పద్మారావు మంచోడే కానీ.. వాళ్ల గురువే పిట్టల దొర: సీఎం రేవంత్

పద్మారావు మంచోడే కానీ.. వాళ్ల గురువే పిట్టల దొర: సీఎం రేవంత్

  • బిడ్డ బెయిల్​ కోసం.. బీజేపీకి సికింద్రాబాద్​ సీటు తాకట్టు
  • పద్మారావుగౌడ్​కు ఓటేస్తే బీజేపీకే లాభం: సీఎం రేవంత్​
  •     పజ్జన్న పరువు తీసేందుకుకేసీఆర్​ పోటీలో నిలిపారు
  •     కేంద్రమంత్రిగా ఉన్నా.. కిషన్​రెడ్డి హైదరాబాద్​కు చేసిందేం లేదు
  •     లష్కర్​లో ఎవరు గెలిస్తే.. ఆ పార్టీదే కేంద్రంలో అధికారం
  •     లక్ష ఓట్ల మెజార్టీతో దానం నాగేందర్​ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్ తన బిడ్డ కవిత బెయిల్ కోసం సికింద్రాబాద్ సీటును బీజేపీకి తాకట్టు పెట్టా రని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్​కు ఓటేస్తే బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికే లాభం జరుగుతుందని తెలిపారు. సికింద్రాబాద్ లోక్​సభ సీటుకు ఓ సెంటిమెంట్ ఉందని, ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తాడో.. కేంద్రంలో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందని అన్నారు. బుధవారం సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి రేవంత్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సారి కేంద్రం లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నదని, ఇక్కడ ఎంపీగా దానంను గెలిపిస్తే కేంద్ర మంత్రి కావడం ఖాయమని తెలిపారు. ఇక్కడి నుంచి బీజేపీ నాయకులు గెలిచి కేంద్ర మంత్రులైనా హైదరాబాద్​కు చేసిందేంటని ప్రశ్నించారు. వర దలు వచ్చి హైదరాబాద్ అతలాకుతలమైతే  కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సిటీకి చిల్లి గవ్వ కూడా తేలేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్​కు ఓటేస్తే మూసీలో వేసినట్లేనని ఎద్దేవా చేశారు. ఇక్కడ బీజేపీని ఓడించాలంటే దానంను గెలిపించాలన్నారు. పద్మారావుగౌడ్​ పరువు తీసేందుకే కేసీఆర్ ఆయన్ను బరిలో నిలిపారని అన్నారు. పజ్జన్న నామినేషన్​కు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆ రోజు అయ్యాకొడుకులు ఫామ్​హౌస్​లో పడుకున్నారని అన్నారు. పజ్జన్న మంచోడే, కానీ వాళ్ల గురువే (కేసీఆర్​)  పిట్టల దొర అని ఎద్దేవా చేశారు.  ‘హైదరాబాద్ సిటీకి కృష్ణా, గోదావరి జలాలు తెచ్చింది ఎవరో చర్చ పెడదాం.. ఇందుకు కేటీఆర్ సిద్ధమా?’ అని  సవాల్ విసిరారు.

తెలంగాణను అవమానించిన మోదీ

తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రధాని మోదీ తెలంగాణను అవమానించారని రేవంత్​రెడ్డి అన్నారు. తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలను మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్​కు తీసుకుపోతుంటే.. ఇక్కడి బీజేపీ నాయకులు కళ్లప్పగించి చూశారని ధ్వజమెత్తారు. కిషన్​రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి ఎలాంటి పెట్టుబడులు తీసుకురాలేదని దుయ్యబట్టారు. తాను సీఎం అయ్యాక కేంద్రంతో సంప్రదింపులు జరిపి కంటోన్మెంట్ ఏరియాలో స్కైవేలకు అవసరమైన స్థలాన్ని సేకరించగలిగామని, ప్రస్తుతం పనులు జరుగుతున్నాయన్నారు.  జంట నగరాల్లో మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్ అని చెప్పారు.  మత సామరస్యానికి ప్రతీక మన హైదరాబాద్ సిటీ అని, ఇక్కడ కర్ఫ్యూను తరి మిన చరిత్ర కాంగ్రెస్ దేనని తెలిపారు.

మతం పేరుతో ఓట్లడిగే ప్రయత్నం

ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లడిగే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్​రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే హిందువుల సంపదంతా ముస్లింలకు పంచుతుందని మోదీ చెప్తున్నారని, తండ్రి ఆస్తి కొడుక్కు రావాలంటేనే విరా సత్  చేయాలి.. అలాంటిది హిందువుల ఆస్తిని ముస్లింలకు ఎలా పంచుతారని నిలదీశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మోదీ ఇలా మాట్లాడటం సరైందేనా? అని ఫైర్ అయ్యారు. ‘దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి’ అని, అలాంటి దేవుడిని గోడల మీదకు తీసుకొచ్చి, డబ్బాలో ఓట్లు వేయించుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జాబ్​లు, ఇండ్లు ఇస్తామని బీజేపీ ప్రజలను మోసం చేసిందన్నారు. బీజేపీని ఓడించి దేశంలో సెక్యులర్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందామని, నాగేందర్​ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. దానం గెలిస్తే..రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, దానం ఇద్దరూ జోడెద్దుల్లాగా తనకు అండగా ఉంటారని చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-25T03:16:53Z dg43tfdfdgfd