పదవి నుంచి తొలగించాలని పిటిషన్.. కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట

మనీల్యాండరింగ్ ఆరోపణలపై అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఇందులో న్యాయపరమైన జోక్యానికి ఆస్కారం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మిత్ ప్రీత్‌ల ధర్మాసనం గురువారం కొట్టివేసింది. ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేజ్రీవాల్‌ను ఈడీ గతవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన తన పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచే ఉత్తర్వులు జారీచేస్తున్నారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

మరోవైపు, ఢిల్లీ ప్రభుత్వ పాలన జైలు నుంచి సాగబోదని లెఫ్టినెంట్ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని ఆప్ మంత్రి ఆతిషి పేర్కొన్నారు. ఏ రాజ్యాంగ నిబంధన ఆధారంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మాట్లాడుతున్నారంటూ ఆమె ప్రశ్నించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం మేరకు ఎవరైనా చట్టసభ సభ్యుడు దోషిగా తేలితేనే వారి సభ్యత్వం రద్దవుతుందని మంత్రి గుర్తు చేశారు.

అటు, ఈడీ కస్టడీకి పంపుతూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ స్వరణకాంత శర్మ విచారణ జరిపారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ., తమకు మంగళవారమే కేజ్రీవాల్‌ పిటిషన్‌ కాపీ అందిందని, దాన్ని పరిశీలించి సమాధానం ఇచ్చేందుకు మూడు వారాల సమయం కావాలని కోరారు. దీనిపై కేజ్రీవాల్‌ తరఫున లాయర్ అభిషేక్‌ మను సింఘ్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ జాప్యం చేయటానికే పిటిషన్‌పై సమాధానానికి ఈడీ మరింత సమయం కోరుతోందని ఆయన ఆరోపించారు.

కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి ఈడీకి సరైన ప్రాతిపదికే లేదని, మూడు వారాల గడువు ఇస్తే ఈలోపు మళ్లీ ఏదో ఒక స్రిప్టు సిద్ధం చేస్తారని తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక సీఎం ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నిస్తూ.. ‘కేజ్రీవాల్‌కు ఉన్న సహజ, ప్రాథమిక, మానవ హక్కులను ఈడీ ఉల్లఘించింది... అందుకే.. దీన్నో తప్పుడు కేసుగా పరిగణించి కేజ్రీవాల్‌ను విడుదల చేయాలి. గురువారంతో కేజ్రీవాల్‌ రిమాండ్‌ గడువు ముగుస్తుంది. ఈలోపే మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలి’ అని విజ్ఞప్తి చేశారు. వాదనల అనంతరం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరిస్తూ తీర్పును వెల్లడించారు

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T08:35:17Z dg43tfdfdgfd