు ఆన్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో నౌక పూర్తిగా అదుపు తప్పి సమీపంలోని బ్రిడ్జిని డీ కొట్టింది. నౌక తాకిడికి బ్రిడ్జి కూలి పటాస్కో నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు.

నౌకను ఎలా నడుపుతారు?

నౌకను ఎలా నడుపుతారనే విషయాన్ని , చెన్నైలో ఉండే రవాణా నౌక మాజీ కెప్టెన్, సరంగు మదన్ బీబీసీకి వివరించారు.

నౌకలలో అనేక రకాలు ఉంటాయి. రవాణా నౌకలు, వీటిల్లో బొగ్గు, ఎరువులను తీసుకువెళ్ళేవి ఉంటాయి. ఆయిల్ టాంకర్లను, కంటెయినర్లను తీసుకువెళ్ళే నౌకలు ఉంటాయి.

అలాగే ప్రయాణికులను తీసుకువెళ్ళే వాటిని క్రూయిజ్ నౌకలు అంటారు. రవాణ నౌకలు 70 నుంచి 400 మీటర్ల దాకా పొడవు ఉంటాయి. వీటి పొడవును బట్టి 20 నుంచి 1000 మంది దాకా అందులో పనిచేస్తుంటారు.

నౌక ప్రయాణమార్గాన్ని, అది ఎటువైపు వెళ్ళాలనే విషయాన్ని కెప్టెన్ నిర్దేశిస్తారు. ఆయన తరువాత షిప్ ఇంజిన్లను చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షిస్తుంటారు.

సముద్రంలో ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు అనే విషయాన్ని తెలియజేయడానికి ప్రత్యేకంగా మ్యాప్ ఉంటుందని వారు తెలిపారు.

భారతీయ నౌకల వద్ద ప్రత్యేకమైన భారతీయ నౌకా ప్రయాణ మ్యాప్ ఉంటుంది.

బ్రిటిషు నౌకల వద్ద ప్రపంచస్థాయి సమాచారంతో కూడిన మ్యాప్ ఉంటుంది.

ఏ ప్రాంతంలో సముద్రం లోతుగా ఉంటుంది, షిప్‌ను నిలపడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది, ఏయే పోర్టులకు సమీపంలో ఏయే బ్రిడ్జిలు ఉన్నాయి? వాటి ఎత్తు ఎంత? ఇరుకైన కాలువలు ఉన్న ప్రదేశాలు తదితర సమాచార మంతా ఈ డిజిటల్ మ్యాప్‌లలో పొందుపరుస్తారు.

విమానాల్లానే నౌకలు కూడా తమ సమీప పోర్టుకు నౌక సమాచారాన్ని అందించాలి.

వీటి గమనాన్ని జీపీఎస్ ద్వారా పర్యవేక్షిస్తుంటారు.

‘ఆపత్కాలంలో నౌకలోని వారు సమాచారం అందిస్తే పోర్టులోని వారు వెంటనే స్పందిస్తారు’’ అని కెప్టెన్ కుమార్ వివరించారు.

షిప్‌లో కరెంట్ పోతే ఏమవుతుంది?

‘‘నౌకలో మూడు రకాలైన విద్యుత్ సౌకర్యాలు ఉంటాయి. వీటి కోసం మూడురకాలైన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. డీజిల్, లేదంటే హెవీ ఫ్యూయల్, లో సల్ఫర్ ఫ్యూయల్ ను ఉపయోగిస్తారు.

నౌకలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే, అత్యవసరంగా జనరేటర్‌ను ఆన్ చేస్తారు. ఇక మూడోది బ్యాటరీలు. ఒక వేళ నౌకలో విద్యుత్ నిలిచిపోయి, జనరేటర్ పనిచేయకపోయినా, ఈ బ్యాటరీలు నౌక నుంచి సమాచారం అందించడానికి ఉపయోగపడతాయి.

ప్రొఫెల్లర్, చుక్కానిని నడపడానికి జనరేటర్‌ను వినియోగిస్తారు.

‘‘కరెంట్‌తో పాటు జనరేటర్ కూడా విఫలమైతే, నౌకను నియంత్రించలేం. దాని దిశను కూడా మార్చలేం. అలాంటి సమయంలో సమాచారం ఇవ్వడానికి బ్యాటరీలను వినియోగిస్తాం’’ అని కుమార్ తెలిపారు.

లంగరు వేసి నౌకను ఆపొచ్చా?

విద్యుత్ లేని నౌకను లంగరు వేసి ఆపడమనేది చాలా కష్టమైన పని అంటారు కుమార్.

నౌక వేగాన్ని నాటికల్ మైల్స్ రూపంలో చెబుతారు. నౌక వేగాన్ని బట్టి లంగరు వేయడం వల్ల ఉపయోగం ఉంటుందో లేదో చెప్పవచ్చు. 2 నుంచి 4 నాట్స్ వేగంతో ప్రయాణించే పెద్ద పెద్ద కార్గో నౌకలను లంగరు వేసి నిలపడం కష్టం.

అమితమైన వేగం వద్ద లంగరును ఉపయోగిస్తే, దాని చైను తెగిపోయి నిరుపయోగమయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు నౌకలో లంగరు ఉండే ప్రదేశానికి కూడా నష్టం కలుగుతుంది. ఇదంతా నౌక వేగంపైనే ఆధారపడి ఉంటుందిని వారు వివరించారు.

పంబన్ బ్రిడ్జి ని నౌకలు ఎలా దాటుతాయి?

ప్రపంచంలో రవాణా నౌకలకు సూయజ్ , పనామా కాలువలు ముఖ్యమైనవి. ఈ రెండూ ఇరుకైన కాలువలే కానీ, సముద్రాలను అనుసంధానించడానికి ఇవి కీలకంగా పనిచేస్తున్నాయి.

సూయజ్, పనామా లాంటి ఇరుకైన కాలువలు, బాల్టిమోర్, పంబన్ లాంటి బ్రిడ్జిలను దాటేటప్పుడు నౌక తక్కువ ప్రదేశంలోనే మరింత కచ్చితత్త్వంతో ప్రయాణించాల్సి ఉంటుంది.

ఇలాంటి కష్టమైన ప్రదేశాలలో నౌకా ప్రయాణం ఎలా ఉంటుందో నావికుడు మదన్ వివరించారు.

ఓడ సముద్ర ఉపరితలం నుంచి సముద్రంలోపలకు ఎంత లోతులో ఉంది, అలాగే సముద్ర ఉపరి తలం పైనుంచి ఓడ ఎంత ఎత్తులో ఉందో డ్రాఫ్ట్ లేదా డ్రాట్ ద్వారా కొలుస్తారు.

ఓడ పోర్టుకు చేరిన తరువాత, ఆ ఓడ బ్రిడ్జిని దాటగలదా లేదా అనే విషయాన్ని డ్రాఫ్ట్ కొలతలు తీసుకున్న తరువాతే అనుమతి ఇస్తారు. దీంతోపాటు నౌక పొడువును కూడా గమనంలోకి తీసుకుని ఇరుకైన కాలువలను దాటగలవా లేదా అని నిర్థరించుకున్నాకే అనుమతి ఇస్తారు.

బాల్టిమోర్ ప్రమాదానికి కారణమేంటి?

అమెరికాలో జరిగిన ఓడ ప్రమాదానికి కొన్ని సాధారణ కారణాలు ఉన్నాయని రవాణా నౌక మాజీ కెప్టెన్ కుమార్ చెప్పారు.

‘‘అమెరికాలో జరిగిన ఈ ఘటనకు కారణాలు ఇప్పటికీ వెల్లడి కాలేదు కానీ, ఈ ప్రమాదానికి కొన్ని బలమైన కారణాలను గుర్తించవచ్చు’’ అని చెప్పారు.

‘‘పోర్టు వద్ద ఎయిర్ డ్రాప్ట్ కొలతలు తీసుకున్న తరువాత బ్రిడ్జిని దాటేందుకు అనుమతి వచ్చాకా లోకల్ పైలట్‌తో నౌక బయల్దేరింది. కానీ నౌకలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంజిన్లను నడపడానికి జనరేటర్ శక్తి సరిపోలేదు. ఓ నిర్ణీత వేగంలో ఉన్నప్పుడు నౌక ప్రొఫెల్లర్, చుక్కానిని నియంత్రించలేక, నౌక దిశను మార్చలేకపోయారు. లంగరు వేయడం కూడా ఆ సమయంలో సాధ్యం కాకపోవడం వల్ల నౌక బ్రిడ్జిని ఢీకొట్టడం అనివార్యమైంది. మనం ఈ ఘటన తాలూకు వీడియోను చూస్తే మనకీ సాధారణ కారణాలు గ్రహించవచ్చు. ప్రమాదం జరగడానికి ఇవే కారణాలు అయి ఉంటాయి’’ అని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి :

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2024-03-28T07:49:36Z dg43tfdfdgfd