'పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకుంటే నన్ను పిచ్చిదానిలా చూశారు'

పిల్లలను కనకూడదని నిర్ణయం తీసుకుంటున్న మహిళల సంఖ్య పెరుగుతోంది, ప్రపంచ జననాల రేటూ పడిపోతోంది. ఈ నిర్ణయం వెనుక వాతావరణ ఆందోళనల నుంచి ఆర్థిక, ఆరోగ్య సమస్యల వరకు వారి వారి కారణాలు ఉన్నాయి.

'పిల్లలను కనకూడదు' అనే నిర్ణయాన్ని సొసైటీ అంగీకరించడం లేదని, బహిష్కరణకు గురైనట్లు అనిపిస్తుంటుందని పలువురు అంటున్నారు.

ఇలాంటి మహిళల కోసం ఏర్పాటు చేసిన 'బ్రిస్టల్ చైల్డ్‌ఫ్రీ ఉమెన్' సభ్యులతో బీబీసీ మాట్లాడింది.

మహిళలే ఏర్పాటుచేసిన ఆ గ్రూపులో 500 కంటే ఎక్కువ మంది సభ్యులున్నారు. వీరంతా పిల్లల్ని కనకూడదని నిర్ణయం తీసుకున్నవారే.

'ఆ వయసు కష్టంగా గడిచింది'

కరోలిన్ మిచెల్ ఎప్పుడూ పిల్లలను కోరుకోలేదు, అయితే "పిల్లలను కనే వయస్సు'' కష్టంగా గడిచినట్లు ఆమె తెలిపారు.

46 ఏళ్ల కరోలిన్ బ్రిస్టల్‌లోని బ్రిస్లింగ్‌టన్‌లో తన భర్తతో కలిసి నివసిస్తున్నారు. స్నేహితులు, పరిచయస్తులకు పిల్లలు పుడుతుండటంతో తను ఎదుర్కొన్న ప్రశ్నలు ఊహించలేదని కరోలిన్ అంటున్నారు.

"నాకు విచిత్రంగా అనిపిస్తుంటుంది. నా దృక్పథం, నా అనుభవాన్ని గుర్తించడం లేదనుకుంటున్నా" అని కరోలిన్ ఆవేదన వ్యక్తంచేశారు.

కరోలిన్ దృష్టిలో ఈ సమాజం మాతృత్వం కోసమే ఉంది. "జనాలను కలుసుకోవడం నాకు చాలా కష్టం. ఎందుకంటే స్కూల్ గేట్లు, క్లబ్‌ల వద్ద తల్లి కోసమంటూ బోర్డులు కనిపిస్తాయి'' అని కరోలిన్ అంటున్నారు.

ఆమె స్నేహితులలో చాలామందికి పిల్లలున్నారు. వారు ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయనప్పటికీ, వారంతా ఒకే పనిచేస్తుంటారు. కరోలిన్ మరొక పని చేస్తుంటారు, ఇది ఆమెకు ఇబ్బందిని కలిగిస్తుందంటున్నారు.

ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2020లో ఇంగ్లండ్, వేల్స్‌లో 30 ఏళ్లు దాటిన వారిలో సగానికి పైగా (50.1శాతం) మహిళలు పిల్లలు లేకుండా ఉన్నారు.

బ్రిస్టల్‌లో నివసిస్తున్న మేగాన్ స్టాన్లీ, పిల్లలు కనకూడదనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఆమె 19 సంవత్సరాల వయస్సు నుంచి స్టెరిలైజ్ కోసం (గర్భం నిరోధించడం) ప్రయత్నిస్తున్నారు.

ప్రతి నెల శరీరానికి సంబంధించిన బాధలు అనుభవించడం క్రూరంగా అనిపిస్తుందని మేగాన్ చెప్పారు.

"స్టెరిలైజేషన్ పీరియడ్స్‌ను పరిష్కరించదని నాకు తెలుసు, అయితే, ఇది ఉపశమనం కలిగిస్తుంది" అని ఆమె అభిప్రాయపడ్డారు.

అడుగడుగునా కష్టాలు దాటుకుంటూ ఇక్కడికి వచ్చానని 31 ఏళ్ల మేగాన్ అంటున్నారు.

''మీరు ఇంకా యవ్వనంగానే ఉన్నారు, మరోసారి ఆలోచించండని వైద్యులు చెబుతుంటారు'' అని ఆమె గుర్తుచేసుకున్నారు.

మేగాన్‌ 29 ఏళ్ల వయస్సులో ఒక సర్జన్‌‌ను కలిశారు."ఆ రోజు నేను ప్రతిదీ రెడీ చేసుకున్నా, నా మెడికల్ హిస్టరీ సిద్ధం చేసుకున్నా. చాలా చేశాను" అని మేగాన్ అన్నారు.

అయితే, గైనకాలజిస్ట్ మేగాన్ రిలేషన్ షిప్ స్టేటస్ వివరాలు తెలుసుకున్న తర్వాత సర్జరీకి అంగీకరించలేదు.

"ఆ సమయంలో నేను అతనితో బహుశా మూడు నెలలుగా డేటింగ్ చేస్తున్నాను" అని మేగాన్ గుర్తుచేసుకున్నారు.

తన పార్ట్‌నర్‌కు కూడా కచ్చితంగా పిల్లలు అక్కర్లేదని, ఆయన అప్పటికే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారని డాక్టర్‌కి చెప్పారు మేగాన్.

'ఇది నా శరీరం'

పార్ట్‌నర్‌కి వేసెక్టమీ చేసి ఉంటే "అప్పుడు మీరు దీన్ని చేయించుకోవల్సిన అవసరం లేదు" అని డాక్టర్ చెప్పారని మేగాన్ అన్నారు.

''అతని శరీరానికి చేయించుకున్న దానికి, నా శరీరంతో సంబంధం ఏమిటి?'' అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

"మేము దాని గురించి ఎక్కువగా మాట్లాడం. మాతృత్వం మీ ముఖంలో ఎల్లప్పుడూ ఉంటుంది" అని కరోలిన్ అంటున్నారు.

సమాజం కట్టుబాటుకి సరిపోకపోవడం చాలా కష్టమని, కొన్ని సమయాల్లో భిన్నంగా ఉండాలనీ కోరుకున్నానని ఆమె తెలిపారు.

చాలామంది మహిళలకు వారు తీసుకునే నిర్ణయాలు వారిని వెంటాడతాయని కరోలిన్ అభిప్రాయపడ్డారు.

12 ఏళ్ల వయసులోనే నిర్ణయించుకున్నా...

తన తల్లి ఇబ్బందులను చూసి 12 ఏళ్ల వయసులోనే తల్లి కాకూడదని అనుకున్నానని ఫియోనా పౌలి తెలిపారు.

“ఆమె పిల్లలను పెంచడాన్ని ఇష్టపడలేదు. దాన్నుంచి తప్పించుకోవడానికి ఈరోజున్న స్వతంత్రం ఆమెకు లేదు” అని ఫియోనా అభిప్రాయపడ్డారు.

''మాతృత్వం సరదా కాదనుకున్నా, నా తల్లి మాదిరి జీవించకపోవడమే మంచిదనుకున్నా'' అని ఆమె తెలిపారు.

49 ఏళ్ల ఫియోనా బ్రిస్టల్ చైల్డ్‌ఫ్రీ ఉమెన్ గ్రూప్‌ను నడుపుతున్నారు.

ఇక తనకు రుతుక్రమం ఆగినట్లుగా అనిపించినా, పిల్లలను కనలేనని తెలిసినా ఆమె భయపడటం లేదు. "ఇది చాలా సౌకర్యంగా అనిపిస్తుంది" ఫియోనా అంటున్నారు.

వృద్ధాప్యంలో ఎవరు చూసుకుంటారు?

ఎవరైనా కొత్తవాళ్లు కలిస్తే పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నట్లు చెబితే ప్రతికూలంగా స్పందించారని ఫియోనా తెలిపారు.

"మీరు చింతిస్తారు, పిల్లలు లేకుండా మీరు మహిళగా ఉండలేరన్నారు" అని ఫియోనా గుర్తుచేసుకున్నారు.

ఫియోనాను అక్కడి వాళ్లు "స్వార్థపరురాలు" అని పిలుస్తుంటారు, అయితే, ఆమెను వృద్ధాప్యంలో ఎవరు చూసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

"జనం అసౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలాంటిది వారు అనుభవించి ఉండరు" ఫియోనా అన్నారు.

పిల్లలు వద్దనుకుంటే ఒకప్పుడు తనపట్ల చాలా చెడుగా ప్రతిస్పందన వచ్చిందని మేగాన్ తెలిపారు.

పిల్లలను ద్వేషించే వ్యక్తిగా, నీచమైన వ్యక్తిగా తనను కొందరు చిత్రించారని మేగాన్‌ అంటున్నారు.

పిల్లలను కోరుకోకపోవడం అనేది ఒక సహజమైన విషయం అని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.

'పశ్చాత్తాపం చెందను'

పిల్లలు కనకూడదని నిర్ణయించుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని ఫియోనా చెప్పారు.

వాటిలో ముఖ్యంగా అనారోగ్య కారణాలని ఆమె భావన. అయితే, అకస్మాత్తుగా వృద్ధురాలిగా మేల్కొని, పశ్చాత్తాపం చెందబోనని ఫియోనా అంటున్నారు.

పిల్లలు కనకపోవడానికి ఇబ్బందులు చాలానే ఉన్నాయని కరోలిన్ చెప్పారు. వాటిలో భర్తతో సంబంధం, తన అభిరుచులపై దృష్టి పెట్టడం ఉన్నాయని తెలిపారు.

"పిల్లలు లేకపోవటం చాలా ఆనందంగా ఉంది" అని మేగాన్ అంటున్నారు. ఇది స్వేచ్ఛ, డబ్బు గురించి కాదని, ఎంపికపైనే అని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-04-28T03:21:45Z dg43tfdfdgfd